కుప్పం బ్రాంచి కెనాల్ టెండర్లు తెరిచేదెన్నడో?
టెండర్ల దశలోనే వివాదం తెరుచుకోని ప్రైస్ బిడ్
బెడిసికొట్టిన బాబు రాజీ యత్నం
టీడీపీ నేతల మధ్య భగ్గుమన్న విభేదాలు
సంక్రాంతికి కుప్పానికి నీళ్లు తీసుకుపోవడం కష్టమే
తిరుపతి: కుప్పం బ్రాంచి కెనాల్ పనుల టెండర్ల వ్యవహారం టీడీపీ నేతల మధ్య విభేదాలకు దారితీస్తోంది. టెండర్లను గత నెల 28వ తేదీ తెరవాల్సి ఉన్నప్పటికీ వైఎస్‌ఆర్ జిల్లాకు చెందిన ఓ ఎంపీ, గత ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన అదే జిల్లాకు చెందిన మరో ముఖ్య నేత మధ్య పనుల పంపకాల్లో తేడాలు రావడంతో వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సైతం టెండర్ల విషయంలో ఎటూ తేల్చుకోలేక తలపట్టుకుంటున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది.
టెండర్లను ఇలా పిలిచారు..
గతనెల 8వ తేదీన కుప్పం బ్రాంచి కెనాల్ పనులకు సంబంధించి 413 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచా రు. ఆగస్టు 20వ తేదీ వరకు గడువు ఇచ్చారు. అదే నెల 28వ తేదీలోపు టెండర్లు తెరవాల్సి ఉన్నప్పటికీ టీడీపీ నాయకుల మధ్య వివాదం కారణంగా ఆగిపోయింది. టెక్నికల్ బిడ్ ఓపెన్ చేసి కాంట్రాక్టు సంస్థల అర్హతలకు సంబంధించి రాష్ర్టస్థాయి కమిటీకి నివేదించారు. ఈ కమిటీ కాంట్రాక్టు సంస్థలకు అర్హతలు ఉన్నాయో లేవో తేల్చకపోవడంతో ప్రైజ్ బిడ్ ఓపెన్ కాలేదు. ఈ టెండర్లలో రెండు జాయింట్ వెంచర్లు మాత్రమే పాల్గొనేలా చినబాబు మేనేజ్ చేసినట్టు సమాచారం. ఆర్‌కె ఇన్‌ఫ్రా, హెచ్‌ఈఎస్, కోయా కంపెనీలు జాయింట్ వెంచర్‌గా ఓ టెండర్, గాయిత్రి, డబ్ల్యుపీఐఎల్ ఓ వెంచర్‌గా ఇంకొక టెండర్ దాఖలయ్యాయి. టెండర్లకు ముందే దేశం నేతలకు పనుల విషయమై ఒప్పందం కుదిరింది. తాజాగా ఓ ఎంపీ కలుగజేసుకుని పనిలో సగం భాగం ఇవ్వాల్సిందేనని పట్టుబట్టినట్లు తెలుస్తోంది. టెండర్ ఓపెన్ చేయకూడదని అధికారులపై ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. దీంతో వారు ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది.
పనులు జరుగుతాయి ఇలా..
కుప్పం నియోజకవర్గంలో తాగు, సాగునీరు అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుప్పం బ్రాంచి కెనాల్ పనులకు శ్రీకారం చుట్టారు. 413 కోట్ల రూపాయల పనులను 9నెలల్లో పూర్తి చేసేలా గడువు విధించారు. పుంగనూరు-బ్రాంచి కెనాల్ 207 కిలోమీటర్ల నుంచి 140 కిలోమీటర్ల మేర కాలువ తవ్వనున్నారు. ఈ కాలువ పెద్దపంజాణి, గంగవరం, బెరైడ్డిపల్లె, వికోట, రామకుప్పం, శాంతిపురం, గుడిపల్లె, కుప్పం మండలాల మీదుగా వెళ్లనుంది.
తద్వారా మార్గమధ్యంలో 110 చెరువులు, 20 చిన్నకుంటలను నింపేలా డిజైన్ చేశారు. 6,300 ఎకరాల ఆయకట్టుకు నీరు అందనుంది. 4.5 లక్షల మంది జనాభాకు తాగునీరు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఆదిలోనే హంస పాదు అన్నట్లు టెండర్ల దశలోనే టీడీపీ నేతల మధ్య వివాదాలు తలెత్తడం టెండర్లలపై ప్రభావం చూపుతోంది. ఈ క్రమంలో సంకాంత్రికి కుప్పంకు నీళ్లు తీసుకొస్తామని సీఎం ఇచ్చిన హామీ నెరవేరడం కష్టంగానే కనిపిస్తోంది.