తండాను చూసి రమ్మని ప్రధాని చెప్పారు: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
ముంపునకు గురైన పంట పొలాలు, ఇళ్లు పరిశీలన
తిరుమలాయపాలెం: ఆకేరు వరద బాధితులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉంటాయని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి హామీ ఇచ్చారు. సర్వం కోల్పోవడంతో ఇక్కడ ఉండలేమంటున్న ప్రజల ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి మరో ప్రాంతంలో ఆవాసాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. పాడైన భూములు మళ్లీ సాగులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆకేరు వరదతో ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం రాకాసితండాలో జరిగిన నష్టం ప్రధానమంత్రి నరేంద్రమోదీ దృష్టికి వచ్చిందని తెలిపారు.
స్వయంగా తండాను చూసి రావాల్సిందిగా ప్రధాని తనకు చెప్పారని వెల్లడించారు. ఆదివారం రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వ ర్‌రెడ్డితో కలిసి కిషన్‌రెడ్డి రాకాసి తండాను సందర్శించారు. ముంపునకు గురైన పంటపొలాలు, కొట్టుకుపోయిన ఇళ్లను పరిశీలించారు. తండా వాసులతో మాట్లాడి వారి బాధలు తెలుసుకున్నారు.
అక్వెడక్ట్‌తోనే గ్రామం నాశనం!
ఆకేరుపై నిర్మించిన సీతారామ ప్రాజెక్టు అక్వెడక్ట్‌తోనే తమ గ్రామం సర్వనాశనమైందని, పచ్చని పంటపొలాల్లో రాళ్లు, ఇసుక మేటలు వేశాయని స్థానికులు తెలిపారు. ఇక్కడ తాము ఉండే పరిస్థితి లేనందున మరోచోట స్థలాలు ఇచ్చి, ఇళ్లు కట్టించి ఆదుకోవాలని వేడుకున్నారు. ఇళ్లు, ఆస్తులు కోల్పోయి కట్టుబట్టలతో మిగిలిన తమకు దిక్కెవరంటూ మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి సమకూర్చిన గ్యాస్ స్టౌలు, రగ్గులను కిషన్‌రెడ్డి వారికి అందజేశారు.
జాతీయ విపత్తుగా ప్రకటించి ఆదుకోవాలి: మంత్రి పొంగులేటి
రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో అనేక జిల్లాలు జలమయమైనందున జాతీయ విపత్తుగా ప్రకటించి ఆదుకోవాలని రాష్ట్రమంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు. రాకాసి తండాలో జరిగిన నష్టాన్ని ఆయన కేంద్రమంత్రికి వివరించారు. కేంద్రమంత్రులు ముంపు ప్రాంతాల్లో పర్యటించడంపై కృతజ్ఞతలు తెలిపారు. నష్టాన్ని అంచనా వేసి నివేదిక అందించాల్సిందిగా ఇప్పటికే కిషన్‌రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్, అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్, అసిస్టెంట్ కలెక్టర్ మ్రినాల్ శ్రేష్ట తదితరులు పాల్గొన్నారు.
ఏపీ ప్రభుత్వం నివేదిక పంపలేదు: కిషన్‌రెడ్డి
ఖమ్మం వన్‌టౌన్: వరదలతో వాటిల్లిన నష్టంపై కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంకా ఎలాంటి నివేదిక పంపలేదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని వరద ముంపు ప్రాంతాల్లో ఆదివారం ఆయన పర్యటించారు. 16వ డివిజన్ ధంసలాపురంలో వరద బాధితులను పరామర్శించి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రానికి సాయం చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని అన్నారు. ఈ సమయంలో ఓ జర్నలిస్టు ఏపీ ప్రభుత్వం నివేదిక పంపిందా అని అడగ్గా.. పంపలేదని జవాబిచ్చారు. గతంలో ఉన్న ఎస్‌డీఆర్‌ఎఫ్ నిధులనే ప్రస్తుతం వాడుకుంటోందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment