సీఐ సమక్షంలో ఇబ్రహీంను కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్న ఆశ్రమ నిర్వాహకులు
సాక్షి, జడ్చర్ల టౌన్: ఇంటినుంచి వెళ్లిపోయిన వ్యక్తి చనిపోయాడకుని కుటుంబ సభ్యులు అతడిపై ఆశలు వదులుకున్నారు. ఎనిమిదేళ్ల తర్వాత బతికే ఉన్నాడని తెలిసిన ఆ కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. జడ్చర్ల సీఐ బాలరాజు సమక్షంలో సత్యేశ్వర ఆశ్రమ నిర్వాహకులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. వివరాలిలా.. గద్వాలకు చెందిన ఇబ్రహీం అనే వ్యక్తి ఎనిమిదేళ్ల క్రితం మతిస్థిమితం కోల్పోయి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో అతడు చనిపోయాడని భావించి ఆశలు వదులుకున్నారు. అయితే బాదేపల్లి పాతబజార్‌లో మహాలక్ష్మి సేవాట్రస్టు నిర్వాహకులు ఈశ్వర్, రామకృష్ణ ఏడాదిక్రితం ప్రారంభించిన సత్యేశ్వర ఆశ్రమంలో మతిస్థిమితం తప్పిన వారికి ఆశ్రయం కల్పిస్తున్నారు. ఇదే క్రమంలో గతేడాది ఏప్రిల్‌లో జాతీయ రహదారిపై మతిస్థిమితం లేకుండా తిరుగుతున్న ఇబ్రహీం ఆశ్రమ నిర్వాహకుల కంటపడటంతో చేరదీశారు. ఆశ్రమంలో చేసిన సేవలు, సఫర్యలు, చికిత్సల కారణంగా ఇబ్రహీం కోలుకున్నాడు. తన కుటుంబ సభ్యుల వివరాలను ఆశ్రమ నిర్వాహకులకు తెలియజేయడంతో జడ్చర్ల పోలీసుల సహకారంతో గద్వాలలోని అతడి కుటుంబ సభ్యుల సమాచారం సేకరించారు. వారిని పిలిపించి ఆదివారం జడ్చర్ల పోలీస్‌స్టేషన్‌లో ఇబ్రహింను అప్పగించడంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. సీఐ బాలరాజు ఆశ్రమ నిర్వాహకుల సేవలను ప్రత్యేకంగా అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment