సమగ్ర రక్షిత మంచినీటి పథకాల ముసుగులో టీడీపీ నేతలు లబ్ధిపొందుతున్నారు. వారికి అధికారులు వత్తాసు పలుకుతున్నారు. రూ.13.31 కోట్ల నిర్వహణ పనుల్ని అధికార పార్టీ నాయకులు తమ గుప్పిట్లో ఉంచుకున్నారు. నిబంధనలు గాలికొదిలేసి అధికారులు చేష్టలుడిగి చూస్తున్నారు. జెడ్పీ సమావేశాల్లో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నా పట్టించుకోవడం లేదు. ఇదిగో అదిగో అంటూ దాటవేత ధోరణి కనబరుస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, విజయనగరం : జిల్లాలో 21 సమగ్ర రక్షిత మంచినీటి పథకాలున్నాయి. దాదాపు రూ.13.31కోట్ల మేర ఉన్న వీటి నిర్వహణ పనులను టెండర్ల ద్వారా ఎంపిక చేసిన కాంట్రాక్టర్‌కు అప్పగించాలి. రూ.10 లక్షల విలువ దాటితే ఈ ప్రొక్యూర్‌మెంట్ టెండర్లు పిలవాలి. రూ.10 లక్షల లోపైతే సాధారణ టెండర్లు పిలవాలి. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో పాత కాంట్రాక్టర్ల గడువు ముగిసింది. అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి ఆయా రక్షిత మంచినీటి పథకాల నిర్వహణ పనుల్ని నామినేటెడ్ ద్వారా దక్కించుకునేందుకు టీడీపీ నేతలు శతవిధాల ప్రయత్నాలు చేశారు. అప్పటికే ఉన్న కాంట్రాక్టర్లను తప్పుకోవాలని ఒత్తిడి చేశారు. అధికారులతో నానా ఇబ్బందులకు గురి చేశారు. దీంతో ఎందుకొచ్చిందని తప్పుకుని కొందరు కాంట్రాక్టర్లు టీడీపీ నేతలకు సరెండర్ అయిపోయారు. మరికొందరు మొండికేసి ససేమిరా అన్నారు.
మొత్తానికి పాత కాంట్రాక్టర్ల గడువు ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో ముగిసింది. ఏడాదికి గాను అధికారులు మళ్లీ టెండర్లు పిలవాల్సి ఉంది. దాదాపు పనులన్నీ రూ.10 లక్షల విలువ దాటి ఉండటంతో తప్పనిసరిగా ఈప్రొక్యూర్‌మెంట్‌లో పిలవాలి. అదే జరిగితే పోటీ పెరిగి తమకెక్కడ దక్కవనే ఉద్దేశంతో అధికారులపై టీడీపీ నేతలు ఒత్తిళ్లకు దిగారు. దీంతో వ్యూహాత్మకంగా సాధారణ టెండర్ల కిందకొచ్చేలా ఆ పనుల్ని నెలవారీ కింద విభజన చేసి, పని విలువను తక్కువగా చూపించారు. ఈ లెక్కన మార్చి వరకని సాధారణ టెండర్లు పిలిచారు. ఇంకేముంది మరొకరు పోటీకి రాకుండా చేసుకుని వ్యూహాత్మకంగా టీడీపీ నేతలు దక్కించుకున్నారు. మొత్తానికి వాటి గడువు మార్చితో ముగిసింది. మళ్లీ ఏడాదికి గాను కొత్తగా ఈ ప్రొక్యూర్‌మెంట్ టెండర్లు పిలవాల్సి ఉంది.
జెడ్పీ సమావేశంలో నిలదీసినా...
కానీ అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. నాన్చుడి ధోరణి అవలంభించారు. దీన్ని పసిగట్టిన బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు జెడ్పీ సమావేశంలో సంబంధిత అధికారుల్ని ప్రశ్నించారు. గడువు ముగిసినా టెండర్లెందుకు పిలవడం లేదని నిలదీశారు. దీంతో అధికారులు స్పందిస్తూ టెండర్లు పిలిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, త్వరలోనే కొత్త కాంట్రాక్టర్లను ఖరారు చేస్తామని హామీ ఇచ్చారు. అయితే, నేటికీ కొత్త టెండర్లు పిలవలేదు. ఒకటి, రెండు నెలలకని ఇచ్చిన టీడీపీ కాంట్రాక్టర్లనే ఎక్స్‌టెన్షన్ పేరుతో కొనసాగిస్తున్నారు. దాదాపు ఐదు నెలలు కావస్తున్నా పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఇదేంటని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారుల్ని అడిగితే టెండర్లు పిలిచేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ జెడ్పీ చైర్‌పర్సన్‌కు ఫైలు పెట్టానని, అనుమతి వచ్చాక పిలుస్తానంటూ చెప్పుకొస్తున్నారు. దీనిపై జెడ్పీ అధికారుల్ని అడిగితే టెండర్లు పిలవమని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులకిచ్చామని సమర్ధించుకుంటున్నారు. ఒకరిపైఒకరు వేసుకుని కాలయాపన చేసి పరోక్షంగా టీడీపీ నేతలకు లబ్ధి చేకూరుస్తున్నారు.
నిర్వహణ గాలికి...
నిర్వహణ పనులనైనా సవ్యంగా చేస్తున్నారంటే అదీ లేదు. ప్రజలకు రెగ్యులర్‌గా తాగునీరు సరఫరా చేయలేకపోతున్నారు. అధికారులు కూడా గట్టిగా అడగలేకపోతున్నారు. నిలదీస్తే నాయకులు ఏం చేస్తారనే భయంతో మిన్నకుండిపోతున్నారు. ఎవరేం చేయలేరని ఇష్టారీతిన కాంట్రాక్టర్లు వ్యవహరిస్తున్నారు. కాగా, ఈ విషయంలో విజిలెన్స్,క్వాలిటీ కంట్రోల్ అధికారులు అసంతృప్తితో ఉన్నారు. గొట్లాం, గోస్తనీ, రామతీర్థం, భోగాపురం మంచినీటి పథకాల నిర్వహణ సక్రమంగా లేదని ఆ మధ్య నివేదిక కూడా ఇచ్చారు.
అనుమతి రాగానే టెండర్లు పిలుస్తాం : ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ
టెండర్లు పిలిచేందుకు అనుమతి కోరుతూ జెడ్పీ చైర్‌పర్సన్‌కు ఫైలు పెట్టాం. అక్కడి నుంచి అనుమతి రాగానే కొత్తగా టెండర్లు పిలుస్తామని ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ గాయత్రీదేవి తెలిపారు. ఇప్పటికే అన్నీ ఏర్పాటు చేశామన్నారు. కొత్తగా టెండర్లు పిలవకపోవడం వల్ల పాత వారిని ఎక్స్‌టెన్షన్ కింద కొనసాగిస్తున్నట్టు చెప్పారు.
పథకం ప్రకారం...!
Published Tue, Aug 11 2015 1:30 AM | Last Updated on Tue, Oct 30 2018 5:17 PM
Advertisement
Advertisement