సీఎం రేవంత్‌రెడ్డి సవాల్‌ను స్వీకరించిన హరీశ్‌రావు
నేటి ఉదయం 9 గంటలకు స్వయంగా మీ ఇంటికి వస్తా
మూసీ, ప్రాజెక్టుల నిర్వాసితుల వద్దకు వెళ్లేందుకు సిద్ధం
ఫోర్త్ సిటీ పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం
సాక్షి, హైదరాబాద్: ‘రేవంత్.. నేను చాలెంజ్ చేస్తున్నా. సెక్యూరిటీ లేకుండా వస్తా అన్నావు కదా. పోదాం పదా..డేట్, టైమ్ మీరే చెప్పండి. నేను కారు డ్రైవ్ చేస్తా. మీరు నేను పోదాం. లేదంటే నేను రేపు 9 గంటలకు మీ ఇంటికి వస్తా. ముందు మూసీ బాధితులను కలిసిన తర్వాత మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్, రంగనాయకసాగర్ కట్ట మీదకు వెళ్లి నిర్వాసితులతో మాట్లాడుదాం. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. 2013 చట్టానికి మించిన ప్రయోజనాలు మల్లన్నసాగర్ నిర్వాసితులకు ఇచ్చాం ’అంటూ సీఎం రేవంత్‌రెడ్డి గురువారం చేసిన సవాల్‌పై మాజీమంత్రి టి.హరీశ్‌రావు ఘాటుగా స్పందించారు.
‘మూసీ ఫ్రంట్ పేరిట రూ.లక్షన్నర కోట్లతో సుందరీకరణ, పునరుజ్జీవం చేస్తామని ప్రజల మధ్య ప్రకటించిన సీఎం రేవంత్ అలా ఎవరు అన్నారంటూ మాట మారుస్తున్నాడు. మెగాస్టార్లు సూపర్‌స్టార్లను మించి నటిస్తున్నాడు. శత్రుదేశాల మీద దాడి చేసినట్టుగా పేదల ఇళ్లపై జరుగుతున్న కూల్చివేతలను ప్రశ్నిస్తే మల్లన్నసాగర్ నిర్వాసితుల గురించి మాట్లాడుతున్నాడు’అని చెప్పారు. తెలంగాణభవన్‌లో మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్‌గౌడ్, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, నాయకులు పి.కార్తీక్‌రెడ్డి, దేవీప్రసాద్‌తో కలిసి హరీశ్‌రావు శుక్రవారం మీడియాతో మాట్లాడారు.
సీఎం పదవిని దిగజార్చేలా..
‘ఎన్నికల హామీలను విస్మరించి సీఎం పదవి స్థాయిని దిగజార్చేలా రేవంత్ మాట్లాడుతున్నారు. హైదరాబాద్‌తోపాటు అనేక నగరాల మీదుగా అనేక నదులు ప్రవహిస్తున్నాయనే జ్ఞానం లేదు. మల్లన్నసాగర్ నిర్వాసితులకు 4వేల ఇళ్లు ఇవ్వడంతోపాటు 2013 భూసేకరణ చట్టంలో పేర్కొన్న పరిహారం కంటే ఎక్కువే ఇచ్చాం. (పునరావాసకాలనీ ఫొటో చూపిస్తూ).. మూసీ తలంలో ఉన్న ఇళ్లు కూల్చి బాధితులకు పరిహారం ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తోంది. డీపీఆర్, పర్యావరణ అనుమతులు లేకుండానే ప్రాజెక్టు పేరిట ఇల్లు కూల్చే అధికారం లేదు. నదితలంలో ఉన్న నిర్వాసితులకు కూడా 2013 భూ సేకరణ చట్టాన్ని వర్తింపచేయాలి.
ఏఐ టెక్నాలజీ వీడియోలతో స్టంట్లు
మూసీ రివర్‌ఫ్రంట్ పేరిట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో తయారు చేసిన వీడియోలు చూపుతూ రేవంత్ స్టంట్లు చేస్తున్నాడు. బీఆర్‌ఎస్ పాలనలో 31 ఎస్‌టీపీలతో మూసీ పునరుజ్జీవంకు ప్రయత్నాలు చేశాం. కొండపోచమ్మ సాగర్ నుంచి గోదావరి జలాలను మూసీకి తరలించేలా వ్యాప్కోస్ సంస్థ డీపీఆర్ కూడా ఇచి్చంది. కానీ మల్లన్నసాగర్‌కు ప్లాన్ మార్చి కాంట్రాక్టర్లకు రూ.4వేలు లాభం చేసేలా రేవంత్ కుట్ర పన్నాడు. ఫార్మాసిటీ కోసం సేకరించిన 13 వేల ఎకరాల భూమిలో ఫోర్త్‌సిటీ పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని అనుకుంటున్నాడు. ఫార్మాసిటీతో కాలుష్యాన్ని తగ్గించి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచడంతోపాటు మూసీ పునరుజ్జీవం కూడా సాధ్యమవుతుంది. సబర్మతి నది తరహాలో గైడ్‌వాల్ నిర్మించి వరదలు నివారించొచ్చు.
అఖిలపక్ష భేటీకి పిలవలేదు
‘నేను ఉద్యమకారుడిని, ప్రజల కోసం పోరాడేవాడిని. పదివేల కుటుంబాల్లో సంతోషం చూసేందుకు మూసీలో ఉండడానికి నేను సిద్ధం. 15 రోజుల క్రితమే మూసీ ప్రక్షాళనపై అఖిలపక్ష సమావేశం పెట్టాలని డిమాండ్ చేసినా స్పందన లేదు. నాకు ఎమ్మెల్యే పదవి లేకుండానే నాటి కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి పదవి ఇచ్చిందని రేవంత్ చేసిన ఆరోపణ అర్థరహితం. నేను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు నా శిష్యుడిగా కారు ముందు డ్యాన్స్ చేసిండు. మంత్రి పదవికి రాజీనామా చేసి గన్‌పార్కు వద్ద మీడియాతో మాట్లాడుతున్నప్పుడు నా వెనక ఉండి నక్కి చూసిండు’అని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment