సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉంటాయా? | sakshi health councling | Sakshi
Sakshi News home page

సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉంటాయా?

Published Sat, Feb 4 2017 11:35 PM | Last Updated on Tue, Sep 5 2017 2:54 AM

సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉంటాయా?

సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉంటాయా?

ప్రస్తుతం నేను ప్రెగ్నెంట్‌ని. గతంలో ఒకసారి ‘ముత్యాల గర్భం’ అనే దాని గురించి విని ఉన్నాను. అయితే వివరాలేవీ సరిగా గుర్తులేవు. ఇంతకీ ‘ముత్యాల గర్భం’ అంటే ఏమిటి? ఎందుకు వస్తుంది? నాలాంటి వాళ్లు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా?
– రమ్య, కరీంనగర్‌

గర్భం దాల్చినప్పుడు గర్భాశయంలో పిండంతో పాటు దానికి తల్లి నుంచి రక్తం సరఫరా అందించేందుకు మాయ ఏర్పడుతుంది. కొందరిలో సరిగా తెలియని అనేక రకాల కారణాల వల్ల పిండం పెరగకుండా, మాయ మాత్రమే గర్భాశయంలో ముత్యాల్లాంటి నీటి బుగ్గలుగా మారి, అది పెరిగిపోతూ ఉంటుంది. దీనినే ముత్యాల గర్భం అంటారు. పిండం నిర్మాణంలో లోపం, ఒక అండంలోకి రెండు శుక్రకణాలు వెళ్లి ఫలదీకరణ చెందినప్పుడు, నిర్వీర్యమైన అండంలోకి ఒక శుక్రకణం వెళ్లి, ఫలదీకరణ చెంది, అది విభజన జరిగినప్పుడు హార్మోన్ల అసమతుల్యత, వ్యాధి నిరోధక వ్యవస్థలో మార్పులు, విటమిన్‌ ఎ లోపం వంటి ఎన్నో కారణాల వల్ల ముత్యాల గర్భం ఏర్పడుతుంది. నెలలు పెరిగే కొద్దీ ముత్యాల నీటి బుగ్గలు రెట్టింపు అవుతూ, గర్భాశయం పెద్దగా పెరుగుతూ ఉండి, మధ్యమధ్యలో నీరు, రక్తం కలిసి కొద్దికొద్దిగా బ్లీడింగ్, కడుపులో నొప్పి వంటి లక్షణాలు కనిపించవచ్చు. లేకపోతే అది గర్భాశయంలోని అన్ని పొరలలోకి పాకి, లోపలే బ్లీడింగ్‌ ఎక్కువగా అయ్యి, మనిషి పాలిపోయినట్లుండి, బాగా ఆయాసపడిపోతూ, షాక్‌లోకి వెళ్లిపోవచ్చు. కొందరిలో ఉన్నట్లుండి రక్తస్రావం అధికంగా అయ్యి, ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లవచ్చు. దీనికి చికిత్స... ముత్యాల గర్భాన్ని డి మరియు సి లేదా సక్షన్‌ ఎవాక్యుయేషన్‌ ద్వారా తీసివేయడం. ముత్యాల గర్భం రాకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి మన చేతిలో ఏమీ లేదు. కాకపోతే రెండు, మూడు నెలలలో స్కానింగ్‌ చేయించుకోవడం వల్ల ముందుగానే ఈ సమస్యను గుర్తించి కాంప్లికేషన్స్‌లోకి వెళ్లకముందే దానిని తొలగించవచ్చు.

మా బంధువుల్లో ఒకరికి చాలాకాలం నుంచి పిల్లలు లేరు. ‘డి అండ్‌ సీ ఆపరేషన్‌’ ద్వారా మహిళలకు పిల్లలు కలిగేలా చేస్తారని చదివాను. ‘డి అండ్‌ సీ ఆపరేషన్‌’ అంటే ఏమిటి? ఈ ఆపరేషన్‌ వల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఏమైనా ఉంటాయా? ‘కొందరు మాత్రమే ఈ ఆపరేషన్‌కు అర్హులు’ (శారీరక పరిస్థితులను బట్టి)లాంటివి ఏమైనా ఉన్నాయా? తెలియజేయగలరు?
– డి.జానకి, విజయనగరం

