Reach sand
-
కాంట్రాక్టర్ల కంట్లో ఇసుక
► ఇసుక టెండర్లు రద్దు చేసిన సర్కారు ► దరఖాస్తుల సొమ్ము తిరిగి చెల్లించని వైనం ► అధికారులు, అధికార పార్టీ నేతల చుట్టూ కాంట్రాక్టర్ల ప్రదక్షిణలు జిల్లాలో ఇసుక రీచ్‌ల టెండర్ల కోసం రాష్ర్ట ప్రభుత్వం కాంట్రాక్టర్ల నుంచి దరఖాస్తుల రూపంలో వసూలు చేసిన సుమారు రూ.2 కోట్ల ఊసే ఎత్తడం లేదు. టెండర్లు రద్దు చేసినందున తమ సొమ్ము తిరిగి ఇవ్వాలని కాంట్రాక్టర్లు భూగర్భ వనరుల శాఖ అధికారులు, అధికార పార్టీ నేతల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. సాక్షి ప్రతినిధి,నెల్లూరు: రాష్ర్టంలో ఇసుక రీచ్‌లను ప్రభుత్వం తొలుత మహిళా సంఘాలకు కట్టబెట్టింది. ఇసుక రీచ్‌ల ద్వారా వచ్చిన ఆదాయంలో సంఘాలకు వాటా ఇచ్చేలా విధాన నిర్ణయం తీసుకుంది. పేరు మహిళా సంఘాలదే అయినా ఇసుక రీచ్‌లను కాంట్రాక్టర్లే నిర్వహిస్తూ కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. జిల్లాలో కూడా ఇదే విధానం అమలవడంతో అధికార పార్టీకి చెందిన కాంట్రాక్టర్లు, నాయకులు ఇసుక ద్వారా కోట్ల రూపాయలు పిండుకున్నారు. దీంతో మహిళా సంఘాల నుంచి ఇసుక రీచ్‌లను రద్దు చేసి వేలం విధానంలో మళ్లీ కాంట్రాక్టర్లకు అప్పగించాలని ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా జిల్లాలోని 25 ఇసుక రీచ్‌లను 6 నెలల నుంచి ఏడాది పాటు లీజుకు ఇవ్వడానికి ఈ ఏడాది జనవరి 24న జిల్లా యంత్రాంగం నోటిఫికేషన్ జారీ చేసింది. ఫిబ్రవరి 6లోగా ఆన్లైన్లో దరఖాస్తులు పొంది 9లోగా దాఖలు చేయాలని గడువు నిర్ణయించింది. పోటా పోటీగా దరఖాస్తుల దాఖలు మహిళా సంఘాల పేరుతో అనధికారికంగా ఇసుక రీచ్‌లు నిర్వహించిన కాంట్రాక్టర్లతో పాటు పలువురు ఆశావహులు ఇసుక రీచ్‌ల టెండర్లు దక్కించుకోవడానికి పోటీ పడ్డారు. వేలం నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం ఎంఎస్టీసీ లిమిటెడ్ కంపెనీకి అప్పగించింది. ఆ కంపెనీకి ఎస్ బ్యాంక్‌లో ఖాతా ఉండటంతో కాంట్రాక్టర్లంతా ఎస్ బ్యాంకులో దరఖాస్తులకు సంబంధించిన రుసుం, ఈఎంఐ చె ల్లించాలని ఎంఎస్టీసీ షరతు విధించింది. ఇసుక రీచ్‌ల్లో గుర్తించిన ఇసుక పరిమాణం ఆధారంగా దరఖాస్తును రూ.25 వేల నుంచి రూ.లక్ష వరకు విక్రయించింది. ఈ లెక్కన జిల్లాలో సుమారు 50 మంది కాంట్రాక్టర్లు దరఖాస్తులు కొనుగోలు చేసి ఈఎంఐ చెల్లించారు. అయితే ప్రభుత్వం హఠాత్తుగా ఉచిత ఇసుక విధానం అమల్లోకి తేవాలని నిర్ణయం తీసుకుంది. అప్పటికే నిర్వహించిన టెండర్లను రద్దు చేసింది. దీంతో జిల్లాలో కూడా టెండర్లు రద్దయ్యాయి. కాంట్రాక్టర్లు చెల్లించిన ఈఎంఐ మొత్తాన్ని ప్రభుత్వం వారి ఖాతాలకు జమ చేసింది. అయితే దరఖాస్తుల రూపంలో వసూలు చేసిన కోట్లాది రూపాయల విషయాన్ని పట్టించుకోలేదు. ఈ మొత్తం జిల్లాలో సుమారు రూ.2కోట్లు ఉండగా, రాష్ర్ట వ్యాప్తంగా సుమారు రూ.30 కోట్ల వరకు ఉంటుందని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. టెండర్లు రద్దు చేసినందున తాము దరఖాస్తుల కోసం చెల్లించిన మొత్తాన్ని కూడా వెనక్కు ఇప్పించాలని కాంట్రాక్టర్లు భూగర్భవనరుల అధికారులు, అధికార పార్టీ నేతలను కలిసి విన్నవించుకున్నారు. -
ఇసుక మరింత చౌక
► అందుబాటులోకి మన ఇసుక యాప్ ► టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేస్తే చాలు ► 24 గంటల్లో వస్తుందంటున్న అధికారులు ► జిల్లా అవసరాలకు ‘తూర్పు-శ్రీకాకుళం’ నుంచి ఆరిలోవలో శాండ్ డిపో పునఃప్రారంభం సాక్షి, విశాఖపట్నం : ‘ఉచిత ఇసుక’ రవాణా ఖర్చులతో కలిపి సామాన్యులకు మరింత చౌకగా అందించేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తోంది. ఇప్పటికే కాల్ టాక్సీల మాదిరిగా మన ఇసుక పేరిట ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కావాల్సిన రీచ్‌లో కావల్సినంత ఇసుకను బుక్ చేసుకునేందుకు ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నంబర్ 86889-39939ను ఏర్పాటు చేశారు. గతంలో నిర్వహిం చిన ఆరిలోవ శాండ్ డిపోను మళ్లీ పునఃప్రారంభించారు. జిల్లా అవసరాలకు సరిపడా ఇసుక కోసం శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాలో ఎంపిక చేసిన రీచ్‌ల నుంచి ప్రత్యేకంగా రప్పిస్తున్నా రు. రీచ్‌ల్లో ఇసుక ఉచితంగా తవ్వుకునే అవకాశం ఉండడంతో రవాణా చార్జీల పేరిట దోపిడీని అరికట్టేందుకు కలెక్టర్ యువరాజ్, జేసీ నివాస్‌లు చేస్తున్న కృషి సత్ఫలితాలనిస్తుందనే చెప్పాలి. తూర్పుగోదావరి జిల్లా రీచ్‌ల్లో ఇసుక ఇంకా పూర్తిగా అందుబాటులోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం ఆయా రీచ్‌లలో ఇసుకను జిల్లాలోని నిర్మాణదారులు నేరుగా తెచ్చుకుంటున్నారు. కాగా ప్రస్తుతం శ్రీకాకుళం రీచ్‌ల నుంచి ప్రత్యేక వాహనాల ద్వారా రప్పిస్తున్న ఇసుకను గతంలో మాదిరిగా ఆరిలోవ వద్ద సామాన్యులకు అందుబాటులో ఉంచుతున్నారు. కాగా శ్రీకాకుళం రీచ్‌ల నుంచి దూరాభారాన్ని లెక్కలేసిన మైన్స్ అధికారులు లారీ యజమానులతో చర్చించి రవాణా చార్జీలు మరింత తగ్గించేలా ఒప్పించారు. దీంతో వారం రోజుల క్రితం వరకు ఉన్న రేట్లను మరింత తగ్గిస్తూ శుక్రవారం ప్రకటన చేశారు. నాలుగురోజుల క్రితం శ్రీకాకుళం నుంచి రవాణా చేసే 12 క్యూబిక్‌మీటర్(క్యూ.మీ.) ఇసుకను విశాఖపట్నంలోని ఎన్ఏడీ జంక్షన్ వరకు రూ.12 వేలు నిర్ణయించగా.. తాజాగా ఆ ధరను రూ.11 వేలకు తగ్గించారు. అలాగే గాజువాక జంక్షన్ వరకు గతంలో రూ.13 వేలుగా ప్రకటించిన 12 క్యూ.మీ.ఇసుక ధరను ప్రస్తుతం రూ.1 2వేలుగా నిర్ణయించారు. అలాగే 15 క్యూ.మీ లారీ ఇసుక (12 టైర్ల లారీ)ను ఎన్ఏడీ వరకు గతంలో రూ.14 వేలు ప్రకటించగా.. తాజాగా రూ.13 వేలుగా నిర్ణయించారు. గాజువాకకైతే గతంలో రూ.15 వేలుగా ప్రకటించగా.. తాజాగా ఆ ధరను రూ.14 వేలకు తగ్గించారు. ఈమేరకు జిల్లా ఇసుక కమిటీ చైర్మన్, కలెక్టర్ డాక్టర్ ఎన్,యువరాజ్ అధికారిక ప్రకటన చేశారు. ఇంతకు మించి ఎవరైనా విక్రయిస్తే బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా ఇటీవల జిల్లా జేసీ నివాస్ ప్రారంభించిన మన ఇసుక యాప్‌ను రోజు నుంచి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం శ్రీకాకుళం రీచ్‌ల నుంచి రోజుకు 3 వేల క్యూ.మీ ఇసుకతో 250 లారీల వరకు రప్పిస్తున్నారు. వీటిని యాప్ ద్వారా బుక్ చేసుకున్న వారికి రవాణా చేస్తున్నారు. టోల్‌ఫ్రీ నెంబర్‌ను కూడా వినియోగంలోకి తీసుకొచ్చారు. -
మట్టి కొట్టుకుపోతున్నాం!
► గుండిమెడ రైతుల ఆగ్రహం ► ఇసుక రీచ్ వద్ద నాలుగు గంటలపాటు ధర్నా ► లారీల కారణంగా పంటలు పాడైపోతున్నాయని ఆందోళన ► రహదారిపై నీళ్లు చల్లి వాహనాలు తిప్పుకోవాలని పోలీసుల సూచన తాడేపల్లి రూరల్ : ఉచిత ఇసుక సరే... తమ పంట పొలాల సంగతేంటంటూ గుండిమెడ రైతులు గ్రామంలోని ఇసుక రీచ్ వద్ద మంగళవారం నాలుగు గంటలపాటు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు క్వారీ నిర్వాహకులకు మధ్య కొంతసేపు వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ సంఘటనపై సమాచారం అందుకున్న ఫ్లైయింగ్ స్వ్కాడ్ పోలీసులు అక్కడకు చేరుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రైతులు పోలీసులతో మాట్లాడుతూ ఇసుక రీచ్ నుంచి వచ్చే లారీలు, ట్రాక్టర్ల వల్ల తమ పంట పొలాలకు వెళ్లే రహదార్లు పూర్తిగా పాడైపోయాయని వాపోయారు. నీళ్లు చల్లకపోవడం వల్ల రోడ్లపై నుంచి దుమ్ము లేచి పంట పొలాలపై పడి ఒక్కో రైతు రూ. 30-40 వేలు నష్టపోవాల్సివచ్చిందని తెలిపారు. ఇప్పుడు అడ్డకోకపోతే పండిన పంట దుమ్ము పాలవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక లారీలు వచ్చే రహదారి వెంట 300-500 ఎకరాల జొన్న, మొక్కజొన్న పంట పొలాలుఉన్నాయి. మొక్కజొన్న అయితే కండె లు విరుచుకుంటామని, జొన్న పరిస్థితి అర్థం కావడం లేదని వాపోయారు. పోలీసులు రహదారుల వెంట నీళ్లు చల్లించి వాహనాలు తిప్పుతామంటే తమకు అభ్యంతరం లేదని తెలిపారు. దీంతో పోలీసులు గుండిమెడ ఇసుక రీచ్‌లో తవ్వకాలు నిర్వహిస్తున్న పొక్లెయినర్ల యజమానులను పిలిపించి రైతుల పంటలు పాడవకుండా రహదారిపై నీళ్లు చల్లించాలని సూచించా రు. అయితే క్వారీలో 8 పొక్లెయిన్లు ఉండగా, ఇద్దరు యజమానులు మా త్రమే అక్కడకు వచ్చి రోజుకొకరు నీళ్లు చల్లుతామంటూ రైతులకు తెలియజేశారు. రైతులు మాత్రం మిగిలిన ఆరుగురితో కూడా నీళ్లు చల్లించే బాధ్యత మీరు తీసుకుంటారా? అని అడగడంతో వచ్చిన ఇద్దరు సరైన సమాధానం చెప్పలేదు. దీంతో రైతులు మళ్లీ ఆందోళనకు దిగారు. అనంతరం పోలీసులు కలగజేసుకుని ప్రస్తుతానికి నీళ్లు చల్లిస్తున్నారు కదా, నీళ్లు చల్లించకపోతే అడ్డుకోవాలని సూచించడంతో రైతులు మెత్తబడ్డారు. -
అనుమతిలేని క్వారీ.. అక్రమాల దారి
కోర్టు ఆదేశాలు బేఖాతరు అనుమతులు లేకుండానేయథేచ్ఛగా అమ్మకాలు పనిచేయని సీసీ కెమెరాల వెనుక మర్మమేమిటి? తాడేపల్లి రూరల్ : కోర్టు ఆదేశాలకు తిలోదకాలిచ్చి పెనుమాక ఇసుక రీచ్‌లో బుధవారం యథేచ్ఛగా ఇసుక అమ్మకాలు జరిపారు. ప్రభుత్వం తరఫున క్వారీ నిర్వహణా బాధ్యతలు చూసే ఏసీఎం శ్రీధర్ అనుమతితోనే ఇదంతా జరిగిందని, డీఆర్డీఏ పీడీ బి.శ్రీనివాసరావు ఇసుక అమ్మకాలు నిర్వహించమన్నట్టు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. తమకు అందాల్సిన లెక్కల్లో తేడాలు రావడంతో సాక్షాత్తూ తెలుగు తమ్ముళ్లు అధికారులను వెంటబెట్టుకుని క్వారీలో హల్చల్ చేశారు. దీంతో కంగారు పడిన ఏపీఎం లోడింగ్‌ను నిలిపివేశారు. రెవెన్యూ అధికారి దుర్గారావు, ఎస్ఐ వినోద్‌కుమార్ అనుమతి పత్రాలు చూపించమని కోరడంతో ఏపీఎం శ్రీధర్ మాత్రం తమ వద్ద పత్రాలు లేవని, జిల్లా డీఆర్డీఏ పీడీ అనుమతి ఇచ్చారంటూ జవాబిచ్చారు. దీంతో క్వారీ నిర్వహించవద్దంటూ సూచించి ఎటువంటి చర్యలు తీసుకోకుండానే అధికారులు వెనుదిరిగారు. ‘నిఘా’ నిర్వాహకుల చేతుల్లోనే.. ఇసుక క్వారీలో అక్రమాలు జరక్కుండా చూసేందుకు ప్రభుత్వం ఏర్పాటుచేసిన నిఘా నేత్రాలు నిర్వాహకుల కనుసన్నల్లోనే పనిచేస్తున్నాయి. బుధవారం ఉదయం సీసీ కెమెరాలు పాడయ్యాయని చెప్పిన నిర్వాహకులు.. అధికారుల రాకతో పనిచేస్తున్నాయని చెప్పారు. ఉదయం కరకట్ట రోడ్డు దృశ్యాలను చూపిన కెమారాలు అధికారులు వచ్చేసరికి క్వారీ నిర్వహణను చూపిస్తున్నాయి. అంటే అక్రమాలను కప్పిపుచ్చడానికే సీసీ కెమెరాలను నిర్వాహకులు తమకు అనుగుణంగా ఏర్పాటు చేసుకున్నారని చెబుతున్నారు. మొదటి నుంచీ పెనుమాక క్వారీలో అక్రమాలు జరుగుతున్నా కన్నెత్తి చూడని రెవెన్యూ, పోలీస్ అధికారులు స్థానికి టీడీపీ నాయకులు ఆరోపిస్తే గానీ క్వారీకి రాకపోవడం విడ్డూరం. స్వయానా అధికార పార్టీ నాయకులే క్వారీ నిర్వహణపై ఆరోపణలు చేస్తుంటే ఇక్కడ అక్రమాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. కొసమెరుపు ఏమిటంటే.. పెనుమాక ఇసుక రీచ్‌లో అక్రమాలు జరుగుతున్నాయి, వాటిని అరికట్టడానికి టీడీపీ మండల నాయకులు ఆరు నెలల తరువాత నోరు విప్పడంపై పలు అనుమానాలు కలుగుతున్నాయి. ఇసుక రీచ్‌లో అక్రమాలు జరుగుతున్నాయన్న సదరు నేత గ్రామంలో రాత్రీ పగలూ తేడా లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తుంటే.. స్థానిక యువకులు ఫిర్యాదు చేశారంటూ వారిపై దాడికి పాల్పడడమే కాకుండా, ఆయనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించారు. ఇప్పుడు మాత్రం తాము నీతిమంతులమంటూ ఇసుక అక్రమాలను అడ్డుకుంటాం.. సీఎం దృష్టికి తీసుకువెళ్తామంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఆ ప్రకటనలు కూడా తమ పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను టార్గెట్ చేసుకుని మాట్లాడారు. ఎమ్మెల్యే అనుచరులు స్థానిక టీడీపీ నేతలకు వాటా ఇవ్వకుండా ఇసుక రీచ్ నిర్వహించడం వల్లే ఈ తతంగం జరుగుతోందని డ్వాక్రా మహిళలే విమర్శిస్తున్నారు. క్వారీలో అక్రమాలు జరిగాయని సాక్ష్యాలు ఉన్నప్పుడు ఎందుకు బయటపెట్టడం లేదో అర్థం కావడం లేదంటూ బోట్మన్ సొసైటీ సభ్యులు వ్యాఖ్యానించడం గమనార్హం. -
సర్కారు నోట్లో దుమ్ము
సాక్షి’ చెప్పిందే నిజమైంది.. ఇసుక వేలంలో వ్యాపారుల సిండికేట్ వ్యాపారులను బెదిరించిన టీడీపీ నేతలు కనిష్టంగా రూ.116కు టెండర్ ప్రభుత్వ ఆదాయానికి భారీగా తూట్లు ఏడు రీచ్‌లకు రూ.27.44 కోట్లు మాత్రమే సాక్షిప్రతినిధి, గుంటూరు : ఇసుక రీచ్‌ల వేలంలో వ్యాపారులంతా సిండికేట్ అయ్యారు. టీడీపీ నేతలు ఇందులో ముఖ్యభూమిక వహించారు. దరఖాస్తుదారుల వివరాలను ముందుగానే తెలుసుకుని పోటీపడి టెండర్లు వేస్తే ఇబ్బంది పడతారని వారిని టీడీపీ నేతలు బెదిరించారు. తప్పని పరిస్థితుల్లో వ్యాపారులు టీడీపీ నేతల ఆదేశాలను పాటించి ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే తక్కువగా దరఖాస్తులో పేర్కొన్నారు. సిండికేట్ కారణంగా ప్రభుత్వ ఆదాయం గణనీయంగా పడిపోయింది. క్యూబిక్ మీటరుకు రూ.500 ధరను ప్రభుత్వం నిర్ణయిస్తే, సిండికేట్ కారణంగా రూ.కనిష్టంగా రూ.116, గరిష్టంగా రూ.356 ధరలకు టెండరు వేశారు. కొన్ని రీచ్‌ల్లో ఇసుక తవ్వకాలకు పరిస్థితులు అనుకూలంగా లేవని, స్థానిక సమస్యలు ఉండడంతో వ్యాపారులు ధర తక్కువగా వేశారని, సిండికేట్ అయినట్టు తమ దృష్టికి రాలేదని అధికారులు చెబుతున్నారు. గుండిమెడ రీచ్‌కు రూ. 8 కోట్లు ‘సాక్షి ’ దినపత్రిక మొదటి నుంచి ఇసుక రీచ్‌ల టెండర్లలో టీడీపీ నేతలు ముందస్తు వ్యూహంతో వ్యవహరిస్తున్నారని ప్రచురించింది. గుండిమెడ రీచ్‌లో వ్యాపారులు సిండికేట్ అయ్యారని కూడా ప్రత్యేక కథనం ప్రచురించింది. ఈ రీచ్‌లో జరిగిన విధంగానే మిగిలిన రీచ్‌ల విషయంలో టీడీపీ నేతలు వ్యవహరించి అంతా సిండికేట్ అయ్యే విధంగా చేయగలిగారు. దరఖాస్తుదారుల వివరాలను తెలుసుకుని, వారినందరినీ సమావేశానికి రావాలని ఆదేశించారు. ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే, సమస్యలు ఎదుర్కొంటారని హెచ్చరించారు. మొత్తం ఏడు రీచ్‌ల్లో గుండిమెడకు రూ.8 కోట్లకు వ్యాపారులంతా సిండికేట్ అయ్యారు. వేలంలో ఆ రీచ్‌ను పాడుకున్న వ్యాపారి ఇతర వ్యాపారులకు ఆ మొత్తాన్ని చెల్లించే విధంగా సిండికేట్ అయ్యారు. మరికొన్నిటిలో దరఖాస్తుదారులంతా ఆ రీచ్‌ల్లో వ్యాపారులుగా ఉండే విధంగా ఏర్పాటు చేసుకున్నారు.వారిలో ఒకరిని రీచ్ నిర్వాహకునిగా ఏర్పాటుచేసుకుని, మిగిలిన వారు భాగస్వాములుగా ఉండే విధంగా నిర్ణయం తీసుకున్నారు. రీచ్‌ల వారీ వ్యాపారులు చెల్లించనున్న ధరల వివరాలు ... ప్రభుత్వం నిర్ణయించిన విధంగా క్యూబిక్ మీటరుకు రూ.500 మించి విక్రయించరాదని ఆదేశాలు జారీ చేయడంతో దాని కంటే రేటును తక్కువ వేశారు. ఆ రేటుతోపాటు రీచ్‌ల్లోని ఖర్చులు, వివిధ శాఖల అధికారులకు చెల్లించే పర్సంటేజీలు, లాభంతో కలిపి రూ.500లోపు వ్యాపారులు విక్రయించాలి. గుండిమెడ రీచ్‌కు రూ.154, జువ్వలపాలెం రూ.138, కస్తల రూ.356, కోసూరు రూ.356, పోతార్లంక రూ.152, వల్లభాపురానికి రూ.142, ఉద్దండ్రాయునిపాలెంకు రూ.116లు చెల్లించే విధంగా వ్యాపారులు టెండరు వేశారు. రూ. 50 కోట్ల మేరకు నష్టం .. ఏడు రీచ్‌లకు జరిగిన వేలం ద్వారా ప్రభుత్వానికి రూ.27.44 కోట్ల ఆదాయం లభించనుంది. వ్యాపారులు సిండికేట్ కాకుండా పోటీపడి టెండరులో రేటు వేసి ఉంటే ప్రభుత్వానికి కనీసం రూ.50 కోట్లపైనే ఆదాయం లభించేదని ఆ రంగంలోని సీనియర్లు చెబుతున్నారు. నది నుంచి ఇసుక తవ్వేవిధానం ఉద్దండ్రాయునిపాలెం రీచ్‌లో ఉండడంతో అక్కడ ఖర్చులు ఎక్కువగా ఉంటాయని భావించి ప్రభుత్వ రేటుపై క్యూబిక్ మీటరుకు రూ.16 అదనంగా వేశారు. మిగిలిన రీచ్‌ల్లో ఇసుక తవ్వకాలకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పటికీ, రేటు ఎక్కువ వేయలేదు. కృష్ణానది దిగువ భాగం లోని రీచ్‌లన్నీ పాటదారులకు ఈ ఏడాది కోట్లు కురిపించను న్నాయని వ్యాపారులు చెబుతున్నారు. మొత్తం ఏడు రీచ్‌లకు 58 మంది టెండర్లు వేస్తే, అందులో 12 మంది అనర్హులయ్యారు. 46 మంది వ్యాపారుల దరఖాస్తులను పరిశీలించి ఏడురీచ్లను ఖరారు చేశారు. వీటి ద్వారా రూ.27.44 కోట్లు ఆదాయం ప్రభుత్వానికి లభించనుంది. ఈ ప్రక్రియ తరు వాత కొత్త రీచ్‌ల్లో ఇసుక తవ్వకాల ప్రారంభానికి మరో పది రోజుల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. -
ఇసుక వేలానికి బినామీలు ‘రీచ్’
జిల్లాలోని 13 చోట్ల 175 టెండర్లు బరిలో ప్రముఖ కంపెనీలు, టీడీపీ నేతలు రేపు విజయవాడలో ఈ-వేలం విజయవాడ : జిల్లాలో ఇసుక రీచ్‌లు దక్కించుకునేందుకు టీడీపీ నేతలు పావులు కదుపుతున్నారు. బంగారు గనులను కొల్లగొట్టేందుకు ఆ పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు బినామీలను రంగంలోకి దింపినట్లు సమాచారం. జిల్లాలో 13 రీచ్‌లకు భారీగా టెండర్లు వేయించారు. ప్రధానంగా పెనమలూరు, నందిగామ, జగ్గయ్యపేట, మైలవరం నియోజకవర్గాల్లో బినామీ టెండర్లు అధికంగా పడినట్లు చెబుతున్నారు. పలువురు నాయకులు తమ అనుచరుల పేర్లతో రంగంలోకి దిగారు. తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వారు కూడా టెండర్లు వేసినట్లు తెలుస్తోంది. ప్రముఖ కంపెనీలు కూడా ఇసుక వేలంలో బరిలోకి దిగినట్లు తెలిసింది. వీరంతా టీడీపీ నేతలతో జతకట్టినట్లు విశ్వసనీయ సమాచారం. వేలం బరిలో 175 మంది.. జిల్లాలో ఇసుక రీచ్‌లకు ఈ నెల 12న ఈ-వేలం నిర్వహించనున్నారు. విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు ఇసుక రేవులకు వేలం జరుగుతుంది. 189 మంది టెండర్లను దాఖలు చేశారు. వీటిలో 14 టెండర్లను సాంకేతిక కారణాలతో అధికారులు తిరస్కరించారు. 175 మంది రంగంలో ఉన్నారు. ఇసుక రీచ్‌ల వేలానికి ప్రభుత్వం గత నెలాఖరులో నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 5 వరకు టెండర్లు స్వీకరించారు. ఎం.ఎస్.టి.సి. (మెటల్ స్క్రాప్ ట్రేడ్ కార్పొరేషన్) వెబ్సైట్లో ఇసుక వేలం దరఖాస్తులు రూపొందించారు. జిల్లాలోని 13 రీచ్‌ల్లో ఓపెన్ ఏరియాలో 8 రీచ్‌లు, డీసిల్టింగ్‌పై 5 రీచ్‌ల్లో వేలానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. ఓపెన్ ఏరియాలో అంటే న దీ తీరం (ఒడ్డున) పెదపులిపాక, మద్దూరు, చెవిటికల్లు, కంచల, పొక్కునూరు, కాసరబాద, అల్లూరుపాడు, శనగపాడులలో నిర్వహిస్తారు. డీసిల్టింగ్‌పై (నదీగర్భంలో) భవానీపురం, గొల్లపూడి, సూరాయపాలెం, గుంటుపల్లి, ఇబ్రహీంపట్నం రీచ్‌లకు వేలం నిర్వహిస్తారు. మంచి నాణ్యమైన ఇసుకగా పేరున్న కాసరబాద రీచ్‌కు అత్యధికంగా 22 టెండర్లు పడ్డాయి. గొల్లపూడి రీచ్‌కు 18, పెదపులిపాక, చెవిటికల్లు, గుంటుపల్లి రీచ్‌లు ఒక్కో దానికి 16 టెండర్లు పడినట్లు సమాచారం. ఈ- వేలం పాటలు పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు జేసీ గంధం చంద్రుడు ఓ ప్రకటనలో తెలిపారు. నాయకుల ఒత్తిడి పలు నియోజకవర్గాలలో టీడీపీ నాయకులు ప్రజాప్రతినిధులపై ఇసుక రీచ్‌ల సంఖ్య పెంచాలని ప్రజాప్రతినిధులపై ఒత్తిడి చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి కొందరు ప్రజాప్రతినిధులు జిల్లా యంత్రాం గంతో ఇసుక రీచ్‌ల సంఖ్య పెంచే విషయమై చర్చలు జరుపుతున్నారు. -
ఇసుకాసురులు
రీచ్‌లను దక్కించుకునేందుకు టీడీపీ నేతల కొత్త ఎత్తుగడ జిల్లావ్యాప్తంగా 63 ఇసుక రీచ్‌లు..11రీచ్‌లకే టెండర్లు మిగిలినవి గంపగుత్తగా కొట్టేసేందుకు యత్నాలు జిల్లాలోని అత్యధిక ఇసుకరీచ్‌లను అధికారపార్టీ నేతలకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైంది. జిల్లావ్యాప్తంగా 63 ఇసుక రీచ్‌లుండగా, 11 రీచ్‌లకు మాత్రమే అధికారులు టెండర్లను ఆహ్వానించారు. మిగిలిన వాటిని గంపగుత్తగా దక్కించుకునేందుకు టీడీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. చిత్తూరు: ఇన్నాళ్లు డ్వాక్రా సంఘాల పేరుతో ఇసుకను మింగేసిన అధికార పార్టీ నేతలు మరో దోపిడీకి సిద్ధ మవుతున్నారు. జిల్లావ్యాప్తంగా నదు లు, చెరువులు, కుంటలు, రిజర్వాయ ర్ల పరిధిలో 63 ఇసుక రీచ్‌లున్నాయి. గతంలో అన్ని రీచ్‌లను గుర్తించి వీటిని డ్వాక్రా సంఘాల పేరుతో అధికారపార్టీ నేతలకు అప్పగించారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలతో పాటు జిల్లావ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు అక్రమంగా ఇసుక తరలించి రూ.