మళ్లీ ఇసుక దందాలు | Sand again Dandalu | Sakshi
Sakshi News home page

మళ్లీ ఇసుక దందాలు

Published Sat, May 24 2014 2:01 AM | Last Updated on Sat, Sep 2 2017 7:45 AM

మళ్లీ ఇసుక దందాలు

మళ్లీ ఇసుక దందాలు

  • గుంటుపల్లి రీచ్‌కు అక్రమ అనుమతి
  •   గని ఆత్కూరు క్వారీ సీజ్
  •  విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : జిల్లాలో మళ్లీ ఇసుక దందాలు మొదలయ్యాయి. ఇసుక రీచ్‌ల నిర్వాహకులు లక్షల్లో ముడుపులు ముట్టచెప్పి.. అక్రమంగా అనుమతులు పొంది.. యథేచ్ఛగా తెల్ల బంగారాన్ని దోచుకుంటున్నారు. జిల్లాలో ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి ఇసుక రేవులో బోట్స్‌మన్ సొసైటీకి దొడ్డిదారిలో అక్రమ అనుమతి మంజూరైంది. నేరుగా మైనింగ్ డెరైక్టరేట్ నుంచి అనుమతి మంజూరుకావటం చర్చనీయాంశంగా మారింది.

    అక్రమంగా అనుమతులు పొందిన గుంటుపల్లి రీచ్‌లో నెలరోజులుగా యథేచ్ఛగా తవ్వకాలు జరుగుతున్నాయి. మరోవైపు కంచికచర్ల మండలం గనిఆత్కూరు ఇసుక రీచ్‌లో కూడా అక్రమ త వ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. దీనిపై ఫిర్యాదు అందడంతో జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు విజయవాడ మైనింగ్ అధికారులు శుక్రవారం దాడులు చేసి క్వారీని సీజ్ చేశారు.

    గుంటుపల్లి రీచ్‌లో ఇలా...

    గుంటుపల్లి బోట్స్‌మన్ సొసైటీకి 2008లో లీజును తీసుకున్నారు. అప్పట్లో లీజు కాలాన్ని అధికారులు పొడిగించారు. లీజుకాలాన్ని పొడిగించటం నిబంధనలకు విరుద్ధమని గొల్లపూడి బోట్ వర్కర్స్ సొసైటీ ప్రతినిధులు హైకోర్టును ఆశ్రయించారు. దాంతో హైకోర్టు లీజును పొడిగించవద్దని ఆధికారులను ఆదేశించింది. ఈ విధంగా పలుమార్లు కోర్టుల్లో కేసులు నడవటంతో అధికారులు ఈ కార్వీ వేలం పాటలను నిలుపుదల చేశారు.

    తాజాగా ఈ ఏడాది ఏప్రిల్ 11న హైకోర్టు గుంటుపల్లి బోట్స్‌మన్ సొసైటీ లీజును పొడి గించవద్దని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ బోట్స్‌మన్ సొసైటీ వారు రాష్ట్ర స్థాయిలో ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకుని మళ్లీ లీజు పొడిగింపు ఉత్తర్వులను పొందినట్లు తెలిసింది. దాంతో గుంటుపల్లి బోట్స్‌మన్ సొసైటీ తవ్వకాలు గత నెల రోజులుగా ఊపందుకున్నాయి.

    మైనింగ్ డెరైక్టరేట్ నుంచి ఉత్తర్వులు రావటంతో జిల్లాలో అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. సొసైటీ అధ్యక్షుడిని చేతిలో పెట్టుకుని కొందరు బినామీ వ్యక్తులు ఈ అక్రమ తవ్వకాలు సాగిస్తున్నట్లు తాజాగా ఫిర్యాదులు వస్తున్నాయి. మైనింగ్ డెరైక్టరేట్ నుంచి అనుమతి రావటంతో ఈ విషయమై జిల్లా మైనింగ్ అధికారులు నోరు మెదపటం లేదు.
     
    గని ఆత్కూరులో..

    గని ఆత్కూరు క్వారీలో బినామీ వ్యక్తులు దందా చేసి అక్రమంగా తవ్వకాలు సాగిస్తున్నారనే ఫిర్యాదులపై మైనింగ్ అధికారులు తనిఖీలు చేశారు. ఏడున్నర ఎకరాల మేరకు లీజుకు తీసుకుని అడ్డగోలుగా తవ్వకాలు సాగిస్తున్నట్లు ఫిర్యాదులు అందాయి. మీటరు లోతు తవ్వాల్సిన పాటదారుడు నిబంధనలకు విరుద్ధంగా 10 మీటర్ల లోతు తవ్వుతున్నారని ఫిర్యాదులో పేర్కొనడంతో మైనింగ్ అధికారులు తనిఖీలు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ అక్రమ తవ్వకాల వెనుక టీడీపీ నేతలు ఉన్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి.
     
    గని ఆత్కూరు క్వారీ నిలిపివేత
     
    గని ఆత్కూరు (కంచికచర్ల రూరల్) : మండలంలోని గని ఆత్కూరు ఇసుక క్వారీ శుక్రవారం నిలిచిపోయింది. ఈ మేరకు నందిగామ మైనింగ్ ఏడీ సీ మోహనరావు మాట్లాడుతూ గని ఆత్కూరు క్వారీలో అవకతవకలు జరుగుతున్నట్లు జాయింట్ కలెక్టర్‌కు ఫిర్యాదు అందిందని, జేసీ ఆదేశాల మేరకు క్వారీలో తవ్వకాలు నిలుపుదల చేశామని చెప్పారు. శనివారం సర్వేయర్ , మండల సర్వేయర్, రెవెన్యూ అధికారులను తీసుకెళ్లి సక్రమంగా కొలతలు నిర్వహించి తగిన సమాచారాన్ని జాయింట్ కలెక్టర్‌కు అందజేస్తామని తెలిపారు.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement