ఇసుక లారీలను వెనక్కి పంపిన రైతులు
మంత్రి హరీష్‌రావు హామీ హుళక్కేనా..?
చిన్నమడూరు(దేవరుప్పుల) : ఓ వైపు కరవు తాండవిస్తుంటే ఫిల్టర్ బెడ్ ఏరియాలో ఇసుక తరలించేందుకు ఇసుకాసురులు చేస్తున్న ప్రయత్నాలను ఎదురిస్తూ అన్నదాతలు లారీలను తరిమికొట్టిన సంఘటన గురువారం చిన్నమడూరులో చోటుచేసుకుంది. మండలంలోని చౌడురు వాగు నడిబొడ్డు వాగులో ఇసుక తరలించేందుకు ఇసుక మాఫీయా రైతుల పట్టాదారులు మేటల పేరిట అనుమతులు పొందారు. ఈ విషయమై మూడు నెలల కిందట మైనింగ్ అధికారులు పరీశీలనకు రాగా రైతులు అడ్డుకున్నారు. ఇసుక తరలింపుపై పలు గ్రామాల రైతులు ఎమ్మెల్యే దయాకర్‌రావుకు మొర పెట్టుకోగా మండలంలో ఇసుక తరలింపుకు మద్దతు ఇచ్చే ప్రసక్తేలేదని బాహాటంగా చెప్పారు. ఈ విషయమై ఇటీవల దేవరుప్పులకు వచ్చిన మంత్రి హరీష్‌రావుకు పలువురు వ్యవసాయ కార్మిక సంఘాలు, రైతులు ఇసుక తరలిస్తే ఎడారిగా మారుతుందని వాపోయారు.
నిండు సభలో స్పందించిన మంత్రి, కలెక్టర్ కరుణతో మాట్లాడి ఇచ్చిన అనుమతులు రద్దు చేస్తూ కొత్తవాటికి ఉత్తర్వులు జారీ చేయకుండా ఆదేశాలు జారీ చేస్తామని ప్రకటించారు. కానీ ఇసుకాసురులు సెక్రటరీ స్థాయిలో జిల్లా అధికారులపై ఒత్తిడి తెచ్చి ఎలాగైనా వాగులో ఇసుకను తరలించాలని ప్రయత్నించడం గమనార్హం. ఈ నేపథ్యంలో గురువారం ఇసుక తీసుకెళ్లేందుకు వచ్చిన లారీలను స్థానిక రైతులు అడ్డుకున్నారు. వాగులో ఇసుక తరలింపు అనుమతులు రద్దు చేయకుంటే రైతుల పక్షాన ఆందోళన ఉధృతం చేస్తామని వ్యవసాయ కార్మిక సంఘ మండల కార్యదర్శి సింగారపు రమేష్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలు పార్టీల నాయకులు జోగేష్, భాషిపాక సోమయ్య, రచ్చ కృష్ణమూర్తి, ఇస్తారీ, యాదయ్య, అక్కనపెల్లి రాములు తదితరులు పాల్గొన్నారు.