అవగాహనతోనే... ఉప‘ యోగం’...
సాధనమున పనులు సమకూరు... అన్నారు పెద్దలు. చేసే పనుల పట్ల సంపూర్ణ అవగాహనతో ఉంటే దాని ఫలితాలు సంపూర్ణంగా సమకూరుతాయనేది మర్చిపోకూడదు. ఆసనాలు సాధన చేయడం ఎంత అవసరమో... అంతకు ముందుగానే యోగ అనే ఓ గొప్ప శాస్త్రం గురించి తగినంత అవగాహన పెంచుకోవడం కూడా అంతే అవసరం. ఆ అవగాహన కోసమే ఈ సూచనలు...
ఆసనాలు వేసేటప్పుడు శక్తి ప్రవాహం స్థూలం నుంచి సూక్ష్మంవైపుగా పయనించాలి. అంటే మూలాధారం నుంచి సహస్రారం వైపునకు మన ప్రయాణం ఉండాలి. (శరీరంలో ఉన్న విభిన్న నాడీ కేంద్రాలను చక్రాలుగా ఋషులు పేర్కొన్నారు. ఆధునిక శాస్త్రం నెర్వ్ సెంటర్స్ లేదా నాడీ కేంద్రాలు అంటోంది).ఈ మూల సూత్రాన్ని అనుసరించి ఆసనాలు ఐదు రకాలుగా విభజించబడ్డాయి. అవి 1.నిలబడి చేసేవి 2.కూర్చుని చేసేవి 3.పొట్ట మీద పడుకుని చేసేవి, 4.వీపు మీద పడుకుని చేసేవి. 5) తలకిందులుగా చేసేవి. నిలబడిన స్థితిలో ఆసనాలు వేసేటప్పుడు స్పైన్ అలైన్‌మెంట్, కుడి ఎడమల మధ్య సమతౌల్యం, తొడ కండరాలు, పిక్కల కండరాలు బలోపేతం అవుతాయి. శరీరానికి నిలకడని, ధృఢత్వాన్ని అందిస్తుంది. మన శరీరపు బరువులో ప్రతి కిలోగ్రామునకు కనీసం 40మి.లీ నీటిని తాగాలి. అంటే ఉదాహరణకు శరీరపు బరువు 60 కిలోలు ఉన్నట్లయితే దాదాపు 2.5 లీటర్ల నీరు తాగడం అవసరం. ఆహారం తీసువడానికి ముందు, తరువాత కనీసం అరగంట వ్యవధి ఇచ్చి నీరు తాగాలి. అలా కాకపోతే ఆహారం తీసుకునే సమయంలో పొట్టలో ఉత్పత్తి అయ్యే హైడ్రోక్లోరిక్ ఆమ్లం, పెప్సిన్ వంటి గ్యాస్ట్రిక్ జ్యూసెస్ నీటితో కలిసి డైల్యూట్ అవడం వల్ల వాటిలో సాంద్రత తగ్గి జీర్ణశక్తి లోపిస్తుంది.
ఆహారం తీసుకున్న అనంతరం ప్రతి సారీ కనీసం 300 మి.లీ నీరు తాగడం మంచిది. ఒకే వస్తువును వివిధ ప్రాంతాలలో ఎలాగైతే విభిన్న పేర్లతో పిలుస్తారో అదే విధంగా యోగాసనాలు, ముద్ర, బంధనాలను పిలిచే విధానంలో వ్యత్యాసాలు ఉండవచ్చు. ఎనిమిదేళ్ల నుంచి 80ఏళ్ల వరకూ వయసున్న ప్రతి ఒక్కరూ యోగాసనాలు సాధన చేయవచ్చు. ఆసనాలు వేసే ప్రదేశం చదునుగా. స్వఛ్చమైన గాలి వెలుతురు ప్రసరించేలా ఉండాలి. తొలుత పొట్ట, మూత్రాశయాన్ని ఖాళీగా ఉంచుకోవాలి. సాధన మధ్యలో కొంచెం నీరు తాగవచ్చు. ఆసనంలోకి వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు శరీర కదలికలకు అనుగుణంగా ఉఛ్వాసనిశ్వాసలు ఉండాలి. శరీరాన్ని సాగదీసేటప్పుడు శ్వాస తీసుకోవడం, సంకోచింప జేసేటప్పుడు (వదులుగా వదిలినపుడు) శ్వాస వదలడం చాలా ముఖ్యం. ఆసనంలో ఉన్నప్పుడు మాత్రం సాధారణ శ్వాస తీసుకోవాలి. ఎంతసేపు శ్వాస తీసుకోవాలి అనేది కొత్తగా ప్రారంభించే వారికి ముఖ్యం కాదు. కాబట్టి, శక్తి అనుసారం చేయవచ్చు. ఆసనంలో ఉండే సమయం వృధ్ధి చేసుకోవడానికి ఒకటి రెండు మూడు...పది అంటూ అంకెలు లెక్కపెట్టవచ్చు.
ఆసనమైనా, ప్రాణయామమైనా... సాధకులు వారి వయసును బట్టి, దేహపు స్థితిగతులను బట్టి ఎంతవరకూ చేయగలరో అంతవరకే చేయాలి. యోగాలో అన్ని ఆసనాలనూ కుడి, ఎడమ రెండు వైపులకూ చేయాలి. శరీరాన్ని సమస్థితిలోకి తీసుకురావడానికి అది ఉపకరిస్తుంది. శారీరక ధృఢత్వానికి కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఋషులు, మునులు అందించిన శాస్త్రం హఠయోగం. దీనిని తొలుత 8వ శతాబ్ధంలో స్వాత్మారామ అనే నాధగురువు హఠయోగ ప్రదీపిక పేరిట గ్రంధ రూపంలో అందించారు. స్వాత్మారాముడు ప్రధమ శ్లోకంలోనే రాజయోగ ఉపయోగార్ధం ఈ హఠయోగాన్ని ఇస్తున్నట్టు చెబుతాడు. పతంజలి ఇచ్చిన యోగ దర్శనానికి అనుగుణంగా ధ్యానం చేయడానికి శరీరాన్ని సిద్ధం చేయడం హఠయోగ సాధన ముఖ్యోధ్ధేశ్యం. శాస్త్రం కాబట్టి యోగాను శాస్త్రీయ దృక్పధంతోనే ఆచరించాలి. యోగా అనే పదం యంగ్ అనే పదంలో నుంచి వచ్చినట్టయితే దాని అర్ధం సంయోగం. అంటే శరీరాన్ని, శ్వాసను మనసుతో అనుసంధానం చేసి సమన్వయం చేయడం. దీనికి మూలం ‘యోక్’ అయినట్లయితే దాని అర్ధం కాడి. రైతు పొలం దున్నేటప్పుడు కాడికి కుడి ఎడమ వైపున కట్టిన ఎడ్ల కదలికలో సమతుల్యం ఉండేటట్టుగా ఎలా చూస్తాడో అలాగే యోగాసన, ప్రాణాయామ సాధన చేసేటప్పుడు శరీరంలో ఎడమ, కుడి భాగాలను మెదడులో ఎడమ, కుడి గోళార్ధములను, ఇడ-పింగళ నాడులను సమంగా పనిచేసేటట్టుగా చూడాలి.
యోగ సాధన అంతిమ లక్ష్యం ఆత్మ దర్శనం. బ్రహ్మజ్ఞానం పొందడం, కైవల్యం, నిర్వాణ/నిబ్బాన స్థితిని చేరడమే. ఒకే వస్తువును వివిధ ప్రాంతాలలో ఎలాగైతే విభిన్న పేర్లతో పిలుస్తారో అదే విధంగా యోగాసనాలు, ముద్ర, బంధనాలను పిలిచే విధానంలో వ్యత్యాసాలు ఉండవచ్చు. ఎనిమిదేళ్ల నుంచి 80ఏళ్ల వరకూ వయసున్న ప్రతి ఒక్కరూ యోగాసనాలు సాధన చేయవచ్చు.
- సమన్వయం: సత్యబాబు
ఎ.ఎల్.వి కుమార్ ట్రెడిషనల్
యోగా ఫౌండేషన్