డి అండ్‌ సీ ఆపరేషన్‌ అంటే డైలటేషన్‌ అండ్‌ క్యూరెటాజ్‌. గర్భసంచి ద్వారమైన సర్విక్స్‌ను డైలేట్‌ చేసి అంటే కొద్దిగా తెరవడానికి వెడల్పు చేసి గర్భాశయంలోని పొరను క్యూరెట్‌ అనే పరికరం ద్వారా శుభ్రం చేయడం (గీకటం). కేవలం డి అండ్‌ సీ చెయ్యడం వల్లనే గర్భం దాల్చరు. అండం విడుదల అవ్వడం, సరిగా ఉండి, ట్యూబ్స్‌ తెరుచుకుని ఉండి, మగవారిలో వీర్య కణాలు సరిగా ఉన్నా, మిగతా హార్మోన్లలలో అసమతుల్యత వంటి ఇతర సమస్యలు ఏమీ లేకుండా ఉండి, గర్భాశయ ద్వారం చాలా సన్నగా ఉన్నప్పుడు డి అండ్‌ సీ ద్వారా, ఆ ద్వారాన్ని వెడల్పు చెయ్యడం వల్ల వీర్య కణాలు తేలికగా గర్భాశయంలోకి ప్రవేశించడం ద్వారా గర్భం వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అంతే కాని, డి అండ్‌ సీ ద్వారా గర్భం కచ్చితంగా వస్తుందని చెప్పలేం. అలాగే గర్భాశయంలోని పొరను శుభ్రం చేయటం, అలానే దానిని గీకటం వల్ల కొందరిలో మళ్లీ పొర ఆరోగ్యంగా ఏర్పడి పిండం గర్భాశయంలో (అతుక్కోవడానికి) నిలబడడానికి (ఇంప్లాన్‌టేషన్‌) దోహద పడుతుంది. ఆధునిక చికిత్స లేని పాతకాలంలో పిల్లలు కలగనివారికి దాదాపుగా అందరికి డి అండ్‌ సీ చేసేవాళ్లు. దాంతో మిగతా ఇబ్బందులు లేనప్పుడు, చాలామందికి గర్భం రావడం జరిగేది. దీనినే వాడుక భాషలో కడుపు కడగటం, గర్భ సంచిని కడగటం అంటారు. ఈ ఆపరేషన్‌ ఎవరైనా చేయించుకోవచ్చు. నొప్పి తెలియకుండా మత్తు ఇచ్చి, యోని భాగంలో నుంచి డి అండ్‌ సీ చేస్తారు. శుభ్రత పాటించని హాస్పిటల్స్‌లో చెయ్యించుకుంటే ఇన్‌ఫెక్షన్‌లు వచ్చే అవకాశాలు ఉంటాయి. అంతకంటే వేరే సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఏమీ ఉండవు. గర్భాశయంలో శుభ్రం చేసిన పొరను బయాప్సీకి పంపిస్తే, దానిలో ఏవైనా సమస్యలు ఉంటే తెలుస్తాయి.

నాకు కొత్తగా పెళ్లయింది. అయితే నా భర్త నాకు దూరంగా ఉంటున్నారు. ‘ఆమె దగ్గర విపరీతమైన దుర్వాసన వస్తుంది’ అని నా గురించి ఎవరితోనో చెప్పారట. నిజానికి శుభ్రత విషయంలో నేను చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాను. ‘అతి శుభ్రత పాటిస్తావు’ అని కూడా వెక్కిరించేవాళ్లు. అలాంటి నా దగ్గర దుర్వాసన రావడం ఏమిటో అర్థం కావడం లేదు. దీనికి సంబంధించి ఏదైనా చెబుతారని ఆశిస్తున్నాను.
– డి.కె, నిర్మల్‌

మీ వారి దృష్టిలో దుర్వాసన అంటే ఎక్కడి నుంచి వస్తుందని ఆలోచిస్తున్నారో. కొంతమందిలో నోటి నుంచి కూడా దుర్వాసన రావచ్చు. కొందరిలో యోనిలో ఇన్‌ఫెక్షన్స్‌ వల్ల దుర్వాసన రావచ్చు. కొంతమంది మగవారు మనసులో ఏదో పెట్టుకుని, కారణం ఏదో ఒకటి చెబుతుంటారు. నిజంగా ఆయనకి ఏదైనా నీవల్ల ఇబ్బంది అనిపిస్తే అది నీతో మాట్లాడి, సమస్యకు మార్గం ఏమిటో, డాక్టర్‌కు చూపించటమో ఏదో చెయ్యాలి కాని, బయటవాళ్లకి నీమీద చెప్పటం వల్ల ఉపయోగం ఏమీ ఉండదు కదా! ఒకసారి నువ్వే ఆయనతో నీ వల్ల ఆయనకు ఏమి ఇబ్బందిగా ఉందో మాట్లాడి, సమస్యను నువ్వే పరిష్కరించుకోవాలి. నిజంగా ఏదైనా ఇబ్బంది ఉంటే డాక్టర్‌కి చూపించి చికిత్స తీసుకోవచ్చు. లేకపోతే ఈ దూరం పెరిగిపోయి, మనస్పర్థలు వచ్చే అవకాశాలు ఉంటాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement