
వేధింపులు భరించలేక అన్నను చంపిన తమ్ముడు
రంగాపూర్ గ్రామంలో ఘటన
పెద్దపల్లి రూరల్ :
మానసిక పరిస్థితి సరిగాలేని ఓ వ్యక్తి కుటుంబసభ్యులను వేధిస్తుండడంతో అతడి తమ్ముడు శుక్రవారం కర్రతో కొట్టి చంపాడు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం... పెద్దపల్లి మండలం రంగాపూర్ కు చెందిన కొట్టె రాజయ్య తన కుమారులు సదయ్య, సమ్మయ్యతో కలిసి ఉంటున్నాడు. సమ్మయ్య ఉన్నత విద్యను చదివినా ఉద్యోగం లభించక ఇంటివద్దనే ఉంటున్నాడు. కొంతకాలంగా సదయ్య మానసిక పరిస్థితి సరిగాలేదు. హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో చికిత్సచేయించినా పరిస్థితిలో మార్పురాలేదు. డబ్బులు ఇమ్మంటూ తరచుగా తండ్రిని వేధిస్తున్నాడు.
గురువారం ఇంట్లో ఉన్న సామగ్రి, దుస్తులు తగులబెట్టిన సదయ్య ఇంటిని సైతం కాల్చేస్తాన ని, తండ్రిని, తమ్ముడిని హతమారుస్తానని గొడ్డలితో తిరుగుతున్నాడు. భయపడిన తండ్రి రాజయ్య దేవునిపల్లిలోని తన కూతురు ఇంటికి వెళ్లాడు. దీంతో సమ్మయ్య శుక్రవారం ఉదయం కర్రతో అన్న సదయ్య తలపై మోది హతమార్చాడు. నిందితున్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాములు, ఎస్సై రాజ్‌కుమార్ తెలిపారు.