ఎన్ని రోజులు ఇలా..?
ఎన్ని రోజులు ఇలా..?
Published Sat, Nov 26 2016 11:01 PM | Last Updated on Mon, Sep 4 2017 9:12 PM
మా కూతురు వయసు 17 సంవత్సరాలు. తనకు మెచ్యూర్ అయిన దగ్గరి నుంచి పీరియడ్స్ సక్రమంగా రావట్లేదు. డాక్టర్‌ను కలిస్తే టెస్టులు అన్నీ చేశారు. తనకు థైరాయిడ్ ఉందని, అలాగే పీసీఓ కూడా వచ్చిందని చెప్పారు. అప్పటి నుంచి ట్యాబ్లెట్స్ వాడుతూనే ఉంది. ఇంకా ఎన్ని రోజులకు ఈ సమస్య తగ్గుతుంది? అలాగే థైరాయిడ్ గురించి వాడుతున్న మందులు కూడా ఇంకా ఎన్ని రోజులు వేసుకోవాలి?
- సుమలత, ఖమ్మం
మీ పాప ఎత్తు, బరువు రాయలేదు. ఒక వేళ బరువు ఎక్కువగా ఉంటే బరువు తగ్గించడానికి ప్రయత్నించాలి. థైరాయిడ్ సమస్య ఉంటే, చాలా మందిలో ఎప్పటికీ థైరాయిడ్ మందులు వాడవలసి ఉంటుంది. చాలా కొంత మందిలో మటుకే, థైరాయిడ్ తక్కువ తీవ్రతలో ఉంటే, బరువు తగ్గి, మందులు సక్రమంగా వాడుతూ ఉంటే కొంతకాలానికి థైరాయిడ్ నియంత్రణలోకి వస్తుంది. పిసిఓ అంటే అండాశయంలో నీటిబుడగలు ఉండడం. వీటివల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం, అవాంఛిత రోమాలు, మొటిమలు వంటి సమస్యలు ఏర్పడతాయి. వీటికి జీవనశైలిలో మార్పులు వ్యాయామాలు చెయ్యడంతో పాటు మందులు దీర్ఘకాలం వాడవలసి ఉంటుంది. చికిత్సలో నీటిబుడగలు మొత్తంగా తగ్గిపోవు కాని, అవి ఇంకా పెరగకుండా హార్మోన్ల అసమతుల్యత కొద్దిగా తగ్గి లక్షణాలు చాలావరకు తగ్గే అవకాశాలు ఉంటాయి.
నా వయసు 26 ఏళ్లు. పదిహేను రోజుల క్రితం సిజేరియన్ ద్వారా ఓ పాపకు జన్మనిచ్చాను. పాప చాలా ఆరోగ్యంగా మూడు కిలోల బరువుతో పుట్టింది. నేను మొదటి నుంచీ నార్మల్ డెలివరీ కావాలని కోరుకున్నాను. కానీ డెలివరీ సమయంలో డాక్టర్లు నాకు నార్మల్ కాదని చెప్పారు. ఏదో పొర అడ్డంగా ఉందని, పాప తిరగలేదని చెప్పారు. మళ్లీ ప్రెగ్నెంట్ అయినా సిజేరియన్ అవుతుందన్నారు. అసలు ఆ పొర ఎందుకు ఏర్పడుతుందో చెప్పండి ప్లీజ్.
- స్వాతి, వరంగల్
పొర అనేది ఎక్కడ ఉందో సరిగా వివరించలేదు. నాకు అర్థం అయినంతవరకు కొందరిలో గర్భాశయం లోపలి భాగంలో యుటరైన్ సెప్టమ్ అనే పొర గర్భాశయంపై దాన్ని రెండుగా చీల్చినట్లు చేస్తుంది. దానివల్ల గర్భాశయంలో పెరిగే శిశువుకి తిరగడానికి సరిగా అనువుగా స్థలం లేకపోవడం వల్ల, శిశువు కాన్పు సమయానికి అడ్డంగా ఉండటం, లేక ఎదురుకాళ్ళతో ఉండటం జరుగుతుంది. బిడ్డ సరైన పొజిషన్‌లోకి తిరగకపోవడం వల్ల, సాధారణ కాన్పు జరగడానికి శిశువుకి ఇబ్బంది అవుతుంది కాబట్టి సిజేరియన్ ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీయవలసి ఉంటుంది. కొందరిలో యోనిభాగంలో వెజైనల్ సెప్టెమ్ అనే పొర ఉండి కాన్పుకి అది అడ్డుపడడం వల్ల కూడా బిడ్డ యోని నుంచి బయటకు రావడానికి ఇబ్బంది పడవచ్చు అనిపిస్తే కూడా కొన్ని సందర్భాలలో ఆపరేషన్ చెయ్యవలసి ఉంటుంది. పొర బాగా మందంగా ఉన్నప్పుడు మరలా కూడా బిడ్డకు ఇదే ఇబ్బంది ఏర్పడుతుంది కాబట్టి మరలా ఆపరేషన్ అవసరం పడుతుంది.
నాకు 31 సంవత్సరాలు. పీరియడ్స్ మొదటి నుంచీ నాకు సక్రమంగానే వస్తాయి. ఇప్పటి వరకు ఎలాంటి సమస్యలూ రాలేవు. కానీ ఈ మధ్య సమస్యగా ఉండి డాక్టర్‌ను సంప్రదించాను. దాంతో నాకు ఈస్ట్ ఇన్‌ఫెక్షన్ వచ్చిందన్నారు. అసలు ఈ ఇన్‌ఫెక్షన్ ఎందుకు వస్తుంది. అలాగే ఈస్ట్ ఇన్‌ఫెక్షన్‌కు బ్యాక్టీరియల్ వ్యాజినోసిస్‌కు తేడా ఏంటి?
- ఓ సోదరి
ఈస్ట్ ఇన్‌ఫెక్షన్ అంటే ఫంగల్ ఇన్‌ఫెక్షన్. ఇది క్యాండిడా అనే ఫంగస్ వల్ల సంక్రమిస్తుంది. ఈ ఇన్‌ఫెక్షన్‌లో వైట్‌డిశ్చార్జి, తెల్లగా పెరుగులాగా, చిన్నచిన్న ముక్కలుగా ఉంటుంది. యోనిలో మంట, దురద, ఎర్రగా మారటం వంటి లక్షణాలు ఏర్పడతాయి. దీనికి చికిత్సగా యాంటి ఫంగల్ మందులు, క్రీములు, పౌడర్ వాడవలసి ఉంటుంది. వెజైనాలో (యోనిలో) ఉండే ్చఛిౌ్టఛ్చఛిజ్ఛీ అనే మంచి బ్యాక్టీరియా కొన్ని కారణాల వల్ల తగ్గిపోయి కొన్ని రకాల చెడ్డ బ్యాక్టీరియా వ్యాపించడం వల్ల బ్యాక్టీరియల్ వెజైనోసిస్ అనే ఇన్‌ఫెక్షన్ వస్తుంది. ఇందులో వైట్‌డిశ్చార్జి కొద్దిగా పచ్చగా, చెడువాసన, దురద వంటివి ఉంటాయి. దీనికి చికిత్స యాంటిబ్యాక్టీరియల్ మందులతో ఉంటుంది. రెండింటికి లక్షణాలలో, చికిత్సలో తేడా ఉంటుంది.
Advertisement
Advertisement