మూసీపై మూడు నెలల పోరాటం! | BJP is preparing for long protests against Musi project | Sakshi
Sakshi News home page

మూసీపై మూడు నెలల పోరాటం!

Published Sun, Nov 17 2024 4:43 AM | Last Updated on Sun, Nov 17 2024 4:43 AM

BJP is preparing for long protests against Musi project

సుదీర్ఘ నిరసనలకు సిద్ధమవుతున్న బీజేపీ 

‘మూసీ నిద్ర’ కార్యక్రమాన్ని పొడిగించే యోచన 

కాంగ్రెస్‌ విమర్శలతో వ్యూహం మార్చాలని నిర్ణయం 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో పేదలను బాధితులుగా చేయవద్దన్న డిమాండ్‌తో ‘మూసీ నిద్ర’కార్యక్రమాన్ని చేపట్టిన బీజేపీ.. ఈ పోరాటాన్ని ఒక్కరోజులోనే ముగించాలని భావించటంలేదు. మూసీ నిద్ర కార్యక్రమంపై కాంగ్రెస్‌ నేతలు విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో ఈ పోరాటాన్ని నెలపాటు లేదంటే మూడు నెలల వరకు కూడా కొనసాగించాలని బీజేపీ రాష్ట్ర నేతలు నిర్ణయించినట్లు తెలిసింది. 

మూసీ సమీపంలో మూడు నెలలు నివసించాల ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా గతంలో సవాల్‌ చేసిన నేపథ్యంలో బీజేపీ ఈ నిర్ణయం తీసుకొన్నట్లు సమాచారం. మూసీ నది ప్రవహించే మూడు లోక్‌సభ నియోజకవర్గాల్లోని 8 అసెంబ్లీ స్థానాల్లో 20 చోట్ల బీజేపీ నేతలు శనివారం సాయంత్రం నుంచి ఆదివారం ఉదయం వరకు మూసీ నిద్ర కార్యక్రమాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే.  

ప్రక్షాళన చేయండి.. ఇళ్లు మాత్రం కూల్చొద్దు 
ప్రభుత్వపరంగా మూసీ పునరుజ్జీవం, ప్రక్షాళన వంటి ఏ కార్యక్రమం చేపట్టినా పేదల ఇళ్లు కూల గొట్టకుండా చేయాలనే ప్రధాన డిమాండ్‌తో బీజేపీ ముందుకు సాగుతోంది. ఇంకా సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) కూడా సిద్ధం కాకముందే పేదల ఇళ్ల కూల్చివేత ఎందుకని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది. తాము చేపట్టే ఆందోళనలు, నిరసన కార్యక్రమాలపై ప్రభుత్వం స్పందించే తీరును బట్టి ‘మూసీ ప్రక్షాళన చేయండి.. కానీ పేదల ఇళ్లు కూలగొట్టకండి’అనే నినాదంతో దీర్ఘకాల పోరాటం చేసేందుకు ప్రణాళికలు వేస్తున్నట్లు సమాచారం. 

ప్రజలకు ఆమోదయోగ్యమైన ప్రత్యామ్నాయాలు చూపకుండా వారి నివాసాలను ఎలా కూల్చుతారని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రాజెక్టుపై మున్ముందు ప్రభుత్వం తీసుకొనే చర్యలను బట్టి పోరాట విధానాన్ని నిర్ణయించనున్నట్లు చెబుతున్నారు. నిజానికి శనివారం చేపట్టిన మూసీ నిద్ర కార్యక్రమాన్ని ఒకరోజుకే పరిమితం చేయాలని బీజేపీ నాయకత్వం భావించింది. కానీ, ఈ కార్యక్రమంపై మంత్రులు, అధికార కాంగ్రెస్‌పార్టీ నేతలు విమర్శలు గుప్పించా రు. ‘మూసీ కంపులో 3 నెలలు ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి సవాల్‌ విసిరితే కిషన్‌రెడ్డి, ఇతర బీజేపీ నేతలు ఒకరోజు షో చేస్తున్నారు. 

ఒక్కరాత్రి నిద్రతో ఏం సాధిస్తారు’అని ప్రశ్నించారు. దీంతో బీజేపీ నే తలు వ్యూహం మార్చాలని నిర్ణయించినట్లు సమాచారం. ప్రజల ఇళ్లు కూలగొట్టే బదులు మూసీలోకి మురుగునీరు చేరకుండా కట్టడి చేస్తే సరిపోతుంది కదా అని ప్రశ్నిస్తున్నారు. నదికి రెండువైపులా భారీ రిటైనింగ్‌ వాల్‌ నిర్మిస్తే భారీ వరదల నుంచి కూడా ప్రజలను కాపాడవచ్చని, ఆ పనులు చేయకుండా 30– 40 ఏళ్లుగా అక్కడ నివసిస్తున్న పేదల ఇళ్లను కూల్చివేయటం ఎందుకని ప్రశ్నిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement