పిల్స్ అంటేనే భయం...
నాకు కొత్తగా పెళ్లయింది. పిల్లలు అప్పుడే వద్దనుకుంటున్నాం. పిల్స్ ఎక్కువగా వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని ఎక్కడో చదివాను. అప్పటి నుంచి పిల్స్ అంటేనే భయం పట్టుకుంది. అసలు మాత్రలు వాడడం మంచిదేనా, ఏ మేరకు వాడొచ్చు అనేది చెప్పగలరు. పురుషుల కోసం కుటుంబ నియంత్రణ సాధనాలు కొత్తగా ఏమైనా వచ్చాయా తెలియజేయగలరు.
– రాగిణి, చిత్తూరు
తాత్కాలికంగా పిల్లలు వద్దనుకున్నప్పుడు, అనేక మార్గాలలో గర్భ నిరోధక మాత్రలు వాడటం ఒక మార్గం. ఈ మాత్రలలో ఈస్ట్రోజన్, ప్రొజస్టరాన్ హార్మోన్లు వివిధ రకాల మోతాదులో ఉంటాయి. వీటి ప్రభావం వల్ల, అండం తయారు కాకపోవడం లేదా గర్భాశయ ముఖద్వారంలోని ద్రవాలను చిక్కగా మార్చడం, వీర్య కణాలు గర్భాశయం లోపలకు వెళ్లకుండా అడ్డుకోవడం, తద్వారా గర్భం రాకుండా ఆపుతాయి. వీటిలోని హార్మోన్ల వల్ల, ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి కొందరిలో వికారం, వాంతులు, కళ్లు తిరిగినట్లు ఉండి మెల్లగా అలవాటు పడతారు. కొందరిలో తర్వాత కూడా ఈ లక్షణాలు తగ్గకపోవచ్చు. అలాంటప్పుడు మాత్రల వాడకం ఆపివేయవలసి ఉంటుంది. మాత్రలలో ఉన్న ఈస్ట్రోజన్ హార్మోన్ మోతాదును బట్టి లక్షణాలు ఉంటాయి. అధిక బరువు ఉన్నవారు, మైగ్రేన్ ఉన్నవారు, లివర్ సమస్యలు ఉన్నవారు, రక్తం త్వరగా గూడు కట్టే గుణం ఉన్నవాళ్లు ఇవి వాడకపోవటం మంచిది. ఇప్పుడు మూడు అతి తక్కువ మోతాదులో దొరికే లో డోస్ పిల్స్ రెండు, మూడు సంవత్సరాల వరకు వాడుకోవచ్చు. ఇవి డాక్టర్‌ను సంప్రదించి వారి సలహా మేరకు వాడటం మంచిది. మగవారు కుటుంబ నియంత్రణ కోసం వాడటానికి మందులు, ఇంజక్షన్‌లు ఇంకా ప్రయోగాత్మక దశలోనే ఉన్నాయి. వారు వాడుకోవటానికి కేవలం కండోమ్స్ మాత్రమే ఉన్నాయి. కాని జాగ్రత్తగా వాడకపోతే ఫెయిల్ అయ్యి గర్భం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
డాక్టరు గారు... నా వయసు 26 సంవత్సరాలు. మా ఆయన వయసు 28 సంవత్సరాలు. పెళ్లై సంవత్సరం దాటింది. మాకు సంతానం కలగలేదు. నాకు పిరియడ్స్ సక్రమంగానే వస్తుంది. వైద్య పరీక్షల్లో ఏ సమస్య లేదని చెప్పారు. మాకు పిల్లలు కలగాలంటే ఏ సమయాల్లో కలుసుకుంటే బాగుంటుంది తెలియజేయగలరు.
– వి.బిందు, పాడేరు
సాధారణంగా భార్య, భర్తల్లో ఏ సమస్య లేనప్పుడు, 80 శాతం మంది పెళ్లయిన సంవత్సరం లోపల గర్భం దాల్చుతారు. 15 శాతం మంది రెండు సంవత్సరాల లోపల గర్భం దాల్చుతారు. మిగతా 5 శాతం మందికి మాత్రమే, చికిత్స అవసరమవుతుంది. మీకు పెళ్లై సంవత్సరమే అయ్యింది. వైద్య పరీక్షలలో సమస్యలు ఏమీ లేవు కాబట్టి, ఇంకొక సంవత్సరం పాటు సాధారణ గర్భం కోసం ప్రయత్నించవచ్చు. వైద్య పరీక్షలు నీకు మాత్రమే చేశారా లేక మీ వారికి కూడా వీర్య పరీక్ష చేశారా అనే విషయం సరిగా తెలుపలేదు. మీ వారికి కూడా వీర్య పరీక్ష చేసి, వీర్య కణాల సంఖ్య, కదలిక సరిగా ఉంటే పర్వాలేదు. ఒకవేళ చెయ్యకపోతే, చేయించి చూడండి. అన్నీ బాగుంటే నీకు నెలనెలా పీరియడ్స్ సక్రమంగా వస్తున్నాయి కాబట్టి, బ్లీడింగ్ మొదలైన రోజు మొదటి రోజుగా లెక్కపెట్టి, 9వ రోజు నుంచి 16వ రోజు లోపల కలవడం వల్ల గర్భం నిలిచే అవకాశాలు పెరుగుతాయి.
నేను చాలా బలహీనంగా ఉంటాను. బరువు కూడా చాలా తక్కువ. వైట్ డిశ్చార్జి సమస్య ఉంది. మరోవైపు మా వాళ్లు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. నాకున్న సమస్య వల్ల పెళ్లి చేసుకోవడం సరైనదేనా? పెళ్లి వల్ల సమస్యలేమైనా వస్తాయేమోనని భయంగా ఉంది. మీ సలహా కావాలి.
– డి.కె, మార్టూర్
సన్నగా, బలహీనంగా ఉన్నప్పుడు, ఎందుకు అలా ఉన్నానని విశ్లేషించుకోవాలి. ఆకలి లేకపోవటం, ఆహారం సరిగా తీసుకోకపోవటం, మానసిక, శారీరక ఒత్తిడి, హార్మోన్ల లోపం, ఆరోగ్య సమస్యలు వంటివి ఎన్నో కారణాలు కావచ్చు. రక్తహీనత వల్ల కూడా నీరసంగా ఉండటం, ఇన్‌ఫెక్షన్స్ ఏర్పడటం, కడుపులో నులిపురుగులు వంటి కారణాల వల్ల వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా అవుతుండవచ్చు. నీ వయస్సు ఎంతో రాయలేదు. సన్నగా, బలహీనంగా ఉన్నప్పుడు వైవాహిక జీవితంలో కూడా నీరసంగా ఉండటం, త్వరగా అలసిపోవటం వంటి ఇబ్బందులు ఏర్పడవచ్చు. వైట్ డిశ్చార్జ్ ఇన్‌ఫెక్షన్‌తో కూడినది. అయితే, పెళ్లి తర్వాత ఇంకా ఎక్కువ అయ్యి దురద, వాసన, పొత్తి కడుపులో నొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ. మొదట పాలు, పప్పులు, పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, మాంసాహారం, గుడ్లు వంటి పౌష్టికాహారం రోజూ తీసుకుని, కొద్దిగా బరువు పెరిగి, బలహీనతను పోగొట్టవచ్చు. అలా చేసినా ఉపయోగం లేనప్పుడు, డాక్టర్‌ని సంప్రదించి, సమస్య ఎక్కడ ఉందో పరీక్షలు చేయించుకుని దానిని బట్టి చికిత్స తీసుకోవచ్చు.