ఎందుకిలా జరుగుతోంది?
నా వయసు 32. ఎత్తు 5.2 అడుగులు. బరువు 59 కిలోలు. ఆరేళ్ల కిందట పెళ్లయింది. నాలుగుసార్లు గర్భం దాల్చినా నిలవలేదు. నెల్లాళ్ల కిందటే నాలుగో అబార్షన్ జరిగింది. డాక్టర్ల సూచనలను పాటిస్తూనే ఉన్నాను. అయినా ఇలా ఎందుకు జరుగుతోంది? దీనికి పరిష్కారం ఏమైనా ఉందా?
– రామలక్ష్మి, హోసూరు
నాలుగుసార్లు అబార్షన్లు అయ్యాయి అని రాశారు. అవి ఎన్ని నెలలకు అయ్యాయి? గర్భం దాల్చిన తర్వాత స్కానింగ్ చేశారా లేదా, పిండం ఏర్పడలేదన్నారా లేదా పిండం గుండె కొట్టుకోవట్లేదన్నారా, రక్త పరీక్షలు చేశారా అనే విషయాలను తెలిపి ఉంటే బాగుండేది. ఈ విషయాల మీద, కొంతమందిలో అబార్షన్లకు గల కారణాలను అంచనా వేసుకుని, దానిని బట్టి, మరలా గర్భం దాల్చిన ముందు నుంచే చికిత్స తీసుకుని తర్వాత గర్భం కోసం ప్రయత్నిస్తే, చాలావరకు అబార్షన్లు అయ్యే అవకాశం తగ్గుతుంది. కొంతమందిలో థైరాయిడ్, ప్రొజెస్టిరాన్ వంటి హార్మోన్ల అసమతుల్యత, గర్భాశయంలో పొరలు, ఫైబ్రాయిడ్స్ అండాశయాలలో నీటి బుడగలు, జన్యుపరమైన సమస్యలు, మధుమేహ వ్యాధి, తల్లిలో శిశువుకి వ్యతిరేకంగా యాంటి ఫాస్పొలిపిడ్∙యాంటీ బాడీలు వంటి అనేక కారణాల వల్ల అబార్షన్లు మళ్లీ మళ్లీ అయ్యే అవకాశాలు ఉంటాయి. దానినే హ్యాబిట్యువల్ అబార్షన్స్ అంటారు. (భార్య, భర్త ఇద్దరూ రక్త పరీక్షలు, స్కానింగ్ చేయించుకుని, కారణాన్ని బట్టి చికిత్స తీసుకుని, మరలా ప్రయత్నించండి) భార్యభర్తల్లో జన్యు పరమైన సమస్యలు ఉంటే పిండం సరిగా ఏర్పడకుండా అబార్షన్లు అవ్వవచ్చు. అలాంటప్పుడు భార్య, భర్త ఇద్దరూ జన్యుపరమైన పరీక్షలు కోసం కారియో టైపింగ్ చేయించుకుని సమస్య ఎక్కడుందో తెలుసుకోవటం మంచిది.
నా వయసు 42. బరువు 70 కిలోలు, ఎత్తు 5.2 అడుగులు. నాకు మూడేళ్ల కిందట పెళ్లి జరిగింది. ఆలస్యంగా పెళ్లి కావడం వల్ల గర్భందాల్చే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు. సంతానం కోసం రెండుసార్లు ఐవీఎఫ్ ద్వారా చేసిన ప్రయత్నాలు ఫెయిలయ్యాయి. మరోసారి ప్రయత్నించవచ్చా? ఒకవేళ ప్రయత్నిస్తే ఎన్నాళ్లు ఆగాల్సి ఉంటుంది? ఐవీఎఫ్ కంటే మెరుగైన ప్రత్యామ్నాయం ఏదైనా ఉందా?
