Asanalu
-
Year Ender 2024: ఈ ఆసనాలను వేసి.. బరువు తగ్గామంటూ సంతోషం
2024 ముగియడానికి ఇక కొద్దిరోజుల మాత్రమే మిగిలివుంది. జనమంతా న్యూ ఇయర్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో కొందరు 2024లో తమకు ఎదురైన తీపి జ్ఞాపకాలను, చేదు అనుభవాలను గుర్తుచేసుకుంటున్నారు. 2024లో చాలామంది బరువు తగ్గేందుకు యోగాసనాలను ఆశ్రయించారు. కొన్ని ఆసనాలను వారు అమితంగా ఇష్టపడ్డారు.మలాసనం2024లో చాలామంది మలాసనం కోసం శోధించారు. దీనిని అభ్యసించి ఆరోగ్య ప్రయోజనాలు సొంతం చేసుకున్నారు. ఈ యోగాసనాన్ని స్క్వాట్ అని కూడా అంటారు. క్రమం తప్పకుండా ఈ ఆసనం వేస్తే శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవచ్చని యోగా నిపుణులు అంటున్నారు. ఈ ఆసనం వెన్నునొప్పి, మోకాళ్ల నొప్పులు మొదలైన వాటి నుండి ఉపశమనం అందిస్తుంది. జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. ఉదర కండరాలను బలోపేతం చేస్తుంది.పవనముక్తాసనంపవనముక్తాసనం 2024లో ట్రెండింగ్‌లో నిలిచింది. ఈ యోగాసనం అసిడిటీ, మలబద్ధకం తదితర సమస్యల నుంచి విముక్తి కల్పిస్తుంది. అంతే కాదు ఈ యోగాసనాన్ని రెగ్యులర్‌గా చేస్తే చాలా త్వరగా పొట్ట తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. కీళ్లనొప్పుల నుంచి కూడా ఈ ఆసనం ఉపశమనం కల్పిస్తుంది.తాడాసనం2024 సంవత్సరంలో చాలామంది అత్యధికంగా శోధించిన యోగాసనాలలో తాడాసనం కూడా చోటు దక్కించుకుంది. ఈ యోగాసనం సహాయంతో శరీరంలోని పలు అవయవాలకు శక్తి సమకూరుతుంది. ఈ ఆసనం శరీరపు ఎత్తును పెంచడంలో ఎంతగానో సహాయపడుతుంది. శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.మత్స్యాసనంచాలమంది ఈ ఏడాది మత్స్యసనం కోసం సెర్చ్ చేశారు. ఈ యోగాసనం శారీరక, మానసిక అభివృద్ధికి చాలా మంచిదని నిపుణులు చెబుతుంటారు. ఈ ఆసనాన్ని క్రమం తప్పకుండా చేస్తుంటే మెడ, భుజాలకు సంబంధించిన సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇది పొట్టను కరిగించడంలో సహాయపడుతుంది.పశ్చిమోత్తనాసనంపశ్చిమోత్తనాసం యోగాభ్యాసంలో ముఖ్యమైనదిగా చెబుతుంటారు. 2024లో చాలామంది ఈ ఆసనాన్ని వేసి లబ్ధి పొందారు. ఈ యోగాసనం జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇది వెన్నెముక సమస్యలను పరిష్కరిస్తుంది. పొట్ట కొవ్వును తగ్గించడంలో ప్రభావవంతంగా పని చేస్తుంది. ఈ యోగాసనాన్ని క్రమం తప్పకుండా వేస్తే, నిద్రలేమి సమస్యలను దూరం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.ఇది కూడా చదవండి: Year Ender 2024: భారత్‌ను వణికించిన వ్యాధులు -
ఒత్తిడి వేధిస్తోంటే.. అద్భుతమైన ఆసనం ఇదే!
పర్వతాన్ని పోలి ఉంటుంది కాబట్టి ఈ ఆసనాన్ని మౌంటెయిన్ పోజ్ అంటారు. పిల్లలు,పెద్దలు ఎవరైనా ఈ ఆసనాన్ని సులువుగా సాధన చేయవచ్చు. ఒత్తిడినుంచి ఉపశమనం లభిస్తుంది. రెండు పాదాలను దగ్గరగా ఉంచి, నిటారుగా నిల్చోవాలి. భుజాలు వంచకుండా, చేతులను నేలవైపుకు చాచాలి. రెండు నుంచి ఐదు శ్వాసలు తీసుకొని, వదులుతూ ఉండాలి. తర్వాత పాదాలను దగ్గరగా ఉంచి, చేతులను తల మీదుగా తీసుకెళ్లి, ఒక చేతివేళ్లతో మరొక చేతివేళ్లను పట్టుకోవాలి. శరీరాన్ని పైకి స్ట్రెచ్ చేస్తూ శ్వాసక్రియ కొనసాగించాలి. శరీర కండరాలను బిగుతుగా ఉంచాలి. ఆ తర్వాత భుజాల నుంచి చేతులను పైకి లేపాలి. అరచేతులు రెండూ ఆకాశంవైపు చూస్తూ ఉండాలి.ఈ విధంగా చేసే సమయంలో కాలి మునివేళ్ల మీద నిలబడుతూ, శరీరాన్ని పైకి లేపాలి. కొద్దిసేపు అలాగే ఉండి, తిరిగి యథాస్థానంలోకి రావాలి. ∙తర్వాత కాళ్లను ఒకదానికొకటి దూరంగా ఉంచుతూ, చేతులను కిందకు దించి, విశ్రాంత స్థితికి రావాలి. తాడాసనం సాధన చేయడం జాయింట్స్‌పై మంచి ప్రభావాన్ని చూపుతుంది. పిల్లల చేత చేయిస్తే వారి ఎదుగుదలకు అమోఘంగా పనిచేస్తుంది. – జి.అనూషారాకేష్, యోగా గురుసమస్థితికి మౌంటెయిన్ -
యోగా : ఈ ఆసనంతో వెన్నుకు దన్ను
వంగి పనిచేయడం, నిటారుగా ఉండటంలో ఏదైనా అసౌకర్యంగా అనిపిస్తుంటే వెన్నెముక కండరాలకు శక్తి అవసరం అని గుర్తించాలి. వెన్ను కండరాలను బలపరిచి, మానసిక ఒత్తిడిని తగ్గించడంలో భుజంగాసనం బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా, పొట్ట, హిప్ కండరాలను గట్టిపరుస్తుంది. జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. అజీర్ణం, మలబద్దకం వంటి సమస్యలను తగ్గిస్తుంది. శ్వాసకోశ సమస్యలను నివారిస్తుంది. తాచుపాము పడగ విప్పితే ఎలా ఉంటుందో ఈ భంగిమ అలా ఉంటుంది. అందుకే ఈ ఆసనాన్ని కోబ్రా పోజ్ అని, తెలుగులో భుజంగాసనం అంటారు.యోగా మ్యాట్ పైన బోర్లా పడుకొని, చేతులను నడుము, హిప్ భాగానికి ఇరువైపులా ఉంచాలి. అర చేతులను నేలకు ఆనించి, భుజాలు, తల నెమ్మదిగా పైకి లేపాలి.అరచేతులను నేలకు నొక్కి పట్టి ఉంచి, నెమ్మదిగా ఛాతీ భాగాన్ని పైకి లేపాలి. దిగువ వీపుపై ఒత్తిడి పడకుండా వెనుక కండరాలను కొద్దిగా స్ట్రెచ్ చేయాలి. దీర్ఘ శ్వాస తీసుకుంటూ 15 నుంచి 20 సెకన్లపాటు ఈ భంగిమలో ఉండాలి. శ్వాస వదులుతూ తిరిగి యధాస్థితికి రావాలి. ∙ఇదేవిధంగా ఐదారుసార్లు ఈ ఆసనాన్ని సాధన చేయవచ్చు. గర్భిణులు ఆ ఆసనం వేయకూడదు. శస్త్రచికిత్స నుంచి కోలుకుంటున్నవారు, వయసు పైబడినవారు ఆ ఆసనాన్ని నిపుణుల సూచనల మేరకే సాధన చేయాలి.– జి.అనూష, యోగా గురు -
