జిల్లాలోని 13 చోట్ల 175 టెండర్లు
బరిలో ప్రముఖ కంపెనీలు, టీడీపీ నేతలు
రేపు విజయవాడలో ఈ-వేలం
విజయవాడ : జిల్లాలో ఇసుక రీచ్‌లు దక్కించుకునేందుకు టీడీపీ నేతలు పావులు కదుపుతున్నారు. బంగారు గనులను కొల్లగొట్టేందుకు ఆ పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు బినామీలను రంగంలోకి దింపినట్లు సమాచారం. జిల్లాలో 13 రీచ్‌లకు భారీగా టెండర్లు వేయించారు. ప్రధానంగా పెనమలూరు, నందిగామ, జగ్గయ్యపేట, మైలవరం నియోజకవర్గాల్లో బినామీ టెండర్లు అధికంగా పడినట్లు చెబుతున్నారు. పలువురు నాయకులు తమ అనుచరుల పేర్లతో రంగంలోకి దిగారు. తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వారు కూడా టెండర్లు వేసినట్లు తెలుస్తోంది. ప్రముఖ కంపెనీలు కూడా ఇసుక వేలంలో బరిలోకి దిగినట్లు తెలిసింది. వీరంతా టీడీపీ నేతలతో జతకట్టినట్లు విశ్వసనీయ సమాచారం.
వేలం బరిలో 175 మంది..
జిల్లాలో ఇసుక రీచ్‌లకు ఈ నెల 12న ఈ-వేలం నిర్వహించనున్నారు. విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు ఇసుక రేవులకు వేలం జరుగుతుంది. 189 మంది టెండర్లను దాఖలు చేశారు. వీటిలో 14 టెండర్లను సాంకేతిక కారణాలతో అధికారులు తిరస్కరించారు. 175 మంది రంగంలో ఉన్నారు. ఇసుక రీచ్‌ల వేలానికి ప్రభుత్వం గత నెలాఖరులో నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 5 వరకు టెండర్లు స్వీకరించారు. ఎం.ఎస్.టి.సి. (మెటల్ స్క్రాప్ ట్రేడ్ కార్పొరేషన్) వెబ్‌సైట్‌లో ఇసుక వేలం దరఖాస్తులు రూపొందించారు. జిల్లాలోని 13 రీచ్‌ల్లో ఓపెన్ ఏరియాలో 8 రీచ్‌లు, డీసిల్టింగ్‌పై 5 రీచ్‌ల్లో వేలానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. ఓపెన్ ఏరియాలో అంటే న దీ తీరం (ఒడ్డున) పెదపులిపాక, మద్దూరు, చెవిటికల్లు, కంచల, పొక్కునూరు, కాసరబాద, అల్లూరుపాడు, శనగపాడులలో నిర్వహిస్తారు. డీసిల్టింగ్‌పై (నదీగర్భంలో) భవానీపురం, గొల్లపూడి, సూరాయపాలెం, గుంటుపల్లి, ఇబ్రహీంపట్నం రీచ్‌లకు వేలం నిర్వహిస్తారు. మంచి నాణ్యమైన ఇసుకగా పేరున్న కాసరబాద రీచ్‌కు అత్యధికంగా 22 టెండర్లు పడ్డాయి. గొల్లపూడి రీచ్‌కు 18, పెదపులిపాక, చెవిటికల్లు, గుంటుపల్లి రీచ్‌లు ఒక్కో దానికి 16 టెండర్లు పడినట్లు సమాచారం. ఈ- వేలం పాటలు పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు జేసీ గంధం చంద్రుడు ఓ ప్రకటనలో తెలిపారు.
నాయకుల ఒత్తిడి
పలు నియోజకవర్గాలలో టీడీపీ నాయకులు ప్రజాప్రతినిధులపై ఇసుక రీచ్‌ల సంఖ్య పెంచాలని ప్రజాప్రతినిధులపై ఒత్తిడి చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి కొందరు ప్రజాప్రతినిధులు జిల్లా యంత్రాం గంతో ఇసుక రీచ్‌ల సంఖ్య పెంచే విషయమై చర్చలు జరుపుతున్నారు.
ఇసుక వేలానికి బినామీలు ‘రీచ్’
Published Thu, Feb 11 2016 12:54 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM
Advertisement
Advertisement