
రూ. 25 వేల కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టుకు రూ. లక్షన్నర కోట్లు ఎందుకు?
గతంలోనే రూ.16 వేల కోట్లతో మూసీ పునరుజ్జీవ ప్రణాళికలు
కేసులకు భయపడే దామగుండంలో రాడార్ స్టేషన్‌కు అనుమతి
‘మూసీ’పై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు అంచనా వ్యయంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గజినీలా మారి పచ్చి అబద్ధాలు చెబుతున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. మూసీ సుందరీకరణ పేరిట రూ. లక్షన్నర కోట్ల ప్రజాధనం దోపిడీ ప్రయత్నాన్ని తెలంగాణ సమాజం అర్థం చేసుకోవడంతో తప్పులను కప్పిపుచ్చుకునేందుకు సీఎం తంటాలు పడుతున్నాడన్నారు. కాంగ్రెస్‌కు తెలంగాణ ఏటీఎంలా మారిందని, రాహుల్‌గాం«దీకి డబ్బు కావాల్సినప్పుడల్లా తెలంగాణ గుర్తుకు వస్తోందన్నారు. ప్రాజెక్టు అంచనాలను రెట్టింపు చేయడంలో దిట్ట అయినందునే నిషేధిత కంపెనీ మెయిన్‌హార్ట్‌కు మూసీ డిజైన్ బాధ్యతలు అప్పగించారని చెప్పారు.
మూసీ పునరుజ్జీవానికి తాము వ్యతిరేకం కాదని, వేలాది మందిని నిరాశ్రయులను చేయడానికి అంగీకరించబోమన్నారు. గరిష్టంగా రూ.25వేల కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టుకు పేదల కడుపు కొట్టి వేల కోట్ల రూపాయలు దోచుకునేలా రూ.లక్షన్నర కోట్లు వెచ్చిస్తే తాము వ్యతిరేకిస్తామని చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, పార్టీ నేతల సమక్షంలో శుక్రవారం తెలంగాణభవన్ వేదికగా ‘మూసీ ప్రాజెక్టు’పై గంటకు పైగా కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పూర్తి వివరాలు కేటీఆర్ మాటల్లోనే...‘మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుపైనా పునరుజ్జీవం, సుందరీకరణ, ప్రక్షాళన, నల్లగొండకు శుద్ధమైన నీరు అంటూ సీఎం రేవంత్ పూటకో మాట చెబుతున్నాడు.
రెండు వేల కిలోమీటర్ల పొడవైన నమామి గంగే ప్రాజెక్టుకు రూ.40వేల కోట్లు ఖర్చయింది. 56 కిలోమీటర్ల పొడవైన మూసీ ప్రాజెక్టుకు కిలోమీటరుకు రూ.2700 ఖర్చు చేస్తామని సీఎం చెబుతున్నాడు. ప్రపంచంలో ఇంతకంటే పెద్ద కుంభకోణం మరొకటి ఉండదు. తనపై ఉన్న కేసులకు భయపడి వికారాబాద్ అడవుల్లో నేవీ రాడార్ నిర్మాణానికి రేవంత్ అనుమతి ఇచ్చారు. గతంలో మోదీ ప్రభుత్వం మెడమీద కత్తి పెట్టినా పర్యావరణ వేత్తలతో సూచనతో దామగుండం భూ అప్పగింత జీఓను అమలు చేయలేదు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ ద్వారా మూసీ ప్రక్షాళన, సుందరీకరణ, పునరుజ్జీవం కోసం రూ.16వేల కోట్లతో పేదలను నిరాశ్రయులను చేయకుండా 9 ప్రపంచ స్థాయి కన్సల్టెంట్లతో ప్రణాళికలు సిద్ధం చేశాం. మేము చేసిన పనులు చూపేందుకు శనివారం సిటీ ఎమ్మెల్యేలతో కలిసి నాగోల్‌కు వెళతాం. 31 ఎస్‌టీపీలు పూర్తయితే నల్లగొండకు స్వచ్ఛమైన నీరు వెళ్తుందనే విషయాన్ని గావుకేకలు, పెడ»ొబ్బలు పెడుతున్న నల్లగొండ మంత్రులు తెలుసుకోవాలి.

గూగుల్ ఫొటోలతో ప్రజెంటేషన్
గూగుల్ నుంచి కాపీ కొట్టిన ఫొటోలతో రూ.లక్షన్నర కోట్ల ప్రాజెక్టు అంటూ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఎన్నికల అఫిడవిట్‌లో రూ.30 కోట్లు ఆస్తులు చూపించిన రేవంత్ డిజైన్లు వద్దంటే కన్సల్టెంట్లకు రూ.140 కోట్లు ఆస్తులు అమ్మి ఇస్తా అంటున్నాడు. నోటికొచ్చింది వాగి దొరికిపోవడం సీఎంకు అలవాటు. మూసీ ఒడ్డున బహుళ అంతస్తుల భవనాలు వస్తే మళ్లీ ఫోర్త్ సిటీ ఎందుకు.
రీజువెనేషన్ స్పెల్లింగ్‌ను చూడకుండా రాస్తే ఆయనకు రూ.50 లక్షలు పట్టే బ్యాగ్‌ను బహుమానంగా ఇస్తా. మాపై అనేక ఆరోపణలు చేసిన సీఎం ఎందుకు విచారణ జరపించడం లేదు. మూసీ సహా అన్ని అంశాలపై అసెంబ్లీలో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నా, మూక మాదిరిగా అధికార పక్షం మా గొంతు నొక్కుతోంది. ముఖ్యమంత్రి మానసిక పరిస్థితి మీద అనుమానం ఉంది. ఆయన్ను ఆ విధంగా వదిలిపెట్టవద్దని వారి కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి’అని కేటీఆర్ తన ప్రజెంటేషన్ ముగించారు.
Comments
Please login to add a commentAdd a comment