ప్రధాని మోదీ శశాంకాసనం.. ప్రయోజనాలివే
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా జరుపుకోనున్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ప్రధాని మోదీ ఈసారి కూడా తన యోగాసనాల ఏఐ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దానిలో శశాంకాసనం వేసే విధానాన్ని వివరించారు.ఈ వీడియోను సంస్కృత భాషలో రూపొందించారు. శశాంకాసనం వేసేటప్పుడు శరీరం కుందేలు మాదిరి పొజీషన్లోకి వస్తుంది. ఈ ఆసనం వేయడం వల్ల ఒత్తిడి, డిప్రెషన్ దూరమవుతుంది. ఈ ఆసనాన్ని ఎలా వేయాలో వీడియోలో చూపించారు. ఈ ఆసనం వేయడానికి ముందుగా వ్రజాసన భంగిమలో కూర్చోవాలి. మోకాళ్లపై చేతులను ఉంచాలి. ఇప్పుడు రెండు మోకాళ్లను వీలైనంత వరకు సౌకర్యవంతమైన భంగిమలో విస్తరించాలి. అరచేతులను మోకాళ్ల మధ్య ఉంచాలి. వాటిని ముందుకు చాస్తూ, శరీరాన్ని కిందకు వంచాలి. అప్పుడు చేతులు సమాంతరంగా ముందుకు చాచాలి. అదే పొజీషన్లో ముందుకు చూస్తూ కొంత సమయం పాటు ఈ భంగిమలో ఉండాలి. తరువాత వ్రజాసన భంగిమకు రావాలి.మలబద్ధకంతో బాధపడుతున్నవారు ఈ ఆసనం వేయడం వలన మంచి ఉపశమనం లభిస్తుంది. క్రమం తప్పకుండా ఈ ఆసనం వేస్తే కోపం అదుపులోకి వస్తుంది. వెన్ను నొప్పి నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ఆర్థరైటిస్‌తో బాధపడేవారు ఈ ఆసనాన్ని వేయకూడదు. తీవ్రమైన వెన్నునొప్పి ఉన్నవారు కూడా ఈ ఆసనం వేసేటప్పుడు పలు జాగ్రత్తలు పాటించాలి. హైబీపీ ఉన్నవారు ఈ ఆసనం వేసే విషయమై వైద్యులను సంప్రదించడం ఉత్తమం. Here is why you must practice Shashankasana regularly… pic.twitter.com/95kwzrKYTD— Narendra Modi (@narendramodi) June 19, 2024 -
నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం: యోగా ఒక విస్మయ శక్తి
ఇవాళ ఆసనాలు వేస్తూ శరీరాన్ని చురుగ్గా కదిలిస్తున్న నివేదితా జోషి ఒకప్పుడు డిస్క్–సర్వికల్ స్పాండిలోసిస్‌తో 8 ఏళ్లు మంచం పట్టింది. వీల్‌చైర్‌లో తప్ప బయటకు రాలేకపోయింది. ఆమెను లేపి నిలబెట్టే మందే లేదు. కాని యోగా మహా గురువు అయ్యంగార్ ఆమెను కేవలం ఒక సంవత్సరకాలంలో యోగా ద్వారా నార్మల్ చేశారు. కొత్త జీవితం ఇచ్చారు. ఆమె యోగా శక్తిని తెలుసుకుంది. జీవితాన్ని యోగాకి అంకితం చేసింది. అయ్యంగార్ యోగా విధానాల ద్వారా యోగా కేంద్రాన్ని నడుపుతూ మొండి రోగాలను దారికి తెస్తోంది. ఆమె పరిచయం... యోగా అవసరం... ‘యోగా ఒక జీవన విధానం. మంచి ఆరోగ్యం కోసం యోగా చేయాలని చాలామంది అనుకుంటారు. కాని మంచి ఆరోగ్యం అనేది యోగా వల్ల వచ్చే ఒక ఫలితం మాత్రమే. యోగాను జీవన విధానం గా చేసుకుంటే మనసుకు శాంతి, సంతృప్తి, సోదర భావన, విశ్వ మానవ దృష్టి అలవడతాయి’ అంటుంది నివేదితా జోషి. ఢిల్లీలోని దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ మార్గ్‌లో ఆమె యోగా కేంద్రం ‘యోగక్షేమ’ ఎప్పుడూ యోగ సాధకులతో కిటకిటలాడుతుంటుంది. దేశంలో యోగా గురువులు ఎందరో ఉన్నారు. కాని నివేదితా జోషి ప్రత్యేకత మరొకటి ఉంది. ఆమె సాధన చేసేది అయ్యంగార్ యోగ. మన దేశంలో యోగాకు విశేష ప్రచారం కల్పించిన గురువు బి.కె.ఎస్ అయ్యంగార్ ప్రియ శిష్యురాలు నివేదితా. మహా మహా మొండి సమస్యలను కూడా అయ్యంగార్ యోగా ద్వారా జయించవచ్చు అని గురువుకు మల్లే నిరూపిస్తోందామె. తానే ఒక పేషెంట్‌గా వెళ్లి అలహాబాద్‌లో పుట్టి పెరగిన నివేదితా జోషి సీనియర్ బిజెపి నేత మురళీ మనోహర్ జోషి కుమార్తె. 15 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఇంట్లో 3 గంటల పాటు పూజలో కూచొని లేవలేకపోయింది. ఆ రోజుల్లో ఎంఆర్ఐలు లేవు. డాక్టర్ మజిల్ వీక్నెస్ అని భావించాడు. నిజానికి ఆమెకు వచ్చిన సమస్య స్లిప్డ్ డిస్క్. ఆ సమస్య ఆమెను వదల్లేదు. బాధ పడుతూనే మైక్రోబయాలజీ చేసింది. మైక్రోబయాలజిస్ ్టగా కెరీర్ మొదలెట్టే సమయానికి ఇక పూర్తిగా కదల్లేని స్థితికి వెళ్లింది. అప్పటికి ఆమె వయసు 27 సంవత్సరాలు. ‘నా చేతులతో నేను జుట్టు కూడా ముడి వేసుకోలేకపోయేదాన్ని’ అందామె. తీవ్రమైన డిప్రెషన్లోకి వచ్చింది. ఆ సమయంలోనే ఎవరో పూణెలోని అయ్యంగార్ యోగా కేంద్రం గురించి చెప్పారు. ‘నేను ఆయన దగ్గరకు వెళ్లినప్పుడు నా సమస్యను చెప్పలేదు. నా రిపోర్టులు చూపించలేదు. కాని కంఠం దగ్గర ఉన్న నా చర్మం ధోరణిని బట్టి ఆయన నాకున్న సమస్య ఏమిటో ఇట్టే చెప్పేశారు. రేపటి నుంచే పని మొదలెడుతున్నాం అన్నారు.’ అందామె. ఆ తర్వాత అయ్యంగార్ ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకూ కఠోరంగా ఆసనాలు సాధన చేయించారు. మామూలుగా యోగాలో అన్ని అవయవాలు సరిగా ఉన్నవారే అన్ని ఆసనాలు వేయగలరు. కాని అయ్యంగార్ యోగాలో ఏ శారీరక ఇబ్బంది ఉన్నా కొన్ని వస్తువుల, ఉపకరణాల సాయం తో ప్రతి ఆసనం వేయొచ్చు. అలా కదల్లేని మెదల్లేని స్థితిలో ఉన్న నివేదితాతో అన్ని ఆసనాలు వేయిస్తూ కేవలం సంవత్సర కాలంలో ఆమెను కాళ్ల మీద నిలబెట్టాడాయన. ఒక రకంగా ఇది మిరాకిల్. అద్భుతం. అందుకే నివేదితా యోగాకే తన జీవితం అంకితం చేసింది. మరో 18 ఏళ్ల పాటు అయ్యంగార్‌కు శిష్యరికం చేసింది. ‘నా పేరుతో నువ్వు ఢిల్లీలో అధికారిక యోగా కేంద్రం తెరువు’ అని అయ్యంగార్ చేతే ఆమె చెప్పించుకోగలింది. గురువు చేతుల మీదుగానే 2008లో ఢిల్లీలో ‘యోగక్షేమ’ కేంద్రాన్ని తెరిచింది. నిద్ర – మెలుకువ ‘ఇవాళ్టి రోజుల్లో యువతీ యువకులు అనారోగ్య బారిన పడటానికి కారణం వారు నిద్ర పోవాల్సిన టైమ్‌లో నిద్రపోయి మేల్కొనాల్సిన టైములో మేల్కొనకపోవడం. దానివల్ల బాడీ క్లాక్ దెబ్బ తింటుంది. చేసే క్రియలన్నీ తప్పి జబ్బులొస్తాయి’ అంటుంది నివేదితా. ఆ అలవాటు సరి చేసుకోకుండా యోగా చేస్తే ఉపయోగం లేదంటుంది ఆమె. నివేదితా తన దగ్గరకు వచ్చే వారిలో నిద్రలేమి సమస్యలు, అంతర్గత ఆరోగ్య సమస్యలు, అశాంతి, డిప్రెషన్, మానసిక సమస్యలు... వీటన్నింటిని యోగా ద్వారా అదుపులోకి తెస్తోంది. ‘మీ శరీరం ఒక దిక్కు మనసు ఒక దిక్కు ఉంటే ఎలా? శరీరం మనసు ఒక సమతలంలోకి రావాలి. అప్పుడే ఆరోగ్యం. ధ్యానం చాలా అవసరం. అది మనసును శుభ్రపరుస్తుంది’ అంటుందామె. మానవత్వం కోసం యోగా ‘అంతర్జాతీయ యోగా దినోత్సవం 2022’కు థీమ్‌గా ‘మానవత్వం కోసం యోగా’ ఎంచుకున్నారు. మానవత్వం కోసం యోగా ఎలా? జగాన ఈ కసి, పగ, శతృత్వం, అసహనం, యుద్ధలాలస, ఆక్రమణ, వేధింపు ఇవన్నీ మనసు ఆడే గేమ్‌లో నుంచి వచ్చేవే. మనసు శాంతంగా ఉంటే సగం సమస్యలు తీరుతాయి. మనసును శాంత పరిచేదే, దాని అలజడిని తగ్గించేది, ఒక అద్దంలాగా మారి మనల్ని మనకు చూపించేదే యోగా. ఈ మార్గంలో ధ్యానం చేసే కొద్దీ ఈ భూగోళాన్ని శాంతివైపు మళ్లించాలనే భావన కలుగుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ యోగసాధనలో ప్రశాంతత పొందాలి ముందు. అది మానవాళికి మేలు చేస్తుంది. ‘అయితే యోగా అంటే గుడ్డిగా చేయడం కాదు. ఏ వరుసలో ఆసనాలు వేయాలి, ఎంతసేపు ఆసనాలు వేయాలి అనేది ప్రధానం. మీరు సరైన ఫలితాలు పొందాలంటే ఈ రెండూ జాగ్రత్తగా తెలుసుకోండి. లేకుంటే మీ శ్రమ వృధా’ అంటుందామె. యోగా దినోత్సవం సందర్భంగా అందరూ యోగసాధకులవుదామని కోరకుందాం. -
అవగాహనతోనే... ఉప‘ యోగం’...
సాధనమున పనులు సమకూరు... అన్నారు పెద్దలు. చేసే పనుల పట్ల సంపూర్ణ అవగాహనతో ఉంటే దాని ఫలితాలు సంపూర్ణంగా సమకూరుతాయనేది మర్చిపోకూడదు. ఆసనాలు సాధన చేయడం ఎంత అవసరమో... అంతకు ముందుగానే యోగ అనే ఓ గొప్ప శాస్త్రం గురించి తగినంత అవగాహన పెంచుకోవడం కూడా అంతే అవసరం. ఆ అవగాహన కోసమే ఈ సూచనలు... ఆసనాలు వేసేటప్పుడు శక్తి ప్రవాహం స్థూలం నుంచి సూక్ష్మంవైపుగా పయనించాలి. అంటే మూలాధారం నుంచి సహస్రారం వైపునకు మన ప్రయాణం ఉండాలి. (శరీరంలో ఉన్న విభిన్న నాడీ కేంద్రాలను చక్రాలుగా ఋషులు పేర్కొన్నారు. ఆధునిక శాస్త్రం నెర్వ్ సెంటర్స్ లేదా నాడీ కేంద్రాలు అంటోంది).ఈ మూల సూత్రాన్ని అనుసరించి ఆసనాలు ఐదు రకాలుగా విభజించబడ్డాయి. అవి 1.నిలబడి చేసేవి 2.కూర్చుని చేసేవి 3.పొట్ట మీద పడుకుని చేసేవి, 4.వీపు మీద పడుకుని చేసేవి. 5) తలకిందులుగా చేసేవి. నిలబడిన స్థితిలో ఆసనాలు వేసేటప్పుడు స్పైన్ అలైన్మెంట్, కుడి ఎడమల మధ్య సమతౌల్యం, తొడ కండరాలు, పిక్కల కండరాలు బలోపేతం అవుతాయి. శరీరానికి నిలకడని, ధృఢత్వాన్ని అందిస్తుంది. మన శరీరపు బరువులో ప్రతి కిలోగ్రామునకు కనీసం 40మి.లీ నీటిని తాగాలి. అంటే ఉదాహరణకు శరీరపు బరువు 60 కిలోలు ఉన్నట్లయితే దాదాపు 2.5 లీటర్ల నీరు తాగడం అవసరం. ఆహారం తీసువడానికి ముందు, తరువాత కనీసం అరగంట వ్యవధి ఇచ్చి నీరు తాగాలి. అలా కాకపోతే ఆహారం తీసుకునే సమయంలో పొట్టలో ఉత్పత్తి అయ్యే హైడ్రోక్లోరిక్ ఆమ్లం, పెప్సిన్ వంటి గ్యాస్ట్రిక్ జ్యూసెస్ నీటితో కలిసి డైల్యూట్ అవడం వల్ల వాటిలో సాంద్రత తగ్గి జీర్ణశక్తి లోపిస్తుంది. ఆహారం తీసుకున్న అనంతరం ప్రతి సారీ కనీసం 300 మి.లీ నీరు తాగడం మంచిది. ఒకే వస్తువును వివిధ ప్రాంతాలలో ఎలాగైతే విభిన్న పేర్లతో పిలుస్తారో అదే విధంగా యోగాసనాలు, ముద్ర, బంధనాలను పిలిచే విధానంలో వ్యత్యాసాలు ఉండవచ్చు. ఎనిమిదేళ్ల నుంచి 80ఏళ్ల వరకూ వయసున్న ప్రతి ఒక్కరూ యోగాసనాలు సాధన చేయవచ్చు. ఆసనాలు వేసే ప్రదేశం చదునుగా. స్వఛ్చమైన గాలి వెలుతురు ప్రసరించేలా ఉండాలి. తొలుత పొట్ట, మూత్రాశయాన్ని ఖాళీగా ఉంచుకోవాలి. సాధన మధ్యలో కొంచెం నీరు తాగవచ్చు. ఆసనంలోకి వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు శరీర కదలికలకు అనుగుణంగా ఉఛ్వాసనిశ్వాసలు ఉండాలి. శరీరాన్ని సాగదీసేటప్పుడు శ్వాస తీసుకోవడం, సంకోచింప జేసేటప్పుడు (వదులుగా వదిలినపుడు) శ్వాస వదలడం చాలా ముఖ్యం. ఆసనంలో ఉన్నప్పుడు మాత్రం సాధారణ శ్వాస తీసుకోవాలి. ఎంతసేపు శ్వాస తీసుకోవాలి అనేది కొత్తగా ప్రారంభించే వారికి ముఖ్యం కాదు. కాబట్టి, శక్తి అనుసారం చేయవచ్చు. ఆసనంలో ఉండే సమయం వృధ్ధి చేసుకోవడానికి ఒకటి రెండు మూడు...పది అంటూ అంకెలు లెక్కపెట్టవచ్చు. ఆసనమైనా, ప్రాణయామమైనా... సాధకులు వారి వయసును బట్టి, దేహపు స్థితిగతులను బట్టి ఎంతవరకూ చేయగలరో అంతవరకే చేయాలి. యోగాలో అన్ని ఆసనాలనూ కుడి, ఎడమ రెండు వైపులకూ చేయాలి. శరీరాన్ని సమస్థితిలోకి తీసుకురావడానికి అది ఉపకరిస్తుంది. శారీరక ధృఢత్వానికి కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఋషులు, మునులు అందించిన శాస్త్రం హఠయోగం. దీనిని తొలుత 8వ శతాబ్ధంలో స్వాత్మారామ అనే నాధగురువు హఠయోగ ప్రదీపిక పేరిట గ్రంధ రూపంలో అందించారు. స్వాత్మారాముడు ప్రధమ శ్లోకంలోనే రాజయోగ ఉపయోగార్ధం ఈ హఠయోగాన్ని ఇస్తున్నట్టు చెబుతాడు. పతంజలి ఇచ్చిన యోగ దర్శనానికి అనుగుణంగా ధ్యానం చేయడానికి శరీరాన్ని సిద్ధం చేయడం హఠయోగ సాధన ముఖ్యోధ్ధేశ్యం. శాస్త్రం కాబట్టి యోగాను శాస్త్రీయ దృక్పధంతోనే ఆచరించాలి. యోగా అనే పదం యంగ్ అనే పదంలో నుంచి వచ్చినట్టయితే దాని అర్ధం సంయోగం. అంటే శరీరాన్ని, శ్వాసను మనసుతో అనుసంధానం చేసి సమన్వయం చేయడం. దీనికి మూలం ‘యోక్’ అయినట్లయితే దాని అర్ధం కాడి. రైతు పొలం దున్నేటప్పుడు కాడికి కుడి ఎడమ వైపున కట్టిన ఎడ్ల కదలికలో సమతుల్యం ఉండేటట్టుగా ఎలా చూస్తాడో అలాగే యోగాసన, ప్రాణాయామ సాధన చేసేటప్పుడు శరీరంలో ఎడమ, కుడి భాగాలను మెదడులో ఎడమ, కుడి గోళార్ధములను, ఇడ-పింగళ నాడులను సమంగా పనిచేసేటట్టుగా చూడాలి. యోగ సాధన అంతిమ లక్ష్యం ఆత్మ దర్శనం. బ్రహ్మజ్ఞానం పొందడం, కైవల్యం, నిర్వాణ/నిబ్బాన స్థితిని చేరడమే. ఒకే వస్తువును వివిధ ప్రాంతాలలో ఎలాగైతే విభిన్న పేర్లతో పిలుస్తారో అదే విధంగా యోగాసనాలు, ముద్ర, బంధనాలను పిలిచే విధానంలో వ్యత్యాసాలు ఉండవచ్చు. ఎనిమిదేళ్ల నుంచి 80ఏళ్ల వరకూ వయసున్న ప్రతి ఒక్కరూ యోగాసనాలు సాధన చేయవచ్చు. - సమన్వయం: సత్యబాబు ఎ.ఎల్.వి కుమార్ ట్రెడిషనల్ యోగా ఫౌండేషన్