సర్కారు నోట్లో దుమ్ము | tdp leaders corruption to Reach sand | Sakshi
Sakshi News home page

సర్కారు నోట్లో దుమ్ము

Published Sat, Feb 13 2016 1:34 AM | Last Updated on Fri, Aug 10 2018 9:42 PM

సర్కారు  నోట్లో దుమ్ము - Sakshi

సర్కారు నోట్లో దుమ్ము

సాక్షి’ చెప్పిందే నిజమైంది..
ఇసుక వేలంలో వ్యాపారుల సిండికేట్
వ్యాపారులను బెదిరించిన టీడీపీ నేతలు
కనిష్టంగా రూ.116కు టెండర్
ప్రభుత్వ ఆదాయానికి భారీగా తూట్లు
ఏడు రీచ్‌లకు రూ.27.44 కోట్లు మాత్రమే

 
  సాక్షిప్రతినిధి, గుంటూరు : ఇసుక రీచ్‌ల వేలంలో వ్యాపారులంతా సిండికేట్ అయ్యారు. టీడీపీ నేతలు ఇందులో ముఖ్యభూమిక వహించారు. దరఖాస్తుదారుల వివరాలను ముందుగానే  తెలుసుకుని పోటీపడి టెండర్లు వేస్తే     ఇబ్బంది పడతారని వారిని టీడీపీ నేతలు బెదిరించారు. తప్పని పరిస్థితుల్లో వ్యాపారులు టీడీపీ నేతల ఆదేశాలను పాటించి ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే తక్కువగా దరఖాస్తులో పేర్కొన్నారు. సిండికేట్ కారణంగా ప్రభుత్వ ఆదాయం గణనీయంగా పడిపోయింది. క్యూబిక్ మీటరుకు రూ.500 ధరను ప్రభుత్వం నిర్ణయిస్తే, సిండికేట్ కారణంగా రూ.కనిష్టంగా రూ.116, గరిష్టంగా రూ.356 ధరలకు టెండరు వేశారు. కొన్ని రీచ్‌ల్లో ఇసుక తవ్వకాలకు పరిస్థితులు అనుకూలంగా లేవని, స్థానిక సమస్యలు ఉండడంతో వ్యాపారులు ధర తక్కువగా వేశారని, సిండికేట్ అయినట్టు తమ దృష్టికి రాలేదని అధికారులు చెబుతున్నారు.

 గుండిమెడ రీచ్‌కు రూ. 8 కోట్లు
‘సాక్షి ’ దినపత్రిక మొదటి నుంచి ఇసుక రీచ్‌ల టెండర్లలో టీడీపీ నేతలు ముందస్తు వ్యూహంతో వ్యవహరిస్తున్నారని ప్రచురించింది. గుండిమెడ రీచ్‌లో వ్యాపారులు సిండికేట్ అయ్యారని కూడా ప్రత్యేక కథనం ప్రచురించింది. ఈ రీచ్‌లో జరిగిన విధంగానే మిగిలిన రీచ్‌ల విషయంలో టీడీపీ నేతలు వ్యవహరించి అంతా సిండికేట్ అయ్యే విధంగా చేయగలిగారు.  దరఖాస్తుదారుల వివరాలను తెలుసుకుని, వారినందరినీ  సమావేశానికి రావాలని ఆదేశించారు. ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే,  సమస్యలు ఎదుర్కొంటారని హెచ్చరించారు. మొత్తం ఏడు రీచ్‌ల్లో గుండిమెడకు రూ.8 కోట్లకు వ్యాపారులంతా సిండికేట్ అయ్యారు. వేలంలో ఆ రీచ్‌ను పాడుకున్న వ్యాపారి ఇతర వ్యాపారులకు ఆ మొత్తాన్ని చెల్లించే విధంగా సిండికేట్ అయ్యారు. మరికొన్నిటిలో దరఖాస్తుదారులంతా ఆ రీచ్‌ల్లో వ్యాపారులుగా ఉండే విధంగా ఏర్పాటు చేసుకున్నారు.వారిలో ఒకరిని రీచ్ నిర్వాహకునిగా ఏర్పాటుచేసుకుని, మిగిలిన వారు భాగస్వాములుగా ఉండే విధంగా నిర్ణయం తీసుకున్నారు.

 రీచ్‌ల వారీ వ్యాపారులు చెల్లించనున్న ధరల వివరాలు ...
ప్రభుత్వం నిర్ణయించిన విధంగా క్యూబిక్ మీటరుకు రూ.500 మించి విక్రయించరాదని ఆదేశాలు జారీ చేయడంతో దాని కంటే రేటును తక్కువ వేశారు. ఆ రేటుతోపాటు రీచ్‌ల్లోని ఖర్చులు, వివిధ శాఖల అధికారులకు చెల్లించే పర్సంటేజీలు, లాభంతో కలిపి రూ.500లోపు వ్యాపారులు విక్రయించాలి. గుండిమెడ రీచ్‌కు రూ.154, జువ్వలపాలెం రూ.138, కస్తల రూ.356, కోసూరు రూ.356, పోతార్లంక రూ.152, వల్లభాపురానికి రూ.142, ఉద్దండ్రాయునిపాలెంకు రూ.116లు చెల్లించే విధంగా వ్యాపారులు టెండరు వేశారు.
 
 రూ. 50 కోట్ల మేరకు నష్టం ..

ఏడు రీచ్‌లకు జరిగిన వేలం ద్వారా ప్రభుత్వానికి రూ.27.44 కోట్ల ఆదాయం లభించనుంది. వ్యాపారులు సిండికేట్ కాకుండా పోటీపడి టెండరులో రేటు వేసి ఉంటే ప్రభుత్వానికి కనీసం రూ.50 కోట్లపైనే ఆదాయం లభించేదని ఆ రంగంలోని సీనియర్లు చెబుతున్నారు.  నది నుంచి ఇసుక తవ్వేవిధానం ఉద్దండ్రాయునిపాలెం రీచ్‌లో ఉండడంతో అక్కడ ఖర్చులు ఎక్కువగా ఉంటాయని భావించి ప్రభుత్వ రేటుపై క్యూబిక్ మీటరుకు రూ.16 అదనంగా వేశారు. మిగిలిన రీచ్‌ల్లో ఇసుక తవ్వకాలకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పటికీ, రేటు ఎక్కువ వేయలేదు. కృష్ణానది దిగువ భాగం లోని రీచ్‌లన్నీ పాటదారులకు ఈ ఏడాది కోట్లు కురిపించను న్నాయని వ్యాపారులు చెబుతున్నారు. మొత్తం ఏడు రీచ్‌లకు 58 మంది టెండర్లు వేస్తే, అందులో 12 మంది అనర్హులయ్యారు. 46 మంది వ్యాపారుల దరఖాస్తులను పరిశీలించి ఏడురీచ్‌లను ఖరారు చేశారు. వీటి ద్వారా రూ.27.44 కోట్లు ఆదాయం ప్రభుత్వానికి లభించనుంది. ఈ ప్రక్రియ తరు వాత కొత్త రీచ్‌ల్లో ఇసుక తవ్వకాల ప్రారంభానికి మరో పది రోజుల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement