సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్‌లో ఉమ్మడి ప్రాజెక్టులైన నాగార్జునసాగర్, శ్రీశైలం రిజర్వాయర్లలో లభ్యత నీటిని బోర్డు శనివారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు పంపిణీ చేసింది. ఈ రెండు ప్రాజెక్టుల్లో కలిపి ప్రస్తుతమున్న 330 టీఎంసీలలో... ఏపీకి 217.8 టీఎంసీలు (66 శాతం), తెలంగాణకు 112.2 టీఎంసీలు (34 శాతం) కేటాయించింది.
సుదీర్ఘంగా భేటీ
ఇరు రాష్ట్రాల తాగు, సాగునీటి అవసరాలపై చర్చించేందుకు శనివారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని జలసౌధలో కృష్ణా బోర్డు సమావేశం నిర్వహించింది. నాలుగున్నర గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో.. బోర్డు చైర్మన్ శ్రీవాత్సవ, రాష్ట్ర స్పెషల్ సీఎస్ ఎస్‌కే జోషి, ఏపీ జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఇరు రాష్ట్రాల ఈఎన్‌సీలు మురళీధర్, వెంకటేశ్వర్‌రావు, సాగర్ సీఈ సునీల్, బోర్డు సభ్య కార్యదర్శి పరమేశం, అంతర్రాష్ట్ర జల వ్యవహారాల చీఫ్ ఇంజనీర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాలు తమ నీటి అవసరాలను బోర్డు ముందుంచాయి. తెలంగాణ 138.5 టీఎంసీలు ఇవ్వాలని కోరగా.. ఏపీ 270 టీఎంసీలు కేటాయించాలని విన్నవించింది.
చిన్న నీటి వనరులపై రగడ
భేటీ సందర్భంగా చిన్న నీటి వనరుల అంశాన్ని ఏపీ మరోసారి లేవనెత్తింది. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం తెలంగాణకు చిన్ననీటి వనరుల కోసం 89.11 టీఎంసీల కేటాయింపు ఉందని.. దాన్ని పరిగణనలోకి తీసుకుని 70:30 నిష్పత్తిన నీటిని పంపిణీ చేయాలని కోరింది. దీనిపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో చిన్న నీటి వనరుల కింద 13 టీఎంసీలకు మించి వినియోగం లేదని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య వాగ్వాదం జరిగింది. చివరికి బోర్డు కల్పించుకుని.. ఇరు రాష్ట్రాల అధికారులను సముదాయించింది. ఈ ఏడాది తెలంగాణ చెబుతున్న వినియోగ లెక్కలనే పరిగణనలోకి తీసుకుంటూ.. 66:34 నిష్పత్తిన నీటిని పంచుతామని స్పష్టం చేసింది. దీనికి ఇరు రాష్ట్రాలు అంగీకరించాయి. ఇక చిన్ననీటి వనరుల లెక్కల వాస్తవ వినియోగాన్ని తేల్చేందుకు నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ (ఎన్‌ఆర్‌ఎస్‌ఏ) సహాయాన్ని తీసుకోవాలని భేటీలో నిర్ణయించారు.
పట్టిసీమపై నిపుణుల కమిటీ
గోదావరి నుంచి నీటిని మళ్లిస్తూ ఏపీ చేపట్టిన పట్టిసీమ అంశాన్ని తెలంగాణ మరోమారు ప్రస్తావించింది. గతేడాది పట్టిసీమ కింద 53 టీఎంసీల వినియోగం జరిగిందని, ఈసారి అదే రీతిన వినియోగం జరుగుతోందని బోర్డు దృష్టికి తెచ్చింది. పట్టిసీమతో ఎగువ రాష్ట్రమైన తెలంగాణకు దక్కే 45 టీఎంసీల వాటాపై తేల్చాలని పట్టుబట్టింది. అయితే ఈ అంశంపై తేల్చే అధికారం బోర్డుకు లేదని, కృష్ణా నదీ వివాదాల పరిష్కార ట్రిబ్యునల్–2 మాత్రమే తేల్చగలదని చైర్మన్ శ్రీవాత్సవ స్పష్టం చేశారు. అయితే అప్పటివరకు తాత్కాలికంగా ఈ అంశాన్ని తేల్చేందుకు నిపుణుల కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. ఇక శ్రీశైలం కింద ఏపీ నీటి వినియోగానికి, చెబుతున్న లెక్కలకు పొంతన లేదని.. శ్రీశైలం నుంచి విడుదలవుతున్న నీటికి, సాగర్‌కు చేరుతున్న జలాలకు మధ్య వ్యత్యాసం భారీగా ఉందని తెలంగాణ స్పష్టం చేసింది. సాధారణంగా నీటి నష్టాలు 7 నుంచి 10 శాతం మాత్రమే ఉంటాయని.. కానీ ఇక్కడ 30 నుంచి 40 శాతంగా కనబడుతున్నాయని పేర్కొంది. దీనిపై బోర్డు స్పందిస్తూ.. నీటి నష్టాలపై లోతుగా అధ్యయనం చేయాల్సి ఉందని, దీనిపై ఇరు రాష్ట్రాలు, బోర్డు అధికారులతో సబ్‌కమిటీ ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు.
వర్కింగ్ మాన్యువల్‌పై భిన్నాభిప్రాయాలు
కృష్ణా బోర్డు వర్కింగ్ మాన్యువల్ అంశంపై ఇరు రాష్ట్రాల మధ్య భిన్నాభిప్రాయాలు వచ్చాయి. తాము సూచిస్తున్న పలు అంశాలను పరిగణనలోకి తీసుకుని తుది వర్కింగ్ మాన్యువల్ రూపొందించాలని తెలంగాణ పట్టుబట్టింది. ప్రాజెక్టుల వారీ కేటాయింపులు లేకుండా ప్రాజెక్టుల నియంత్రణ వద్దని.. పులిచింతలను ఉమ్మడి ప్రాజెక్టుల జాబితాలో చేర్చాలని డిమాండ్ చేసింది. దీనిపై ఏకాభిప్రాయం కుదరలేదు. ఇక టెలిమెట్రీ ఏర్పాటు మొదటి విడత ఇప్పటికే అమల్లో ఉందని.. రెండో విడత పరికరాల ఏర్పాటు త్వరితగతిన ముగిసేలా చర్యలు తీసుకోవాలని ఇరు రాష్ట్రాలు నిర్ణయించాయి.
మాకు పక్షపాతమేం లేదు..
కృష్ణా బోర్డు భేటీ అనంతరం బోర్డు చైర్మన్ శ్రీవాత్సవ మీడియాతో మాట్లాడారు. ఇరు రాష్ట్రాలకు కృష్ణా నీటి కేటాయింపులపై చర్చలు జరిపామని, 66 శాతం నీటిని ఆంధ్రప్రదేశ్, 34 శాతం నీటిని తెలంగాణ వినియోగించుకుంటాయని చెప్పారు. పోతిరెడ్డిపాడు వద్ద టెలిమెట్రీలో అవకతవకలు, ట్యాంపరింగ్ జరగలేదని.. అది అవగాహనా రాహిత్యమని పేర్కొన్నారు. తాము పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నామనడం సరికాదని.. నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ, నీటి లభ్యతను బట్టి ఇరు రాష్ట్రాలకు కేటాయింపులు చేస్తున్నామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment