నల్లగొండలోని ఓ భవిత కేంద్రంలో ఉన్న పిల్లలు
సాక్షి, నల్లగొండ: భవిత కేంద్రాలకు ప్రభుత్వంనుంచి భరోసా కరువైంది. రెండేళ్లుగా భవిత కేంద్రాలకు నిధులు అందకపోవడంతో కార్యక్రమాలన్నీ నిలిచిపోయాయి. బుద్ధిమాంద్యం, అంగవైకల్యం కలిగి ఉండి సొంతంగా పనులు చేసుకోలేని వారి కోసం ప్రభుత్వం భవిత కేంద్రాలను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా దివ్యాంగ పిల్లలను గుర్తించి వారిని పాఠశాలకు (భవితకేంద్రాలు) రప్పించాలి. విద్యాబుద్ధులు నేర్పు తూ మాట్లాడేది అర్థం చేసుకునే విధంగా వారిని తీర్చిదిద్దాలి. చివరికి సాధారణ విద్యార్థులుగా మార్చాలి. ప్రభుత్వం సౌకర్యాలు కల్పించకపోవడంతో భవిత కేంద్రాలు ఉపయోగపడుతున్నట్లు కనిపించడం లేదు.
ఒక్కో మండలానికి రెండు కేంద్రాలు
జిల్లా వ్యాప్తంగా 16 మండలాల పరిధిలో ఒక్కో మండలానికి రెండు భవిత కేంద్రాలను ఏర్పా టు చేసింది. ఒక్కో కేంద్రంలో ఇద్దరు ఇంక్లూడింగ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్(ఐఈపీఆర్)లను నియమించారు. వీరంతా వారి మండలాల పరిధిలో తిరిగి సరిగా మాటలు రాని బుద్ధిమాంద్యం కలిగిన పిల్లలతోపాటు అంగవైకల్యం కలిగిన వారిని గుర్తించాలి. వారి తల్లిదండ్రులను ఒప్పించి పాఠశాలకు రప్పించాల్సి ఉంది. ఇక్కడ బోధన ఉచితంగా చేస్తారు. జిల్లావ్యాప్తంగా దాదాపు 487 మంది 10 నుంచి 15 సంవత్సరాల దివ్యాంగ పిల్లలు ఉన్నారు.
ఆగిన వైద్యశిబిరాలు
భవిత కేంద్రాల్లో చదివే దివ్యాంగ విద్యార్థుల కోసం మండల స్థాయిలో ప్రతి జనవరి, ఫిబ్రవరి మాసాల్లో వైద్యశిబిరాలను నిర్వహించాలి. వారికి అన్ని రకాల పరీక్షలు నిర్వహించి ఎలాం టి ఉపకరణాలు అవసరమనేది గుర్తిం చాలి. గ్రహణమొర్రి వంటి వారికి కూడా శస్త్రచికిత్సలకు ప్రణాళికలు తయారు చేసి ఉన్నతాధికారులకు పంపిస్తారు. అదే సంవత్సరం నవంబర్, డిసెంబర్ మాసాల్లో పరికరాలు అందించడంతోపాటు శస్త్ర చికిత్సలు కూడా చేయించాలి. కానీ గత ఏడాది నిర్వహించిన పరీక్షలకు ఇంతవరకు పరికరాలు అందలేదు. ఈ సంవత్సరం జనవరిలో అసలు పరీక్షలే నిర్వహించలేదు. అంటే రెండేళ్లుగా వైద్యశిబిరాలు లేవన్నమాట.
ఆగిన ట్రాన్స్‌పోర్టు చార్జీలు
భవిత కేంద్రాలకు వచ్చే పిల్లలకు నెలకు రూ.250 ట్రాన్స్‌పోర్టు చార్జీలు ఇవ్వాల్సి ఉంది. గత సంవత్సరంనుంచి ట్రాన్స్‌పోర్టు చార్జీలు విడుదల కాలేదు. అసలే దివ్యాంగత్వం కారణంగా ఆర్థిక భారంతో బాధపడుతున్న కుటుం బాలు పిల్లలను భవిత కేంద్రాలకు పంపించేం దుకు డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారు. రానురాను కేంద్రాల్లో పిల్లల సంఖ్య కూడా తగ్గిపోతుంది. ప్రధానంగా పిల్లలకు వీల్‌చైర్స్, ట్రై సైకిళ్లు, వినికిడి యంత్రాలతో పాటు చంక కర్రలు, మానసిక బుద్ధిమాంద్యత కిట్లు, బ్రెయిలీ బుక్స్, తదితరాలు కూడా అందుబాటులో ఉం చాలి. ఆ పరిస్థితి కూడా లేకపోవడంతో పిల్లలు భవిత కేంద్రాలకు తగ్గుతున్నట్లు తెలుస్తోంది.
ప్రతి శుక్రవారం ఫిజియోథెరపీ చేయాలి
వారంలో ప్రతి శుక్రవారం పిల్లలకు ఫిజియోథెరపిస్ట్‌తో ఫిజియోథెరపీ (ఎక్సర్‌సైజ్) చేయాలి. పిల్లలు ఎవరైనా పాఠశాలకు రాలేని వారు ఉంటే వారి ఇళ్లకే వెళ్లి చేయించాల్సి ఉంటుంది. అందుకు సంబంధించి కూడా ఎలాంటి నిధులూ విడుదల కాకపోవడంతో వారు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఎవరైతే పిల్లలు పాఠశాలకు రాలేని పరిస్థితిలో మంచానికే పరిమితమై ఉంటారో అలాంటి పిల్లల ఇంటికి వెళ్లి ఒక గంటన్నరసేపు బోధించాల్సి ఉంది. ఇలాంటి విషయంలో కూడా పెద్దగా స్పందిస్తున్నట్లు కనిపించడం లేదు.
నిధులు లేకనే నీరసం
భవిత కేంద్రాలకు నిధులు అందని కారణంగా అవి నీరస పడిపోతున్నాయి. ఈ కేంద్రాల్లో రెండేళ్లు మాత్రమే చదువుతారు. ఈ సమయంలో పిల్లలు బుద్ధిమాంద్యం నుంచి మాట్లాడగలిగే స్థితి వచ్చిందంటే వారిని రెగ్యులర్ పాఠశాలకు పంపాలి. కానీ భవిత కేంద్రాలే సక్రమంగా నడవకపోవడంతో రెగ్యులర్ పాఠశాలలకు కూడా వెళ్లే పరిస్థితి లేకుండాపోయింది.
నల్లగొండ పట్టణంలోని భవిత కేంద్రాన్ని 'సాక్షి' సందర్శనకు వెళ్లగా 10మంది పిల్లలు మాత్రమే ఉన్నారు. వాస్తవంగా అక్కడ 21 మంది పిల్లలు ఉండాలి. కానీ ట్రాన్స్‌పోర్టు చార్జీలు ఇవ్వని కారణంగా పిల్లల సంఖ్య తగ్గిపోతుందని చెబుతున్నారు. మధ్యాహ్న భోజనం కూడా పెడుతున్నామని, కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను భవిత కేంద్రంలో తోలిపోతుండగా, మరికొందరు ఆటోలో సొంత డబ్బులతో పంపిస్తున్నారని, కొందరు పంపించడం లేదని భవిత కేంద్రం ఐఈఆర్‌పీ శైలజ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment