came to home
-
చనిపోయాడనుకున్న వ్యక్తి తిరిగొచ్చాడు!
సాక్షి, జడ్చర్ల టౌన్: ఇంటినుంచి వెళ్లిపోయిన వ్యక్తి చనిపోయాడకుని కుటుంబ సభ్యులు అతడిపై ఆశలు వదులుకున్నారు. ఎనిమిదేళ్ల తర్వాత బతికే ఉన్నాడని తెలిసిన ఆ కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. జడ్చర్ల సీఐ బాలరాజు సమక్షంలో సత్యేశ్వర ఆశ్రమ నిర్వాహకులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. వివరాలిలా.. గద్వాలకు చెందిన ఇబ్రహీం అనే వ్యక్తి ఎనిమిదేళ్ల క్రితం మతిస్థిమితం కోల్పోయి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో అతడు చనిపోయాడని భావించి ఆశలు వదులుకున్నారు. అయితే బాదేపల్లి పాతబజార్లో మహాలక్ష్మి సేవాట్రస్టు నిర్వాహకులు ఈశ్వర్, రామకృష్ణ ఏడాదిక్రితం ప్రారంభించిన సత్యేశ్వర ఆశ్రమంలో మతిస్థిమితం తప్పిన వారికి ఆశ్రయం కల్పిస్తున్నారు. ఇదే క్రమంలో గతేడాది ఏప్రిల్లో జాతీయ రహదారిపై మతిస్థిమితం లేకుండా తిరుగుతున్న ఇబ్రహీం ఆశ్రమ నిర్వాహకుల కంటపడటంతో చేరదీశారు. ఆశ్రమంలో చేసిన సేవలు, సఫర్యలు, చికిత్సల కారణంగా ఇబ్రహీం కోలుకున్నాడు. తన కుటుంబ సభ్యుల వివరాలను ఆశ్రమ నిర్వాహకులకు తెలియజేయడంతో జడ్చర్ల పోలీసుల సహకారంతో గద్వాలలోని అతడి కుటుంబ సభ్యుల సమాచారం సేకరించారు. వారిని పిలిపించి ఆదివారం జడ్చర్ల పోలీస్స్టేషన్లో ఇబ్రహింను అప్పగించడంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. సీఐ బాలరాజు ఆశ్రమ నిర్వాహకుల సేవలను ప్రత్యేకంగా అభినందించారు. -
అమ్మ ఒడికి చేరిన నవ్యశ్రీ
–పాప ఆచూకీ తెలిపిన యాదయ్యకు డీజీపీతో సత్కరిస్తాం – తిరుపతి అర్బన్ ఎస్పీ జయలక్ష్మి తిరుపతి క్రైం : తిరుమలలో కిడ్నాపైన నవ్యశ్రీ (5)ని తల్లిదండ్రుల వద్దకు తిరుపతి అర్బన్ ఎస్పీ జయలక్ష్మి సురక్షితంగా చేర్చారు. మంగళవారం రాత్రి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో అర్బన్ ఎస్పీ మాట్లాడారు. జనవరి 29న అనంతపురం జిల్లా కనగానిపల్లె మండలం తూమచర్ల గ్రామానికి చెందిన మహాత్మ, వరలక్ష్మీ దంపతులు వారి ఇద్దరి పిల్లలతో తిరుమలకు వచ్చారు. పీఏసీ–2లో నిద్రిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి నవ్యశ్రీని అపహరించాడు. అనంతరం మహబూబ్నగర్ వెళ్తున్న బస్సులో నల్గొండ జిల్లా దేవరకొండకు చెందిన యాదయ్య.. అపరిచుతుడితో ఉన్న పాపతో మాట్లాడి వివరాలు సేకరించారు. విషయం తెలుసుకుని మిడ్జిల పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాడు. దీంతో పోలీసులు తమదైన శైలిలో విచారించగా పాపను తిరుమల నుంచి కిడ్నాప్ చేశానని, తనది రంగారెడ్డి జిల్లా తలకొండపల్లె మండలం అంతరం గ్రామానికి చెందిన బాలస్వామి అని నిందితుడు పేర్కొన్నాడు. దీంతో అక్కడ పోలీసులు తిరుమల పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు పాపను సురక్షితంగా తీసుకొచ్చారు. యాదయ్యను విజయవాడకు పిలిపించి ఏపీ డీజీపీ సాంబశివరావుతో ఘనంగా సత్కరించి పోలీసు రివార్డు ఇస్తామని అర్బన్ ఎస్పీ ప్రకటించారు. సమావేశంలో తిరుమల సీఐ వెంకటరవి, ఎస్ఐ తులసీరాం పాల్గొన్నారు.