భవిత కేంద్రాల్లో సేవలు విస్తృతం చేయాలి
కడప ఎడ్యుకేషన్:
ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు భవితకేంద్రాలలో సేవలను విసృతం చేయాలని, అందుకు ఎస్‌ఎస్‌ఏతోపాటు ఆర్‌ఎస్‌ఎంఏ కూడా చేయూత నివ్వనున్నట్లు డీఈఓ బండ్లపల్లె ప్రతాప్‌రెడ్డి, సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్టు అధికారి వెంకటసుబ్బయ్యలు పేర్కొన్నారు. కడప నగరం ఎమ్మార్సీలో శుక్రవారం ఇన్‌క్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్సు టీచర్ల సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు గల పిల్లల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. ఎక్కువ పిల్లలున్న చోట ఇంకొక కేర్‌లివింగ్ వాలంటీర్‌ను(ఆయా) ఇస్తున్నామన్నారు.
రాష్ట్ర ప్రాజెక్టు అధికారి భవితకేంద్రానికి ఫిజియోథెరిఫి సేవలు నిరంతరం అందించే యోచనలో ఉన్నారన్నారు. భవితకేంద్రాలలో ఏవైనా సక్సెస్ స్టోరీస్ ఉంటే పక్కాగా రికార్డు చేయాలన్నారు. ఐఈడీ జిల్లా కోర్డినేటర్ బ్రహ్మయ్య మాట్లాడుతూ ఆర్‌ఎంఎస్‌ఏ ద్వారా 9,10 తరగతి బాలికలకు 200 రుపాయల సై్టఫండ్ ఇస్తుందని బాలికల వివరాలను ఆన్‌లైన్‌లో పంపాలని వివరించారు. డిప్యూటీ డీఈఓ నాగమునిరెడ్డి మాట్లాడుతూ ఐఈఆర్‌టీలు వారి మండలాల విద్యాశాఖాధికారులతో కలిసి భవితకేంద్రాలకు విడుదలయ్యే గ్రాంటును పిల్లల అవసరాలకు వినియోగించేలా చూడాలన్నారు. అనంతరం ఏఎస్‌ఓ గురుస్వామి కంప్యూటర్ ఆపరేట్ భాస్కర్ కలిసి ప్రొజెక్టర్ ద్వారా ఐఈడీఎస్‌ఎస్ ఆన్‌లైన్‌లో ఏవిధంగా చేయాలో వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని అందరూ ఐఈఆర్‌టీలు పాల్గొన్నారు.