కేంద్ర మంత్రి ఖట్టర్‌కు జ్ఞాపికను బహూకరిస్తున్న సీఎం రేవంత్. చిత్రంలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొంగులేటి తదితరులు
మెట్రో విస్తరణకు సహకరించండి.. ‘మూసీ’ ప్రాజెక్టుకు చేయూతనివ్వండి
విద్యుత్ అప్పులపై వడ్డీ రేట్లు తగ్గించండి
కేంద్రమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌కు సీఎం రేవంత్ విజ్ఞప్తి
పీఎంఏవై(యూ), పట్టణాభివృద్ధి, విద్యుత్‌పై ఖట్టర్ సమీక్ష
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి ఆవాస్ యోజన (అర్బన్) 2.0 కింద తెలంగాణకు 20 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్(Manohar Lal Khattar)కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth Reddy) విజ్ఞప్తి చేశారు. దేశ పట్టణ జనాభాలో 8% ప్రజలు తెలంగాణలో ఉన్నందున అర్బన్ యూనిట్లను ఎక్కువగా ఇవ్వాలని కోరారు. పీఎంఏవై (యూ), పట్టణాభివృద్ధి, విద్యుత్తు శాఖలపై మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ శుక్రవారం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకం గురించి సీఎం రేవంత్‌రెడ్డి వివరించారు. పీఎంఏవై 2.0లో చేరిన తొలి రాష్ట్రమైన తెలంగాణ.. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన డేటా, పూర్తి ప్రణాళికతో సిద్ధంగా ఉన్నందున 20 లక్షల ఇళ్లు కేటాయించాలని కోరారు.
మెట్రో విస్తరణకు సహకరించండి
హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు విస్తరణకు సహకరించాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు. ప్రతిపాదిత మెట్రో విస్తరణ ప్రణాళికను కేంద్రమంత్రి ముందుంచారు. నాగోల్–శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం (36.8 కి.మీ.), రాయదుర్గం–కోకాపేట నియోపోలిస్ (11.6 కి.మీ.), ఎంజీబీఎస్–చాంద్రాయణగుట్ట (7.5 కి.మీ.), మియాపూర్–పటాన్‌చెరు (13.4 కి.మీ.), ఎల్‌బీ నగర్–హయత్‌నగర్ (7.1 కి.మీ), అంతర్జాతీయ విమానాశ్రయం–ఫోర్త్ సిటీ (స్కిల్ యూనివర్సిటీ–40 కి.మీ.) వరకు మెట్రో విస్తరణను ప్రతిపాదించామని తెలిపారు. ఇందులో మొదటి 5 కారిడార్ల (76.4 కి.మీ.) డీపీఆర్‌లు పూర్తయ్యాయని వెల్లడించారు. ఈ కారిడార్ల నిర్మాణానికి రూ.24,269 కోట్లు వ్యయమవుతుందని చెప్పారు. డీపీఆర్‌లను ఆమోదించి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్త భాగస్వామ్యం (జేవీ) కింద నిధులు కేటాయించాలని కోరారు.
మూసీ ప్రక్షాళనకు చేయూతనివ్వండి
మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్‌కు చేయూతనివ్వాలని మనోహర్‌లాల్ ఖట్టర్‌కు సీఎం విజ్ఞప్తి చేశారు. మూసీలో మురుగు చేరకుండా నదికి ఇరువైపులా 55 కిలోమీటర్ల కాల్వలు, బాక్స్ డ్రెయిన్లు, ఎస్టీపీల నిర్మాణానికి రూ.10 వేల కోట్లు కేటాయించాలని కోరారు. హైదరాబాద్‌తోపాటు సమీపంలోని 27 పురపాలక సంస్థల పరిధిలో మురుగు నీటి నెట్‌వర్క్ నిర్మాణానికి రూ.17,212 కోట్ల వ్యయ అంచనాతో సమగ్ర ప్లాన్ తయారు చేశామని వివరించారు. వరంగల్ నగరంలో రూ.4,170 కోట్లతో సమగ్ర భూగర్భ నీటి పారుదల (యూజీడీ) పథకాన్ని చేపట్టేందుకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. పీఎం కుసుమ్ కింద లక్ష సౌర పంపులు, కుసుమ్ –సీ ఎఫ్‌ఎల్‌ఎస్ కాంపొనెంట్ కింద 2,500 మెగావాట్లు కేటాయించాలని కోరారు.
విద్యుత్ రుణాలపై వడ్డీ రేటు తగ్గించండి
విద్యుత్ సరఫరా, నెట్‌వర్క్ బలోపేతానికి రూ.488 కోట్ల అంచనా వ్యయంతో 9 ప్రాజెక్టు నివేదికలను కేంద్రానికి సమరి్పంచామని, వాటిని వెంటనే మంజూరు చేయాలని కేంద్రమంత్రిని సీఎం కోరారు. రివాంప్డ్ డి్రస్టిబ్యూషన్ సెక్టార్ స్కీం (ఆర్డీఎస్‌ఎస్)లో తెలంగాణ డిస్కమ్‌లను చేర్చాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విద్యుత్ సంస్థలకు విద్యుత్ ఫైనాన్స్ కార్పొరేషన్, గ్రామీణ విద్యుదీకరణ కార్పొరేషన్ ఇచ్చిన రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించాలని కోరారు. ఆర్‌పీపీవో లక్ష్యాలను చేరుకోలేకపోయినందుకు విధించే జరిమానాలు మాఫీ చేయాలని విన్నవించారు. పునరుత్పాదక విద్యుత్ నిర్వహణ కేంద్రాల అప్‌గ్రెడేషన్‌కు నిధులు కేటాయించాలని కోరారు.
సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, ప్రభుత్వ సలహాదారులు హర్కర వేణుగోపాల్, శ్రీనివాస రాజు, సీఎస్ శాంతి కుమారి తదితరులు పాల్గొన్నారు.
పెట్టుబడులపై సీఎంకు ఖట్టర్ అభినందనలు..
తెలంగాణ రాష్ట్రానికి రూ.1.78 లక్షల కోట్లు పెట్టుబడులు సాధించినందుకు సీఎంను కేంద్ర మంత్రి ఖట్టర్ అభినందించారు. ప్రధానమంత్రి మోదీ దేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా నిలపాలని భావిస్తున్నారని, అందులో తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా నిలపాలని తాము లక్ష్యంగా పెట్టుకున్నామని సీఎం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment