bhavita centres
-
‘భవిత’కు భరోసా ఏదీ?
సాక్షి, నల్లగొండ: భవిత కేంద్రాలకు ప్రభుత్వంనుంచి భరోసా కరువైంది. రెండేళ్లుగా భవిత కేంద్రాలకు నిధులు అందకపోవడంతో కార్యక్రమాలన్నీ నిలిచిపోయాయి. బుద్ధిమాంద్యం, అంగవైకల్యం కలిగి ఉండి సొంతంగా పనులు చేసుకోలేని వారి కోసం ప్రభుత్వం భవిత కేంద్రాలను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా దివ్యాంగ పిల్లలను గుర్తించి వారిని పాఠశాలకు (భవితకేంద్రాలు) రప్పించాలి. విద్యాబుద్ధులు నేర్పు తూ మాట్లాడేది అర్థం చేసుకునే విధంగా వారిని తీర్చిదిద్దాలి. చివరికి సాధారణ విద్యార్థులుగా మార్చాలి. ప్రభుత్వం సౌకర్యాలు కల్పించకపోవడంతో భవిత కేంద్రాలు ఉపయోగపడుతున్నట్లు కనిపించడం లేదు. ఒక్కో మండలానికి రెండు కేంద్రాలు జిల్లా వ్యాప్తంగా 16 మండలాల పరిధిలో ఒక్కో మండలానికి రెండు భవిత కేంద్రాలను ఏర్పా టు చేసింది. ఒక్కో కేంద్రంలో ఇద్దరు ఇంక్లూడింగ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్(ఐఈపీఆర్)లను నియమించారు. వీరంతా వారి మండలాల పరిధిలో తిరిగి సరిగా మాటలు రాని బుద్ధిమాంద్యం కలిగిన పిల్లలతోపాటు అంగవైకల్యం కలిగిన వారిని గుర్తించాలి. వారి తల్లిదండ్రులను ఒప్పించి పాఠశాలకు రప్పించాల్సి ఉంది. ఇక్కడ బోధన ఉచితంగా చేస్తారు. జిల్లావ్యాప్తంగా దాదాపు 487 మంది 10 నుంచి 15 సంవత్సరాల దివ్యాంగ పిల్లలు ఉన్నారు. ఆగిన వైద్యశిబిరాలు భవిత కేంద్రాల్లో చదివే దివ్యాంగ విద్యార్థుల కోసం మండల స్థాయిలో ప్రతి జనవరి, ఫిబ్రవరి మాసాల్లో వైద్యశిబిరాలను నిర్వహించాలి. వారికి అన్ని రకాల పరీక్షలు నిర్వహించి ఎలాం టి ఉపకరణాలు అవసరమనేది గుర్తిం చాలి. గ్రహణమొర్రి వంటి వారికి కూడా శస్త్రచికిత్సలకు ప్రణాళికలు తయారు చేసి ఉన్నతాధికారులకు పంపిస్తారు. అదే సంవత్సరం నవంబర్, డిసెంబర్ మాసాల్లో పరికరాలు అందించడంతోపాటు శస్త్ర చికిత్సలు కూడా చేయించాలి. కానీ గత ఏడాది నిర్వహించిన పరీక్షలకు ఇంతవరకు పరికరాలు అందలేదు. ఈ సంవత్సరం జనవరిలో అసలు పరీక్షలే నిర్వహించలేదు. అంటే రెండేళ్లుగా వైద్యశిబిరాలు లేవన్నమాట. ఆగిన ట్రాన్స్‌పోర్టు చార్జీలు భవిత కేంద్రాలకు వచ్చే పిల్లలకు నెలకు రూ.250 ట్రాన్స్‌పోర్టు చార్జీలు ఇవ్వాల్సి ఉంది. గత సంవత్సరంనుంచి ట్రాన్స్‌పోర్టు చార్జీలు విడుదల కాలేదు. అసలే దివ్యాంగత్వం కారణంగా ఆర్థిక భారంతో బాధపడుతున్న కుటుం బాలు పిల్లలను భవిత కేంద్రాలకు పంపించేం దుకు డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారు. రానురాను కేంద్రాల్లో పిల్లల సంఖ్య కూడా తగ్గిపోతుంది. ప్రధానంగా పిల్లలకు వీల్‌చైర్స్, ట్రై సైకిళ్లు, వినికిడి యంత్రాలతో పాటు చంక కర్రలు, మానసిక బుద్ధిమాంద్యత కిట్లు, బ్రెయిలీ బుక్స్, తదితరాలు కూడా అందుబాటులో ఉం చాలి. ఆ పరిస్థితి కూడా లేకపోవడంతో పిల్లలు భవిత కేంద్రాలకు తగ్గుతున్నట్లు తెలుస్తోంది. ప్రతి శుక్రవారం ఫిజియోథెరపీ చేయాలి వారంలో ప్రతి శుక్రవారం పిల్లలకు ఫిజియోథెరపిస్ట్‌తో ఫిజియోథెరపీ (ఎక్సర్సైజ్) చేయాలి. పిల్లలు ఎవరైనా పాఠశాలకు రాలేని వారు ఉంటే వారి ఇళ్లకే వెళ్లి చేయించాల్సి ఉంటుంది. అందుకు సంబంధించి కూడా ఎలాంటి నిధులూ విడుదల కాకపోవడంతో వారు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఎవరైతే పిల్లలు పాఠశాలకు రాలేని పరిస్థితిలో మంచానికే పరిమితమై ఉంటారో అలాంటి పిల్లల ఇంటికి వెళ్లి ఒక గంటన్నరసేపు బోధించాల్సి ఉంది. ఇలాంటి విషయంలో కూడా పెద్దగా స్పందిస్తున్నట్లు కనిపించడం లేదు. నిధులు లేకనే నీరసం భవిత కేంద్రాలకు నిధులు అందని కారణంగా అవి నీరస పడిపోతున్నాయి. ఈ కేంద్రాల్లో రెండేళ్లు మాత్రమే చదువుతారు. ఈ సమయంలో పిల్లలు బుద్ధిమాంద్యం నుంచి మాట్లాడగలిగే స్థితి వచ్చిందంటే వారిని రెగ్యులర్ పాఠశాలకు పంపాలి. కానీ భవిత కేంద్రాలే సక్రమంగా నడవకపోవడంతో రెగ్యులర్ పాఠశాలలకు కూడా వెళ్లే పరిస్థితి లేకుండాపోయింది. నల్లగొండ పట్టణంలోని భవిత కేంద్రాన్ని 'సాక్షి' సందర్శనకు వెళ్లగా 10మంది పిల్లలు మాత్రమే ఉన్నారు. వాస్తవంగా అక్కడ 21 మంది పిల్లలు ఉండాలి. కానీ ట్రాన్స్‌పోర్టు చార్జీలు ఇవ్వని కారణంగా పిల్లల సంఖ్య తగ్గిపోతుందని చెబుతున్నారు. మధ్యాహ్న భోజనం కూడా పెడుతున్నామని, కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను భవిత కేంద్రంలో తోలిపోతుండగా, మరికొందరు ఆటోలో సొంత డబ్బులతో పంపిస్తున్నారని, కొందరు పంపించడం లేదని భవిత కేంద్రం ఐఈఆర్పీ శైలజ తెలిపారు. -
భరోసా ఇవ్వని భవిత..!
ప్రత్యేక అవసరాల పిల్లలకు జిల్లాలోని భవిత కేంద్రాలు భరోసానివ్వలేకపోతున్నాయి. విద్యార్థులకు విద్యతో పాటు వారి శారీరక అవసరాలకు అనుగుణంగా ఫిజియోథెరపీ చేయాలి. వినికిడిలోపం, బుద్ధిమాంద్యం, అంగవైకల్యం, దృష్టిలోపం ఉన్న చిన్నారులకు ఆహ్లాదకర వాతావరణంలో మానసిక స్థైర్యాన్ని నింపాలి. అయితే భవిత కేంద్రాల్లో చేపట్టాల్సిన నెలవారీ కార్యక్రమాలు, యాక్షన్ ప్లాన్ సరిగ్గా అమలు చేయకపోవడంతో ఆశించిన ఫలితాల్లేవనే విమర్శలు వినిపిస్తున్నాయి. చిత్తూరు ఎడ్యుకేషన్: జిల్లాలో 22 భవిత కేంద్రాలు, 44 మినీ భవిత కేంద్రాలు సర్వశిక్షా అభియాన్ ద్వారా నడుస్తున్నాయి. అందులో 8,903 మంది విద్యార్థులున్నారు. 132 మంది వైద్యవిధానాల్లో శిక్షణ పొందిన శిక్షకులు ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేయాల్సి ఉండగా, 103 మంది మాత్రమే పనిచేస్తున్నారు. మిగిలిన 29 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మానసిక, శారీరక ఇబ్బందులు గుర్తించి వారిలో మార్పు తీసుకురావడానికి భవిత కేంద్రాలను స్థాపించారు. ప్రతి కేంద్రంలో వైద్యవిధానంలో ప్రత్యేక శిక్షణ పొందిన ఉపాధ్యాయుడు (ఐఈఆర్టీ) ఉంటారు. పలు రకాల మానసిక సమస్యలతో ఉన్న పిల్లలకు భవిత కేంద్రాల్లో శిక్షణ ఇచ్చి వారిని మామూలు పిల్లలుగా తయారు చేయాలి. అయితే జిల్లాలో ఎక్కడా అలా జరగడం లేదు. ఏదో వచ్చామా.. వెళ్లామా అన్నట్లు విధులు నిర్వహిస్తున్నారు. పర్యవేక్షించే ఉన్నతాధికారులు క్షేత్ర స్థాయిలో సరైన సూచనలు ఇవ్వకపోవడంతోనే ఇలా జరుగుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. జాడలేని ఫిజియోథెరపిస్టులు.. భవిత కేంద్రాల్లో పనిచేసే ఫిజియోథెరపిస్టులు కేంద్రానికి వచ్చి చిన్నారులకు వారంలో ఒకసారి చికిత్స చేయాల్సి ఉంటుంది. అన్ని మండలాల్లో ఉన్న భవిత కేంద్రాలలో ఫిజియోథెరఫిస్టులు రాకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని పలువురు తల్లిదండ్రులు చెబుతున్నారు. అందులో కొంతమంది కేంద్రాలకు వచ్చి బయోమెట్రిక్ నమోదు చేసి వెళ్లిపోతున్నట్లు ఆరోపణలున్నాయి. సకాలంలో నిర్వహించని క్యాంప్‌లు.. జిల్లాలోని అన్ని మండలాల్లో వినికిడి లోపం, గ్రహణమొర్రి లోపం ఉన్న విద్యార్థులను ఆరోగ్యశాఖ, సర్వశిక్షా అభియాన్ సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించి గుర్తించాల్సిన అవసరం ఉంది. అలా గుర్తించే పిల్లలకు సర్వశిక్షా అభియాన్ నిధులతో వారికి అవసరమైన ఉపకరణాలను(మిషన్లు) క్యాంపులు నిర్వహించి అందించాలి. ఆపరేషన్లకు సిఫార్సు చేయాలి. అయితే ఆ కార్యక్రమాలు నామమాత్రంగా నిర్వహిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా అధికారి నియామకం సర్వశిక్షా అభియాన్‌లో వ్యవహారాలన్నింటిని చూడాల్సిన జిల్లా సహిత విద్య అధికారిని నిబంధనలకు విరుద్ధంగా భర్తీ చేశారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై ప్రత్యేక అనుభవం, ఏడాది ఎంఎస్సీలో జువాలజీ పూర్తి చేసి, స్పెషల్ ఎడ్యుకేషన్‌పై ఏడాది పాటు కోర్సు చేసిన వారితో పోస్టు భర్తీ చేయాల్సి ఉంది. అయితే గతంలో ఉన్న ఆ శాఖ పీఓ నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్ర సర్వశిక్షా అభియాన్ కార్యాలయానికి తెలియకుండా ఆ పోస్టు భర్తీ చేసినట్లు సమాచారం. ఈ కారణంగానే పలు సమస్యలు ఎదురవుతున్నాయన్న వాదనలున్నాయి. -
భవిత కేంద్రాల్లో సేవలు విస్తృతం చేయాలి
కడప ఎడ్యుకేషన్: ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు భవితకేంద్రాలలో సేవలను విసృతం చేయాలని, అందుకు ఎస్‌ఎస్‌ఏతోపాటు ఆర్ఎస్ఎంఏ కూడా చేయూత నివ్వనున్నట్లు డీఈఓ బండ్లపల్లె ప్రతాప్‌రెడ్డి, సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్టు అధికారి వెంకటసుబ్బయ్యలు పేర్కొన్నారు. కడప నగరం ఎమ్మార్సీలో శుక్రవారం ఇన్‌క్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్సు టీచర్ల సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు గల పిల్లల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. ఎక్కువ పిల్లలున్న చోట ఇంకొక కేర్లివింగ్ వాలంటీర్‌ను(ఆయా) ఇస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రాజెక్టు అధికారి భవితకేంద్రానికి ఫిజియోథెరిఫి సేవలు నిరంతరం అందించే యోచనలో ఉన్నారన్నారు. భవితకేంద్రాలలో ఏవైనా సక్సెస్ స్టోరీస్ ఉంటే పక్కాగా రికార్డు చేయాలన్నారు. ఐఈడీ జిల్లా కోర్డినేటర్ బ్రహ్మయ్య మాట్లాడుతూ ఆర్‌ఎంఎస్‌ఏ ద్వారా 9,10 తరగతి బాలికలకు 200 రుపాయల సై్టఫండ్ ఇస్తుందని బాలికల వివరాలను ఆన్లైన్లో పంపాలని వివరించారు. డిప్యూటీ డీఈఓ నాగమునిరెడ్డి మాట్లాడుతూ ఐఈఆర్టీలు వారి మండలాల విద్యాశాఖాధికారులతో కలిసి భవితకేంద్రాలకు విడుదలయ్యే గ్రాంటును పిల్లల అవసరాలకు వినియోగించేలా చూడాలన్నారు. అనంతరం ఏఎస్ఓ గురుస్వామి కంప్యూటర్ ఆపరేట్ భాస్కర్ కలిసి ప్రొజెక్టర్ ద్వారా ఐఈడీఎస్‌ఎస్ ఆన్లైన్లో ఏవిధంగా చేయాలో వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని అందరూ ఐఈఆర్టీలు పాల్గొన్నారు.