– జగదాంబ, కర్నూలు
మీరు గమనించవలసిన విషయాలు. ఒకటి వయసు 42 సం., మీ ఎత్తుకి 70 కిలోలు అంటే అధిక బరువు. సాధారణంగా ఆడవారిలో 35 సం.లు దాటేకొద్దీ అండాల సంఖ్య, అలాగే వాటి నాణ్యత తగ్గటం మొదలవుతాయి. అవి 40 దాటితే నాణ్యత ఇంకా క్షీణిస్తుంది. అండం నాణ్యత సరిగా లేనప్పుడు, పిండం ఏర్పడటంలో లోపాలు, పిండాన్ని గర్భాశయం స్వీకరించకపోవడం వంటి ఎన్నో కారణాల వల్ల మీకు ఐవీఎఫ్ చేసినా ఫలితం దక్కకపోయి ఉండవచ్చు. వయసు తక్కువగా ఉండి ఉంటే మూడోసారి కూడా ప్రయత్నించి ఉండవచ్చు. మీకు ఇంకా చూడాలను కుంటే ఐవీఎఫ్ తర్వాత 6 నెలలు లేదా సంవత్సరం ఆగి ప్రయత్నించ వచ్చు. కాని మళ్లీ వయసు పెరుగుతోంది కదా. కాబట్టి మీరు ఈసారికి డోనార్ నుంచి (దాత నుంచి) స్వీకరించిన అండంతో, ఐవీఎఫ్ ప్రయత్నించ వచ్చు. దీనివల్ల, అండం నాణ్యత బాగా ఉన్నప్పుడు గర్భం దాల్చే అవకాశాలు పెరుగుతాయి. అలా చేసినా గర్భం నిలవకపోతే, మీ గర్భాశయం, పిండాన్ని స్వీకరించట్లేదు కాబట్టి, మీ ఆరోగ్య పరిస్థితి తెలిసిన చికిత్స ఇస్తున్న డాక్టర్ అభిప్రాయం మేరకు సరోగసీకి ప్రయత్నం చేయవచ్చు. ఈ లోపల మీరు పది కేజీల అధిక బరువు ఉన్నారు. బరువు తగ్గి చికిత్స మొదలుపెట్టడం మంచిది. లేదంటే గర్భం ఆగడానికి ఇబ్బందులు, ఒకవేళ గర్భంవచ్చిన తర్వాత 42 వయసుతో పాటు, బరువు వల్ల బీపీ, షుగర్ వంటి అనేక సమస్యలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
నాకు ఇటీవలే పెళ్లి జరిగింది. నా వయసు 21. ఎత్తు 5.4, బరువు 47 కిలోలు. బర్త్ కంట్రోల్ పిల్స్ వాడుతున్నాను. గత నెలలో ఊరికి వెళ్లినప్పుడు మూడు రోజులు పిల్స్ వేసుకోవడం కుదరలేదు. దీనివల్ల ఏవైనా సమస్యలు ఉంటాయా?
– సుప్రియ, ఏలూరు
బర్త్ కంట్రోల్ పిల్స్ వాడేటప్పుడు, అవి తప్పకుండా రోజు ఒకే సమయానికి మర్చిపోకుండా వేసుకుంటేనే అవి సరిగా పనిచేసి, గర్భం రాకుండా ఆపుతాయి. వీటిని సాధారణంగా పీరియడ్ మొదలైన మూడవ రోజు నుంచి మొదలుపెట్టి, మొత్తం ప్యాకెట్ అయిపోయేవరకు వేసుకోవాలి. కొన్ని పిల్స్ ప్యాకెట్‌లో హార్మోన్ల మోతాదును బట్టి, కొన్నింటిలో 21 మాత్రలు, కొన్నింటిలో 24 మాత్రలు, కొన్నింటిలో 28 మాత్రలు. వాటిలో 21 హార్మోన్ మాత్రలు తెల్ల రంగులో, మిగతా 7 ఐరన్ మాత్రలు నల్ల రంగులో ఉంటాయి. హార్మోన్ల మాత్రలను నెలలో ఒకసారి కంటే ఎక్కువ మర్చిపోతే గర్భం నిలిచే అవకాశాలు ఉంటాయి. నువ్వు 3 రోజులు ఏ రోజుల్లో ఎప్పుడు వేసుకోలేదో రాయలేదు. వీటిని ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి, వారికి రెగ్యులర్ పీరియడ్స్ కాదా అనేదాని బట్టి, ఒకవేళ ఆఖరు రోజుల్లో మర్చిపోతే , గర్భం వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఒకవేళ ప్యాకెట్ మధ్యలోనే మాత్రలు వేసుకోకపోతే గర్భం నిలిచే అవకాశాలు ఉంటాయి. ఇది కాకుండా, ట్యాబ్లెట్స్ సరిగా వేసుకోకుండా మర్చిపోవడం వల్ల, బ్లీడింగ్ తొందరగా మొదలవటం లేదా కొద్దికొద్దిగా కనిపించటం, ఆ నెలంతా బ్లీడింగ్‌లో అవకతవకలు కనిపించవచ్చు.
డా‘‘ వేనాటి శోభ
లీలా హాస్పిటల్
మోతీనగర్, హైదరాబాద్