కోట్లు గడిం చారు. పేదలు ఒక్క క్యూబిక్ మీటర్ ఇసుకను రూ.5 వేలకు తగ్గకుండా కొనుగోలు చేయాల్సి వచ్చింది. సీఎం సొంతజిల్లా కావడంతో అధికారులు అధికారపార్టీ నేతల జోలికి వెళ్లలేదు. ఇసుక అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి పెద్దఎత్తున ఆదాయం లభించాల్సి ఉన్నా అక్రమ రవాణా పుణ్యమా అని భారీగా గండిపడింది. టెండర్ల ప్రక్రియలో తిరకాసు.. ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తామన్న ప్రభుత్వం డ్వాక్రా సంఘాలను పక్కనపెట్టి టెండర్ విధానాన్ని తెరపైకి తెచ్చింది. మరోవైపు జిల్లాలో భారీ వర్షాలు కురవడంతో ఇసుక గతంలో లాగే అధిక మోతాదులో సమకూరింది. అయితే ఏర్పేడు మండలంలోని ముసిలిపేడు, నాగలాపురం, పిచ్చాటూరు మండలాల పరిధిలోని సురుటుపల్లె, ఎస్.బహుదూర్ పేట, చిత్తూరు మండలం ఆనగల్లు, జీడీనెల్లూరు మండలంలో నందనూరు, కలికిరి పరిధిలో గంగాపురం, మేడికుర్తి, పారాపట్ల, మహల్, గుండ్లూరు, చీకటిపల్లె, అడ్డావారిపల్లె తదితర 11 రీచ్‌లకు మాత్రమే మైనింగ్ అధికారులు వేలంపాటలు నిర్వహిస్తున్నారు. వారి అంచనా మేరకు ఈ రీచ్‌ల ద్వారా ప్రభుత్వానికి రూ.6,74,17,200 ఆదాయం రానుంది. అధికార పార్టీ నేతల ఒత్తిళ్ల మేరకే 52 రీచ్‌లను పక్కనపెట్టినట్టు తెలుస్తోంది. అభివృద్ధి పేరుతో అరాచకం.. ఇక ఇరిగేషన్, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ తదితర శాఖల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల కోసం 23 రీచ్‌లను కేటాయిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అయితే ప్రభుత్వశాఖల పేరుతో ఆ రీచ్‌లను సైతం అధికారపార్టీ నేతలు ఇప్పటికే స్వాధీనం చేసుకుని ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. వేలం పెట్టిన రీచ్‌ల్లో సైతం నేతలు యథేచ్ఛగా ఇసుకను తరలిస్తూనే ఉన్నారు. దీంతో వేరే ఎవ్వరూ వేలం పాటల్లో పాల్గొనే పరిస్థితి లేకుండా పోయింది. పైగా అధికార పార్టీ స్థానిక నేతలు కావడంతో వేలంలో రీచ్ దక్కించుకున్నా అక్రమ రవాణాను అడ్డుకునే పరిస్థితి ఉండదని మిగిలిన వారు మిన్నకుండిపోతున్నారు. సామాన్యుడిపై భారం.. రీచ్‌లన్నీ అధికారపార్టీ నేతల స్వాధీనంలో ఉండడంతో వారు నిర్ణయించిన ధరకే ఇసుకను కొనాల్సి వస్తోంది. క్యూబిక్ మీటర్ ఇసుక రూ.500లకు మించి అమ్ముకూడదని అధికారులు చెబుతున్నా అధికారపార్టీ నేతలు రూ.1000 తక్కువ లేకుండా ఇసుక అమ్మకాలు సాగిస్తున్నారు. ఇది ప్రజలకు ముఖ్యంగా పేదలకు భారంగా మారింది. -
మళ్లీ ఇసుక దందాలు
గుంటుపల్లి రీచ్‌కు అక్రమ అనుమతి గని ఆత్కూరు క్వారీ సీజ్ విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : జిల్లాలో మళ్లీ ఇసుక దందాలు మొదలయ్యాయి. ఇసుక రీచ్‌ల నిర్వాహకులు లక్షల్లో ముడుపులు ముట్టచెప్పి.. అక్రమంగా అనుమతులు పొంది.. యథేచ్ఛగా తెల్ల బంగారాన్ని దోచుకుంటున్నారు. జిల్లాలో ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి ఇసుక రేవులో బోట్స్‌మన్ సొసైటీకి దొడ్డిదారిలో అక్రమ అనుమతి మంజూరైంది. నేరుగా మైనింగ్ డెరైక్టరేట్ నుంచి అనుమతి మంజూరుకావటం చర్చనీయాంశంగా మారింది. అక్రమంగా అనుమతులు పొందిన గుంటుపల్లి రీచ్‌లో నెలరోజులుగా యథేచ్ఛగా తవ్వకాలు జరుగుతున్నాయి. మరోవైపు కంచికచర్ల మండలం గనిఆత్కూరు ఇసుక రీచ్‌లో కూడా అక్రమ త వ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. దీనిపై ఫిర్యాదు అందడంతో జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు విజయవాడ మైనింగ్ అధికారులు శుక్రవారం దాడులు చేసి క్వారీని సీజ్ చేశారు. గుంటుపల్లి రీచ్‌లో ఇలా... గుంటుపల్లి బోట్స్‌మన్ సొసైటీకి 2008లో లీజును తీసుకున్నారు. అప్పట్లో లీజు కాలాన్ని అధికారులు పొడిగించారు. లీజుకాలాన్ని పొడిగించటం నిబంధనలకు విరుద్ధమని గొల్లపూడి బోట్ వర్కర్స్ సొసైటీ ప్రతినిధులు హైకోర్టును ఆశ్రయించారు. దాంతో హైకోర్టు లీజును పొడిగించవద్దని ఆధికారులను ఆదేశించింది. ఈ విధంగా పలుమార్లు కోర్టుల్లో కేసులు నడవటంతో అధికారులు ఈ కార్వీ వేలం పాటలను నిలుపుదల చేశారు. తాజాగా ఈ ఏడాది ఏప్రిల్ 11న హైకోర్టు గుంటుపల్లి బోట్స్‌మన్ సొసైటీ లీజును పొడి గించవద్దని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ బోట్స్‌మన్ సొసైటీ వారు రాష్ట్ర స్థాయిలో ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకుని మళ్లీ లీజు పొడిగింపు ఉత్తర్వులను పొందినట్లు తెలిసింది. దాంతో గుంటుపల్లి బోట్స్‌మన్ సొసైటీ తవ్వకాలు గత నెల రోజులుగా ఊపందుకున్నాయి. మైనింగ్ డెరైక్టరేట్ నుంచి ఉత్తర్వులు రావటంతో జిల్లాలో అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. సొసైటీ అధ్యక్షుడిని చేతిలో పెట్టుకుని కొందరు బినామీ వ్యక్తులు ఈ అక్రమ తవ్వకాలు సాగిస్తున్నట్లు తాజాగా ఫిర్యాదులు వస్తున్నాయి. మైనింగ్ డెరైక్టరేట్ నుంచి అనుమతి రావటంతో ఈ విషయమై జిల్లా మైనింగ్ అధికారులు నోరు మెదపటం లేదు. గని ఆత్కూరులో.. గని ఆత్కూరు క్వారీలో బినామీ వ్యక్తులు దందా చేసి అక్రమంగా తవ్వకాలు సాగిస్తున్నారనే ఫిర్యాదులపై మైనింగ్ అధికారులు తనిఖీలు చేశారు. ఏడున్నర ఎకరాల మేరకు లీజుకు తీసుకుని అడ్డగోలుగా తవ్వకాలు సాగిస్తున్నట్లు ఫిర్యాదులు అందాయి. మీటరు లోతు తవ్వాల్సిన పాటదారుడు నిబంధనలకు విరుద్ధంగా 10 మీటర్ల లోతు తవ్వుతున్నారని ఫిర్యాదులో పేర్కొనడంతో మైనింగ్ అధికారులు తనిఖీలు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ అక్రమ తవ్వకాల వెనుక టీడీపీ నేతలు ఉన్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. గని ఆత్కూరు క్వారీ నిలిపివేత గని ఆత్కూరు (కంచికచర్ల రూరల్) : మండలంలోని గని ఆత్కూరు ఇసుక క్వారీ శుక్రవారం నిలిచిపోయింది. ఈ మేరకు నందిగామ మైనింగ్ ఏడీ సీ మోహనరావు మాట్లాడుతూ గని ఆత్కూరు క్వారీలో అవకతవకలు జరుగుతున్నట్లు జాయింట్ కలెక్టర్‌కు ఫిర్యాదు అందిందని, జేసీ ఆదేశాల మేరకు క్వారీలో తవ్వకాలు నిలుపుదల చేశామని చెప్పారు. శనివారం సర్వేయర్ , మండల సర్వేయర్, రెవెన్యూ అధికారులను తీసుకెళ్లి సక్రమంగా కొలతలు నిర్వహించి తగిన సమాచారాన్ని జాయింట్ కలెక్టర్‌కు అందజేస్తామని తెలిపారు.