International Yoga Day 2022: Nivedita Joshi Conducted A Live Session In Honour Of Yogacharya BKS Iyengar - Sakshi
Sakshi News home page

International Yoga Day 2022: నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం: యోగా ఒక విస్మయ శక్తి

Published Tue, Jun 21 2022 1:28 AM | Last Updated on Tue, Jun 21 2022 12:55 PM

Nivedita Joshi conducted a live session in honour of Yogacharya BKS Iyengar - Sakshi

నివేదితా జోషి.; గురువుగారితో నివేదితా జోషి..; యోగా సాధనలో...

ఇవాళ ఆసనాలు వేస్తూ శరీరాన్ని చురుగ్గా కదిలిస్తున్న నివేదితా జోషి ఒకప్పుడు డిస్క్‌–సర్వికల్‌ స్పాండిలోసిస్‌తో 8 ఏళ్లు మంచం పట్టింది. వీల్‌చైర్‌లో తప్ప బయటకు రాలేకపోయింది. ఆమెను లేపి నిలబెట్టే మందే లేదు. కాని యోగా మహా గురువు అయ్యంగార్‌ ఆమెను కేవలం ఒక సంవత్సరకాలంలో యోగా ద్వారా నార్మల్‌ చేశారు. కొత్త జీవితం ఇచ్చారు. ఆమె యోగా శక్తిని తెలుసుకుంది. జీవితాన్ని యోగాకి అంకితం చేసింది. అయ్యంగార్‌ యోగా విధానాల ద్వారా యోగా కేంద్రాన్ని నడుపుతూ మొండి రోగాలను దారికి తెస్తోంది.
ఆమె పరిచయం... యోగా అవసరం...

‘యోగా ఒక జీవన విధానం. మంచి ఆరోగ్యం కోసం యోగా చేయాలని చాలామంది అనుకుంటారు. కాని మంచి ఆరోగ్యం అనేది యోగా వల్ల వచ్చే ఒక ఫలితం మాత్రమే. యోగాను జీవన విధానం గా చేసుకుంటే మనసుకు శాంతి, సంతృప్తి, సోదర భావన, విశ్వ మానవ దృష్టి అలవడతాయి’ అంటుంది నివేదితా జోషి.

ఢిల్లీలోని దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ్‌ మార్గ్‌లో ఆమె యోగా కేంద్రం ‘యోగక్షేమ’ ఎప్పుడూ యోగ సాధకులతో కిటకిటలాడుతుంటుంది. దేశంలో యోగా గురువులు ఎందరో ఉన్నారు. కాని నివేదితా జోషి ప్రత్యేకత మరొకటి ఉంది. ఆమె సాధన చేసేది అయ్యంగార్‌ యోగ. మన దేశంలో యోగాకు విశేష ప్రచారం కల్పించిన గురువు బి.కె.ఎస్‌ అయ్యంగార్‌ ప్రియ శిష్యురాలు నివేదితా. మహా మహా మొండి సమస్యలను కూడా అయ్యంగార్‌ యోగా ద్వారా జయించవచ్చు అని గురువుకు మల్లే నిరూపిస్తోందామె.

తానే ఒక పేషెంట్‌గా వెళ్లి
అలహాబాద్‌లో పుట్టి పెరగిన నివేదితా జోషి సీనియర్‌ బిజెపి నేత మురళీ మనోహర్‌ జోషి కుమార్తె. 15 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఇంట్లో 3 గంటల పాటు పూజలో కూచొని లేవలేకపోయింది. ఆ రోజుల్లో ఎంఆర్‌ఐలు లేవు. డాక్టర్‌ మజిల్‌ వీక్‌నెస్‌ అని భావించాడు. నిజానికి ఆమెకు వచ్చిన సమస్య స్లిప్డ్‌ డిస్క్‌. ఆ సమస్య ఆమెను వదల్లేదు. బాధ పడుతూనే మైక్రోబయాలజీ చేసింది. మైక్రోబయాలజిస్‌ ్టగా కెరీర్‌ మొదలెట్టే సమయానికి ఇక పూర్తిగా కదల్లేని స్థితికి వెళ్లింది. అప్పటికి ఆమె వయసు 27 సంవత్సరాలు.

‘నా చేతులతో నేను జుట్టు కూడా ముడి వేసుకోలేకపోయేదాన్ని’ అందామె. తీవ్రమైన డిప్రెషన్‌లోకి వచ్చింది. ఆ సమయంలోనే ఎవరో పూణెలోని అయ్యంగార్‌ యోగా కేంద్రం గురించి చెప్పారు. ‘నేను ఆయన దగ్గరకు వెళ్లినప్పుడు నా సమస్యను చెప్పలేదు. నా రిపోర్టులు చూపించలేదు. కాని కంఠం దగ్గర ఉన్న నా చర్మం ధోరణిని బట్టి ఆయన నాకున్న సమస్య ఏమిటో ఇట్టే చెప్పేశారు. రేపటి నుంచే పని మొదలెడుతున్నాం అన్నారు.’ అందామె. ఆ తర్వాత అయ్యంగార్‌ ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకూ కఠోరంగా ఆసనాలు సాధన చేయించారు. మామూలుగా యోగాలో అన్ని అవయవాలు సరిగా ఉన్నవారే అన్ని ఆసనాలు వేయగలరు.

