ఇక ఆ రోజు నుంచి... | And from that day ... | Sakshi
Sakshi News home page

ఇక ఆ రోజు నుంచి...

Published Sun, Feb 28 2016 3:14 PM | Last Updated on Sun, Sep 3 2017 6:33 PM

ఇక ఆ రోజు నుంచి...

ఇక ఆ రోజు నుంచి...

పెద్దల మాట చద్ది మూట...అంటారు. నేను మాత్రం చద్ది మూట కాదు.... చాదస్తపు మూట అనుకునేవాడిని. ఎవరు ఏది చెప్పినా పెద్దగా ఖాతరు చేసేవాడిని కాదు. నాకు విపరీతంగా ఖర్చు చేసే అలవాటు ఉండేది. కేవలం ఆడంబరం కోసం, హడావిడి కోసం అవసరం ఉన్నా లేకపోయినా ఖర్చు చేసేవాడిని.  ఈ అలవాటు ఎంత ముదిరిపోయిందంటే... ‘ఛీ... ఇవ్వాళ ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదు’ అంటూ అవసరం లేకపో యినా ఏదో ఒక వస్తువు కొనేసేంతగా.
 
నా ఫ్రెండ్స్‌లో శ్రీను అని ఉండేవాడు. వాడేమో ఆచి తూచి ఖర్చు చేసే టైప్. దాంతో వాడిని బాగా ఆటపట్టించేవాడిని. ‘‘జీవితం అంటేనే ఆనందం. నీ పీనాసి తనంతో ఆ ఆనందాన్ని కోల్పోతున్నావ్. నీ లైఫ్ వేస్ట్’’ అంటూ ఉండేవాడిని. ‘‘అనరా అను. ఏదో ఒకరోజు నీకు డబ్బు విలువ తప్పకుండా తెలుస్తుంది’’ అనేవాడు శ్రీను.
 
ఆ మాట నిజమైంది. నా విచ్చలవిడి తనానికి మా ఆస్తి హారతయ్యింది. ఆర్థిక పరిస్థితి పూర్తిగా దెబ్బతింది. పని చేస్తే తప్ప పూట గడవని పరిస్థితి వచ్చింది. దాంతో హైదరాబాద్ చేరుకొని ఒక ప్రైవేట్ కంపెనీలో చేరాను. కానీ అప్పటికీ నాలోని విలాస పురుషుడు బుద్ధి తెచ్చు కోలేదు. జీతం చేతిలో పడగానే ఆకర్షణలు లాగేసేవి. దాంతో జీతం సరిపోయేది కాదు.
 
అయిదేళ్లు గిర్రున తిరిగాయి. సంక్రాంతి పండక్కి చాలా కాలం తరు వాత సొంత ఊరికి వెళ్లాను. వీధిలో శ్రీను కనిపించాడు. వాళ్ల ఇంటికి తీసుకెళ్లాడు. అది తన సొంత ఇల్లట. ఎంత బాగా కట్టుకున్నాడో!  ‘‘ఏరా నిధి ఏమైనా దొరి కిందా?’’ అన్నాను నవ్వుతూ. ‘‘అవును... ఆ నిధి పేరు పొదుపు. నువ్వు కూడా పొదుపు విలువ తెలుసుకొని ఉంటే ఇలాం టివి నాలుగిళ్లు కట్టేవాడివి’’ అన్నాడు. మనసు చివుక్కుమంది. నిజమే. నేనేమీ సంపాదించుకోలేదు సరికదా కనీ పెంచిన అమ్మా నాన్నలకు కూడా ఒక్క రూపాయి పెట్టలేదు. కానీ శ్రీను.. తన ఇంట్లో తన తల్లిదండ్రుల్ని పెట్టుకుని సేవ చేస్తున్నాడు.
 
ఇక ఆ రోజు నుంచి నేను ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించాను. డబ్బు విలువ తెలుసుకున్నాను. పొదుపు చేస్తున్నాను. ఇప్పుడు జీతం సరిపోవడమే కాదు... మిగులుతోంది కూడా. వాటిలో కొంత దాస్తున్నాను. కొంత అమ్మానాన్నలకు పంపుతున్నాను. ఏదో తృప్తి. ఒక రూపాయి ఖర్చు చేయకపోతే...ఒక రూపాయిని సంపాదించినట్లే కదా!
 - వి.ఉమామహేశ్వర్రావు, నెల్లూరు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement