కాంట్రాక్టర్ల కంట్లో ఇసుక
► ఇసుక టెండర్లు రద్దు చేసిన సర్కారు
► దరఖాస్తుల సొమ్ము తిరిగి చెల్లించని వైనం
► అధికారులు, అధికార పార్టీ నేతల చుట్టూ కాంట్రాక్టర్ల ప్రదక్షిణలు
జిల్లాలో ఇసుక రీచ్‌ల టెండర్ల కోసం రాష్ర్ట ప్రభుత్వం కాంట్రాక్టర్ల నుంచి దరఖాస్తుల రూపంలో వసూలు చేసిన సుమారు రూ.2 కోట్ల ఊసే ఎత్తడం లేదు. టెండర్లు రద్దు చేసినందున తమ సొమ్ము తిరిగి ఇవ్వాలని కాంట్రాక్టర్లు భూగర్భ వనరుల శాఖ అధికారులు, అధికార పార్టీ నేతల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు.
సాక్షి ప్రతినిధి,నెల్లూరు: రాష్ర్టంలో ఇసుక రీచ్‌లను ప్రభుత్వం తొలుత మహిళా సంఘాలకు కట్టబెట్టింది. ఇసుక రీచ్‌ల ద్వారా వచ్చిన ఆదాయంలో సంఘాలకు వాటా ఇచ్చేలా విధాన నిర్ణయం తీసుకుంది. పేరు మహిళా సంఘాలదే అయినా ఇసుక రీచ్‌లను కాంట్రాక్టర్లే నిర్వహిస్తూ కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. జిల్లాలో కూడా ఇదే విధానం అమలవడంతో అధికార పార్టీకి చెందిన కాంట్రాక్టర్లు, నాయకులు ఇసుక ద్వారా కోట్ల రూపాయలు పిండుకున్నారు. దీంతో మహిళా సంఘాల నుంచి ఇసుక రీచ్‌లను రద్దు చేసి వేలం విధానంలో మళ్లీ కాంట్రాక్టర్లకు అప్పగించాలని ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా జిల్లాలోని 25 ఇసుక రీచ్‌లను 6 నెలల నుంచి ఏడాది పాటు లీజుకు ఇవ్వడానికి ఈ ఏడాది జనవరి 24న జిల్లా యంత్రాంగం నోటిఫికేషన్ జారీ చేసింది. ఫిబ్రవరి 6లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు పొంది 9లోగా దాఖలు చేయాలని గడువు నిర్ణయించింది.
పోటా పోటీగా దరఖాస్తుల దాఖలు
మహిళా సంఘాల పేరుతో అనధికారికంగా ఇసుక రీచ్‌లు నిర్వహించిన కాంట్రాక్టర్లతో పాటు పలువురు ఆశావహులు ఇసుక రీచ్‌ల టెండర్లు దక్కించుకోవడానికి పోటీ పడ్డారు. వేలం నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం ఎంఎస్‌టీసీ లిమిటెడ్ కంపెనీకి అప్పగించింది. ఆ కంపెనీకి ఎస్ బ్యాంక్‌లో ఖాతా ఉండటంతో కాంట్రాక్టర్లంతా ఎస్ బ్యాంకులో దరఖాస్తులకు సంబంధించిన రుసుం, ఈఎంఐ చె ల్లించాలని ఎంఎస్‌టీసీ షరతు విధించింది. ఇసుక రీచ్‌ల్లో గుర్తించిన ఇసుక పరిమాణం ఆధారంగా దరఖాస్తును రూ.25 వేల నుంచి రూ.లక్ష వరకు విక్రయించింది. ఈ లెక్కన జిల్లాలో సుమారు 50 మంది కాంట్రాక్టర్లు దరఖాస్తులు కొనుగోలు చేసి ఈఎంఐ చెల్లించారు. అయితే ప్రభుత్వం హఠాత్తుగా ఉచిత ఇసుక విధానం అమల్లోకి తేవాలని నిర్ణయం తీసుకుంది.
అప్పటికే నిర్వహించిన టెండర్లను రద్దు చేసింది. దీంతో జిల్లాలో కూడా టెండర్లు రద్దయ్యాయి. కాంట్రాక్టర్లు చెల్లించిన ఈఎంఐ మొత్తాన్ని ప్రభుత్వం వారి ఖాతాలకు జమ చేసింది. అయితే దరఖాస్తుల రూపంలో వసూలు చేసిన కోట్లాది రూపాయల విషయాన్ని పట్టించుకోలేదు. ఈ మొత్తం జిల్లాలో సుమారు రూ.2కోట్లు ఉండగా, రాష్ర్ట వ్యాప్తంగా సుమారు రూ.30 కోట్ల వరకు ఉంటుందని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. టెండర్లు రద్దు చేసినందున తాము దరఖాస్తుల కోసం చెల్లించిన మొత్తాన్ని కూడా వెనక్కు ఇప్పించాలని కాంట్రాక్టర్లు భూగర్భవనరుల అధికారులు, అధికార పార్టీ నేతలను కలిసి విన్నవించుకున్నారు.