సతియే దైవం | shiva krishna | Sakshi
Sakshi News home page

సతియే దైవం

Published Wed, Dec 17 2014 3:32 AM | Last Updated on Sat, Sep 2 2017 6:16 PM

shiva krishna

అతని పేరు శివకృష్ణ. వృత్తిరీత్యా డ్యాన్సర్. అక్కడే రాధతో అరుున పరిచయం కాస్తా స్నేహంగా చిగురించి..ఆపై ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుందామని ఇద్దరూ నిశ్చయించుకున్నారు. పెద్దలు ఒప్పుకోకపోయినా మూడు ముళ్లతో...ఏడడుగులతో అగ్నిసాక్షిగా ఒక్కటయ్యారు. జీవితాంతం ఒకరినొకరు తోడూనీడగా ఉంటామంటూ బాస చేసుకున్నారు.ఆనందంగా.. అరమరికలు లేకుండా జీవితం ప్రారంభించారు. వీరి ప్రేమకు గురుతులుగా ముగ్గురు పిల్లలు కలిగారు. ఇలా సాఫీగా సాగుతున్న వీరి జీవితంపై విధి చిన్నచూపు చూసింది. ఓ రోజు రోడ్డు ప్రమాదంలో రాధ మృతిచెందింది.
 
  అంతే రాధలేని జీవితాన్ని ఊహించుకుని కృష్ణ తల్లడిల్లిపోయాడు. కొన్ని రోజులకు బాధ నుంచి తేరుకున్నాడు. జీవితాంతం ప్రేమను పంచుతానన్న పెళ్లినాటి ప్రమాణాన్ని గుర్తు చేసుకున్నాడు. అంతే రాధ చిత్రపటానికి ప్రతి రోజూ పూలమాల వేస్తూ.... పిల్లలతో కలిసి పూజ చేస్తూ.. కొత్త జీవితం ఆరంభించాడు. మరోపెళ్లి చేసుకోవాలని బంధువులు ఒత్తిడి తెచ్చినా.. పిల్లలను తమకు అప్పగించాలని ఎవరెన్ని చెప్పినా వినలేదు. పిల్లలను అపురూపంగా పెంచుతూ.. ఆ రూపాల్లోనే భార్యను చూసుకుంటూ గడుపుతూ.. అసలైన ప్రేమకు సిసలైన నిర్వచనమిస్తున్నాడు.  అవును.. కట్టుకున్న భార్య పుట్టింటి నుంచి కట్నకానుకలు తేలేదని చావబాదే భర్తలకు.. భార్య చనిపోతే నెల తిరక్కుండానే పెళ్లిళ్లు చేసుకునే ప్రబుద్ధులకు ఈ శివకృష్ణ ఓ కనువిప్పే కదూ..
 
 సాక్షి, కడప/జమ్మలమడుగు: భార్య జ్ఞాపకంగా షాజహాన్ తాజ్‌మహల్ కట్టిస్తే.. తన భార్య తనువు చాలించినా తన గుండెల్లో గుడికట్టి.. ఆ దేవతకు రోజూ పూజలు చేస్తున్నాడు ఈ రిక్షావాలా శివ కృష్ణ. ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భార్యను మర్చిపోలేక గుండెలపై పచ్చబొట్టు కూడా పొడిపించుకున్నాడు. పిల్లలను తల్లికంటే మిన్నగా సాకుతూ నలుగురికీ ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాడు.
 
 చిన్నారుల్లో సతీమణిని చూసుకుంటూ....
 జమ్మలమడుగులోని గూడెంచెరువు చెందిన శివకృష్ణ. వృత్తిరీత్యా రికార్డింగ్ డ్యాన్సర్.. అక్కడే పరిచయమైన రాధతో ప్రేమలో  పెద్దలు ఒప్పుకోకపోయినా పెళ్లి చేసుకున్నాడు. కొన్నేళ్ల తర్వాత ఓ రోజు రికార్డింగ్ డ్యాన్స్ కార్యక్రమానికి వెళ్లి వస్తుండగా భార్య రాధ రాజంపేట వద్ద రోడ్డు ప్రమాదంలో మరణించింది.
 
 ఆ ప్రమాదంలో పెద్ద కుమార్తెకి కాలికి గాయమైంది. అయితే ఆమె తీపి గుర్తుగా ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగపిల్లాడ్ని ఇచ్చి వెళ్లింది. సమాజంలో అట్టడుగు స్థానంలో ఉన్న శివకృష్ణ అందరికంటే ఉత్తమంగా ఆలోచించాడు. అందరూ పిల్లల్ని ఎక్కడో ఒక చోట వదిలి రెండో పెళ్లి చేసుకోమన్నారు. రికార్డింగ్ డ్యాన్సులు చేస్తే ఊళ్లు పట్టుకొని తిరగాలి.. పిల్లల్ని ఎలా పోషించగలవు అని భయపెట్టారు. కానీ పిల్లల్లోనే భార్యను చూసుకుంటున్న శివ ఆమెను తన గుండెల్లో నింపుకున్నాడు. పిల్లలకు తల్లితండ్రీ తానై నొప్పి తగలకుండా పెంచుతున్నాడు.
 
 డ్యాన్స్ వదిలేసి..రిక్షా తొక్కుతూ..!
 భార్య రాధ మరణంతో శివకు పిల్లల బెంగ పట్టుకుంది. కొంతమంది వచ్చి వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేశారు. సున్నితంగా తిరస్కరించాడు.  పిల్లలను ఇక్కడ వదిలేసి రికార్డింగ్ డ్యాన్స్ నేపధ్యంలో ఎక్కడికైనా వెళితే వారి పరిస్థితి ఏమిటని ఆలోచన చేశాడు. పిల్లలను ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే పనిచేసుకోవాలని నిర్ణయించుకుని రిక్షా తొక్కేందుకు సిద్దమయ్యా డు. ఇక పొద్దున లేవగానే ఆయన దినచర్య భార్యకు పూజ చేయడంతోనే ప్రారంభమవుతుంది. ఆ తర్వాత పిల్లలకి స్నానం చేయించడం, స్కూల్‌కి వెళ్లేందుకు సిద్ధం చేయడం.. సాయంత్రంకాగానే మళ్లీ తీసుకురావడం ఇలా అన్నీ ఆడవాళ్లకంటే మిన్నగా చేస్తున్నాడు.  అలసటలోనే ఆనందం ఉందంటూనే చిన్నారులకు చిన్ని సమస్య కూడారాకుండా అల్లారుముద్దుగా పోషి స్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. అప్పుడప్పు డు శివ తరపు బంధువులు పిల్లల్ని తీసుకెళ్లినా.. తాను కష్టపడి పిల్లల్ని మంచి చదువులు చదివించాలని జమ్మలమడుగులోనే ఉం టూ బతుకు బండి లాగుతున్నా డు. చనిపోయినా తన భార్యకు హృదయంలో గుడికట్టి.. ఆ దేవతకు రోజూ పూజలు చేస్తూ.. ఆమె ప్రతి రూపాలుగా మిగిలిన పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్న శివకృష్ణ ఈ తరం యువతకు స్ఫూర్తిదాయకమే కదూ.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement