వంగి పనిచేయడం, నిటారుగా ఉండటంలో ఏదైనా అసౌకర్యంగా అనిపిస్తుంటే వెన్నెముక కండరాలకు శక్తి అవసరం అని గుర్తించాలి. వెన్ను కండరాలను బలపరిచి, మానసిక ఒత్తిడిని తగ్గించడంలో భుజంగాసనం బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా, పొట్ట, హిప్ కండరాలను గట్టిపరుస్తుంది. జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. అజీర్ణం, మలబద్దకం వంటి సమస్యలను తగ్గిస్తుంది. శ్వాసకోశ సమస్యలను నివారిస్తుంది.
తాచుపాము పడగ విప్పితే ఎలా ఉంటుందో ఈ భంగిమ అలా ఉంటుంది. అందుకే ఈ ఆసనాన్ని కోబ్రా పోజ్ అని, తెలుగులో భుజంగాసనం అంటారు.
యోగా మ్యాట్ పైన బోర్లా పడుకొని, చేతులను నడుము, హిప్ భాగానికి ఇరువైపులా ఉంచాలి.
అర చేతులను నేలకు ఆనించి, భుజాలు, తల నెమ్మదిగా పైకి లేపాలి.
అరచేతులను నేలకు నొక్కి పట్టి ఉంచి, నెమ్మదిగా ఛాతీ భాగాన్ని పైకి లేపాలి. దిగువ వీపుపై ఒత్తిడి పడకుండా వెనుక కండరాలను కొద్దిగా స్ట్రెచ్ చేయాలి.
దీర్ఘ శ్వాస తీసుకుంటూ 15 నుంచి 20 సెకన్లపాటు ఈ భంగిమలో ఉండాలి.
శ్వాస వదులుతూ తిరిగి యధాస్థితికి రావాలి. ∙ఇదేవిధంగా ఐదారుసార్లు ఈ ఆసనాన్ని సాధన చేయవచ్చు.
గర్భిణులు ఆ ఆసనం వేయకూడదు.
శస్త్రచికిత్స నుంచి కోలుకుంటున్నవారు, వయసు పైబడినవారు ఆ ఆసనాన్ని నిపుణుల సూచనల మేరకే సాధన చేయాలి.
– జి.అనూష, యోగా గురు
Comments
Please login to add a commentAdd a comment