కాని అయ్యంగార్‌ యోగాలో ఏ శారీరక ఇబ్బంది ఉన్నా కొన్ని వస్తువుల, ఉపకరణాల సాయం తో ప్రతి ఆసనం వేయొచ్చు. అలా కదల్లేని మెదల్లేని స్థితిలో ఉన్న నివేదితాతో అన్ని ఆసనాలు వేయిస్తూ కేవలం సంవత్సర కాలంలో ఆమెను కాళ్ల మీద నిలబెట్టాడాయన. ఒక రకంగా ఇది మిరాకిల్‌. అద్భుతం. అందుకే నివేదితా యోగాకే తన జీవితం అంకితం చేసింది. మరో 18 ఏళ్ల పాటు అయ్యంగార్‌కు శిష్యరికం చేసింది. ‘నా పేరుతో నువ్వు ఢిల్లీలో అధికారిక యోగా కేంద్రం తెరువు’ అని అయ్యంగార్‌ చేతే ఆమె చెప్పించుకోగలింది. గురువు చేతుల మీదుగానే 2008లో ఢిల్లీలో ‘యోగక్షేమ’ కేంద్రాన్ని తెరిచింది.

నిద్ర – మెలుకువ
‘ఇవాళ్టి రోజుల్లో యువతీ యువకులు అనారోగ్య బారిన పడటానికి కారణం వారు నిద్ర పోవాల్సిన టైమ్‌లో నిద్రపోయి మేల్కొనాల్సిన టైములో మేల్కొనకపోవడం. దానివల్ల బాడీ క్లాక్‌ దెబ్బ తింటుంది. చేసే క్రియలన్నీ తప్పి జబ్బులొస్తాయి’ అంటుంది నివేదితా. ఆ అలవాటు సరి చేసుకోకుండా యోగా చేస్తే ఉపయోగం లేదంటుంది ఆమె. నివేదితా తన దగ్గరకు వచ్చే వారిలో నిద్రలేమి సమస్యలు, అంతర్గత ఆరోగ్య సమస్యలు, అశాంతి, డిప్రెషన్, మానసిక సమస్యలు... వీటన్నింటిని యోగా ద్వారా అదుపులోకి తెస్తోంది. ‘మీ శరీరం ఒక దిక్కు మనసు ఒక దిక్కు ఉంటే ఎలా? శరీరం మనసు ఒక సమతలంలోకి రావాలి. అప్పుడే ఆరోగ్యం. ధ్యానం చాలా అవసరం. అది మనసును శుభ్రపరుస్తుంది’ అంటుందామె.

మానవత్వం కోసం యోగా
‘అంతర్జాతీయ యోగా దినోత్సవం 2022’కు థీమ్‌గా ‘మానవత్వం కోసం యోగా’ ఎంచుకున్నారు. మానవత్వం కోసం యోగా ఎలా? జగాన ఈ కసి, పగ, శతృత్వం, అసహనం, యుద్ధలాలస, ఆక్రమణ, వేధింపు ఇవన్నీ మనసు ఆడే గేమ్‌లో నుంచి వచ్చేవే. మనసు శాంతంగా ఉంటే సగం సమస్యలు తీరుతాయి. మనసును శాంత పరిచేదే, దాని అలజడిని తగ్గించేది, ఒక అద్దంలాగా మారి మనల్ని మనకు చూపించేదే యోగా. ఈ మార్గంలో ధ్యానం చేసే కొద్దీ ఈ భూగోళాన్ని శాంతివైపు మళ్లించాలనే భావన కలుగుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ యోగసాధనలో ప్రశాంతత పొందాలి ముందు. అది మానవాళికి మేలు చేస్తుంది. ‘అయితే యోగా అంటే గుడ్డిగా చేయడం కాదు. ఏ వరుసలో ఆసనాలు వేయాలి, ఎంతసేపు ఆసనాలు వేయాలి అనేది ప్రధానం. మీరు సరైన ఫలితాలు పొందాలంటే ఈ రెండూ జాగ్రత్తగా తెలుసుకోండి. లేకుంటే మీ శ్రమ వృధా’ అంటుందామె.
యోగా దినోత్సవం సందర్భంగా అందరూ యోగసాధకులవుదామని కోరకుందాం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement