ప్రాబ్లమ్ ఇద్దరిదీ!
సందేహం
నా వయసు 28. నా భర్త వయసు 31. మాకు పెళ్లై ఆరేళ్ళు అవుతోంది. ఇప్పటి వరకు పిల్లలు లేరు. రెండేళ్లుగా ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. సంతానం కలగడానికి ప్రాబ్లమ్ మా ఇద్దరిలోనూ ఉందన్నారు డాక్టర్లు. మా వారి స్పెర్మ్ మొటిలిటీ తక్కువగా ఉందన్నారు. దానికి ఎలాంటి ట్రీట్‌మెంట్ తీసుకుంటే మా సమస్య తీరుతుంది? అలాగే ప్రతిరోజూ నేను ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్ కూడా వేసుకుంటున్నాను. వయసు పెరుగుతున్న కొద్దీ నాకు పిల్లలు కలుగుతారా అన్న భయం పెరుగుతోంది. దయచేసి సూచనలివ్వండి.
- రమణి, హైదరాబాద్
పిల్లలు కలగకపోవడానికి ఇద్దరిలోనూ సమస్య ఉన్నప్పుడు సమస్యకు తగ్గ చికిత్స ఇద్దరు సరిగా తీసుకుంటూ ఉంటేనే, పరిష్కారం దొరుకుతుంది. మీ వారికి వీర్యకణాలు తక్కువగా ఉన్నాయన్నారు. హార్మోన్లలో అసమతుల్యత, వీర్యకణాలు బయటకు రావటంలో అడ్డంకులు, ఇన్ఫెక్షన్‌లు, తాగుడు, సిగరెట్, షుగర్, మానసిక ఒత్తిడి, బీజాలలో వ్యారికోసిల్ వంటి ఎన్నో సమస్యల వల్ల వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉండవచ్చు. సమస్య ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి హార్మోన్ పరీక్షలు, రక్తపరీక్షలు, అల్ట్రాసౌండ్ స్క్రోటమ్ వంటి పరీక్షలు చేయించుకుని, దానికి తగ్గ మందులు కనీసం మూడు నెలలు అయినా వాడి చూడవచ్చు. మందులతో పాటు పరిమితమైన పౌష్టికాహారం, వ్యాయామాలు, యోగా, ధ్యానం వంటివి పాటించడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. మీకు ఉన్న సమస్య ఏమిటో వివరించలేదు. మీకు నెలనెలా పీరియడ్స్ సమక్రమంగా వస్తున్నాయా, అండం సరిగా విడుదల అవుతుందా లేదా? గర్భాశయంలో, అండాశయంలో సమస్య ఏమన్నా ఉందా అనే దాని బట్టి చికిత్స తీసుకోవలసి ఉంటుంది. సమస్యకు తగ్గ చికిత్స తీసుకోకుండా కేవలం ఫోలిక్ యాసిడ్ మాత్రలు వేసుకోవడం వల్ల ప్రయోజనం పెద్దగా ఉండదు. మీరు ఆందోళన చెందకుండా, ఇద్దరూ మరోసారి డాక్టర్‌ని సంప్రదించి సరైన చికిత్స తీసుకోవడం మంచిది.
నా వయసు 36 ఏళ్లు. నాకిద్దరు పిల్లలు. రెండూ నార్మల్ డెలివరీలే. పీరియడ్స్ అప్పుడు కానీ డెలివరీ సమయాల్లో కానీ ఎలాంటి సమస్యలూ రాలేదు. కానీ రెండు నెలలుగా పీరియడ్స్ సమయంలో అంటే... బ్లీడింగ్ అయిపోయిన రెండూ మూడు రోజుల్లో నా మానసిక పరిస్థితి ఏమీ బాగుండటం లేదు. దేనికి ఎలా రియాక్ట్ అవుతున్నానో నాకే అర్థం కావడం లేదు. ఇంటర్నెట్‌లో సెర్చ్ చేస్తే ‘పీఎంఎస్’ అని చూపిస్తోంది. నా సమస్యకు పరిష్కారం చెప్పండి. అలాగే పీఎంఎస్ అంటే ఏమిటి? - పుష్ప, కర్నూలు
ఇది పీరియడ్స్ మొదలయ్యే 10-15 రోజులు ముందు నుంచి కొందరిలో హార్మోన్లలో జరిగే మార్పుల వల్ల, మినరల్స్‌లో లోపాల వల్ల ఏర్పడుతుంది. ఇందులో వృక్షోజాలలో వాపుగా, నొప్పిగా, బరువుగా ఉండడం, ఒంట్లో నీరుచేరి బరువుగా, ఒళ్ళునొప్పులు, మానసిక మార్పులు, కోపం, చిరాకు, డిప్రెషన్ వంటి అనేక రకాల లక్షణాలు... ఒక్కొక్కరిలో ఒక్కోలాగ ఏర్పడుతుంటాయి. దీనికి చికిత్సలో భాగంగా, విటమిన్స్, మినరల్స్, ప్రైమ్‌రోజ్ ఆయిల్ కలిగిన మందులు దీర్ఘకాలం వాడవలసి ఉంటుంది. మందులతో పాటు, ఆ సమయంలో ఉప్పు, కాఫీలు వంటివి తక్కువ తీసుకుంటూ, యోగా, ధ్యానం, వ్యాయామాలు, క్రమంగా చెయ్యడం వల్ల చాలా వరకు ప్రయోజనం ఉంటుంది. ఒకసారి డాక్టర్‌ని సంప్రదించి సరైన చికిత్స తీసుకోవడం మంచిది. లేకపోతే మానసిక సమస్య పెరిగేకొద్దీ కుటుంబంలో కలహాలు, మనస్పర్థలు వంటి ఇతరత్రా సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి.
డా॥వేనాటి శోభ లీలా హాస్పిటల్
మోతీనగర్, హైదరాబాద్