ఎస్‌ఐ, కానిస్టేబుల్, హోంగార్డుతోపాటు మరో ఇద్దరికి కత్తిపోట్లు
మలక్‌పేట శంకర్‌నగర్‌లో అర్ధరాత్రి అలజడి
హైదరాబాద్, న్యూస్‌లైన్: మానసిక స్థితి సరిగా లేని ఓ వ్యక్తి హైదరాబాద్‌లో కత్తితో దాడులకు దిగి ఐదుగురిని తీవ్రంగా గాయపరిచాడు. సైకో దాడిలో గాయపడ్డ ఎస్‌ఐ, కానిస్టేబుల్, హోంగార్డుతోపాటు మరో ఇద్దరు స్థానికులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. సీఐ రాజావెంకట్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... మలక్‌పేట శంకర్‌నగర్‌కు చెందిన ఇసామియా ఖురే షీ(55) కబేళాలో పశువులను వధించే కార్మికుడు. కొన్నేళ్లుగా మానసిక వ్యాధితో బాధపడుతూ వైద్యం చేయించుకుంటున్నాడు. మంగళవారం అర్ధరాత్రి ఓ వ్యక్తి వెకిలి చేష్టలతో విసిగించటంతో కోపోద్రిక్తుడైన ఇసామియా కత్తి తీసుకుని బజారులోకి వచ్చి దూషణలకు దిగాడు. అదే సమయంలో శంకర్‌నగర్‌లో ఓ చిన్నారి జన్మదిన వేడుకలకు హాజరై వస్తున్న ఇంటర్ విద్యార్థి భాను(17) అతడిని వారించేందుకు ప్రయత్నించగా కత్తితో దాడి చేసి గాయపరిచాడు. గాయాలతో రోడ్డుపై పడిపోయిన భానును కాపాడేందుకు ప్రయత్నించిన శివ(23)పై కూడా ఇసామియా కత్తితో విరుచుకుపడి కడుపు, చేతిపై గాయపర్చాడు.
శివ సోదరుడు పోలీసులకు సమాచారం ఇవ్వటంతో అక్కడకు చేరుకున్న ఎస్‌ఐ మహేశ్, కానిస్టేబుల్ పీరయ్య, హోంగార్డు మంగ్తానాయక్‌లు క్షతగాత్రులను మలక్‌పేటలోని యశోద ఆసుపత్రికి తరలించాడు. అనంతరం ఇసామియా ఇంటికి వెళ్లి అతడికి నచ్చచెప్పేందుకు ప్రయత్నించిన ఎస్‌ఐ మహేష్‌పై పశువులను వధించే కత్తితో దాడికి పాల్పడ్డాడు. దాడి నుంచి తప్పించుకునే క్రమంలో ఎస్‌ఐ ఎడమ చేతిని అడ్డుపెట్టగా.. చేయి సగభాగం తెగిపోవడంతో పాటు వేళ్లకు తీవ్రగాయాలయ్యాయి. పట్టుకునేందుకు ప్రయత్నించిన కానిస్టేబుల్, హోంగార్డులను కూడా సైకో ఇసామియాను గాయపరిచాడు. కాలనీవాసులు ఇసామియాను వెనుక నుంచి పట్టుకుని బంధించారు. అనంతరం పోలీస్ అధికారులు అక్కడకు చేరుకుని సైకోను అదుపులోకి తీసుకుని కత్తిని స్వాధీనం చేసుకున్నారు. అతడిపై హత్యాయత్నం నేరం, ఆయుధ చట్టం కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామని చాదర్‌ఘాట్ సీఐ తెలిపారు. మానసికంగా ఉన్మాదిగా మారిన తన భర్త కొన్నేళ్లుగా చిత్రహింసలకు గురిచేస్తున్నాడని, అతడిని జైల్లోనే ఉంచాలని ఇసామియా భార్య పోలీ సులను వేడుకుంది. గాయపడ్డ పోలీసులను యశోద ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.
వదంతులను నమ్మవద్దు: ఏసీపీ సోమేశ్వరరావు
సైకో ఇసామియా చేసిన దాడిని మత ఘర్షణలుగా చిత్రీకరించవద్దని, ఇలాంటి పుకార్లు నమ్మవద్దని సుల్తాన్ బజార్ ఏసీపీ సోమేశ్వరరావు స్థానికులకు సూచించారు. పుకార్లు వ్యాపింపచేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండి తమకు సమాచారం అందించాలని కోరారు. కాలనీల్లో రెండువారాల పాటు పోలీస్ పికెట్ ఏర్పాటు చేస్తామని చెప్పారు.
హైదరాబాద్‌లో సైకో దాడి
Published Thu, Nov 7 2013 12:56 AM | Last Updated on Tue, Aug 21 2018 7:53 PM
Advertisement