రీచ్‌లను దక్కించుకునేందుకు టీడీపీ నేతల కొత్త ఎత్తుగడ
జిల్లావ్యాప్తంగా 63 ఇసుక రీచ్‌లు..11రీచ్‌లకే టెండర్లు
మిగిలినవి గంపగుత్తగా కొట్టేసేందుకు యత్నాలు
జిల్లాలోని అత్యధిక ఇసుకరీచ్‌లను అధికారపార్టీ నేతలకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైంది. జిల్లావ్యాప్తంగా 63 ఇసుక రీచ్‌లుండగా, 11 రీచ్‌లకు మాత్రమే అధికారులు టెండర్లను ఆహ్వానించారు. మిగిలిన వాటిని గంపగుత్తగా దక్కించుకునేందుకు టీడీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.
చిత్తూరు: ఇన్నాళ్లు డ్వాక్రా సంఘాల పేరుతో ఇసుకను మింగేసిన అధికార పార్టీ నేతలు మరో దోపిడీకి సిద్ధ మవుతున్నారు. జిల్లావ్యాప్తంగా నదు లు, చెరువులు, కుంటలు, రిజర్వాయ ర్ల పరిధిలో 63 ఇసుక రీచ్‌లున్నాయి. గతంలో అన్ని రీచ్‌లను గుర్తించి వీటిని డ్వాక్రా సంఘాల పేరుతో అధికారపార్టీ నేతలకు అప్పగించారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలతో పాటు జిల్లావ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు అక్రమంగా ఇసుక తరలించి రూ.కోట్లు గడిం చారు. పేదలు ఒక్క క్యూబిక్ మీటర్ ఇసుకను రూ.5 వేలకు తగ్గకుండా కొనుగోలు చేయాల్సి వచ్చింది. సీఎం సొంతజిల్లా కావడంతో అధికారులు అధికారపార్టీ నేతల జోలికి వెళ్లలేదు. ఇసుక అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి పెద్దఎత్తున ఆదాయం లభించాల్సి ఉన్నా అక్రమ రవాణా పుణ్యమా అని భారీగా గండిపడింది.
టెండర్ల ప్రక్రియలో తిరకాసు..
ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తామన్న ప్రభుత్వం డ్వాక్రా సంఘాలను పక్కనపెట్టి టెండర్ విధానాన్ని తెరపైకి తెచ్చింది. మరోవైపు జిల్లాలో భారీ వర్షాలు కురవడంతో ఇసుక గతంలో లాగే అధిక మోతాదులో సమకూరింది. అయితే ఏర్పేడు మండలంలోని ముసిలిపేడు, నాగలాపురం, పిచ్చాటూరు మండలాల పరిధిలోని సురుటుపల్లె, ఎస్.బహుదూర్ పేట, చిత్తూరు మండలం ఆనగల్లు, జీడీనెల్లూరు మండలంలో నందనూరు, కలికిరి పరిధిలో గంగాపురం, మేడికుర్తి, పారాపట్ల, మహల్, గుండ్లూరు, చీకటిపల్లె, అడ్డావారిపల్లె తదితర 11 రీచ్‌లకు మాత్రమే మైనింగ్ అధికారులు వేలంపాటలు నిర్వహిస్తున్నారు. వారి అంచనా మేరకు ఈ రీచ్‌ల ద్వారా ప్రభుత్వానికి రూ.6,74,17,200 ఆదాయం రానుంది. అధికార పార్టీ నేతల ఒత్తిళ్ల మేరకే 52 రీచ్‌లను పక్కనపెట్టినట్టు తెలుస్తోంది.
అభివృద్ధి పేరుతో అరాచకం..
ఇక ఇరిగేషన్, పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ తదితర శాఖల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల కోసం 23 రీచ్‌లను కేటాయిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అయితే ప్రభుత్వశాఖల పేరుతో ఆ రీచ్‌లను సైతం అధికారపార్టీ నేతలు ఇప్పటికే స్వాధీనం చేసుకుని ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. వేలం పెట్టిన రీచ్‌ల్లో సైతం నేతలు యథేచ్ఛగా ఇసుకను తరలిస్తూనే ఉన్నారు. దీంతో వేరే ఎవ్వరూ వేలం పాటల్లో పాల్గొనే పరిస్థితి లేకుండా పోయింది. పైగా అధికార పార్టీ స్థానిక నేతలు కావడంతో వేలంలో రీచ్ దక్కించుకున్నా అక్రమ రవాణాను అడ్డుకునే పరిస్థితి ఉండదని మిగిలిన వారు మిన్నకుండిపోతున్నారు.
సామాన్యుడిపై భారం..
రీచ్‌లన్నీ అధికారపార్టీ నేతల స్వాధీనంలో ఉండడంతో వారు నిర్ణయించిన ధరకే ఇసుకను కొనాల్సి వస్తోంది. క్యూబిక్ మీటర్ ఇసుక రూ.500లకు మించి అమ్ముకూడదని అధికారులు చెబుతున్నా అధికారపార్టీ నేతలు రూ.1000 తక్కువ లేకుండా ఇసుక అమ్మకాలు సాగిస్తున్నారు. ఇది ప్రజలకు ముఖ్యంగా పేదలకు భారంగా మారింది.
ఇసుకాసురులు
Published Tue, Feb 9 2016 1:38 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM
Advertisement
Advertisement