సాక్షి, అమరావతి/పగిడ్యాల/జూపాడు బంగ్లా: రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు చేపట్టడానికి అవసరమైన సన్నాహకాలను మాత్రమే తాము చేస్తున్నట్టు కృష్ణా బోర్డు కమిటీకి బుధవారం రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు స్పష్టం చేశారు. శ్రీశైలం ప్రాజెక్టులో 800 అడుగుల స్థాయి నుంచే సాగునీటి ప్రాజెక్టులు, ఎడమ గట్టు విద్యుత్కేంద్రం ద్వారా రోజుకు 6.9 టీఎంసీలను తెలంగాణ సర్కార్ తరలిస్తుండటం వల్ల ప్రాజెక్టులో నీటిమట్టం తగ్గిపోతోందని తెలిపారు.
కృష్ణా బోర్డు నీటి కేటాయింపులు ఉన్నా సరే.. తెలంగాణ చర్యలతో శ్రీశైలంలో నీటిమట్టం 854 అడుగుల కంటే దిగువకు పడిపోవడం వల్ల పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా తీవ్ర దుర్భిక్ష ప్రాంతాలైన కర్నూలు, వైఎస్సార్, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు తెలుగుగంగ, గాలేరు–నగరి, ఎస్సార్బీసీ, కేసీ కెనాల్ ద్వారా నీటిని అందించలేని దుస్థితి నెలకొందన్నారు. అలాగే చెన్నైకి తాగునీటిని సరఫరా చేయలేని దుస్థితి ఏర్పడిందన్నారు. ఈ నేపథ్యంలో తమ వాటా నీటిని వినియోగించుకుని ఆయా ప్రాంతాలకు తాగు, సాగునీరు అందించడానికే రాయలసీమ ఎత్తిపోతల పథకం తలపెట్టామన్నారు.
జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) దక్షిణ మండల బెంచ్–చెన్నై ఆదేశాల మేరకు బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే అధ్యక్షతన.. ఎల్బీ మూయన్‌తంగ్, కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) డైరెక్టర్ దర్పన్ తల్వార్ సభ్యులుగా కృష్ణా బోర్డు ఏర్పాటు చేసిన కమిటీ బుధవారం కర్నూలు జిల్లాలో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించింది. ఈ సందర్భంగా రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) అభ్యంతరం వ్యక్తం చేసిన అలైన్‌మెంట్‌ను రద్దు చేశామని బోర్డు కమిటీకి తెలిపారు. పర్యావరణపరంగా సమస్యలు రాని కొత్త అలైన్‌మెంట్ ప్రకారం సీమ ఎత్తిపోతల పథకానికి సన్నాహకాలు చేపట్టామన్నారు. ఈ ఏడాది శ్రీశైలంలో నీటిమట్టం కనీస స్థాయి కంటే దిగువన ఉన్నప్పుడే తెలంగాణ సర్కార్ కృష్ణా బోర్డు ఆదేశాలను తుంగలో తొక్కి ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తిని నిరంతరాయంగా కొనసాగించిందన్నారు. ఒకానొక దశలో శ్రీశైలం ప్రాజెక్టును ఆ రాష్ట్ర ప్రభుత్వం ఖాళీ చేసిందని గుర్తు చేశారు.
ఈ అంశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ల దృష్టికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకెళ్లారని వివరించారు. ఏపీ హక్కులను తెలంగాణ సర్కార్ కాలరాస్తుండటంతో.. తమ హక్కులను పరిరక్షించుకోవడానికే తమ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిందని తెలిపారు. రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు వివరించిన అంశాలు.. క్షేత్ర స్థాయి పరిశీలనలో వెల్లడైన అంశాల ఆధారంగా ఈ నెల 16న ఎన్జీటీకి నివేదిక ఇస్తామని కమిటీ చైర్మన్ డీఎం రాయ్‌పురే చెప్పారు.
పర్యావరణ సమస్యలకు ఆస్కారం లేదు..
పర్యావరణ సమస్యలకు ఆస్కారం లేకుండా సంగమేశ్వరం నుంచి భవనాశి నది ప్రవాహమార్గంలోనే పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ వరకూ 8 కి.మీల పొడవునా అప్రోచ్ చానల్ తవ్వి... అక్కడ పంప్ హౌస్ నిర్మించి.. నీటిని ఎత్తిపోసి.. 500 మీటర్ల దూరంలోని ఎస్సార్‌ఎంసీలోకి తరలించేలా అలైన్‌మెంట్‌ను మార్చామని అధికారులు కమిటీకి తెలిపారు. ఈ అలైన్‌మెంట్ ప్రకారం పనులు చేస్తే పర్యావరణపరంగా ఎలాంటి సమస్యలు తలెత్తవని, ఇదే అంశాన్ని ఎన్జీటీకి వివరించామని చెప్పారు. ముచ్చుమర్రి నుంచి రాయలసీమ ఎత్తిపోతల ప్రతిపాదిత ప్రాంతమైన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్దకు కమిటీని జలవనరుల అధికారులు తీసుకెళ్లారు.
అక్కడ పంప్ హౌస్ పునాది కోసం చేసిన ఏర్పాట్లను కమిటీ పరిశీలించింది. జియాలజిస్టుల సూచనల మేరకు నేల స్వభావాన్ని పరిశీలిస్తున్నట్టు అధికారులు వివరించారు. ఇవన్నీ ఎత్తిపోతల పథకం చేపట్టడానికి సన్నాహకాలు మాత్రమేనని తేల్చిచెప్పారు. ఎన్జీటీ ఆదేశాలను ఏమాత్రం ఉల్లంఘించలేదని స్పష్టం చేశారు. ప్రాజెక్టు నిర్మాణం విషయమై డీపీఆర్, పర్యావరణ అనుమతులకోసం ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. అనుమతులు మంజూరయ్యాకే నిర్మాణ పనులు చేపడతామన్నారు. కాగా, రాయలసీమ కరువు ప్రాంతం కాబట్టి ఎత్తిపోతల పథకం నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయాలని మీడియా అడిగిన ప్రశ్నకు కమిటీ సభ్యులు సమాధానం దాటవేశారు.
ఆ అలైన్‌మెంట్ రద్దు..
కృష్ణా బోర్డు కమిటీని జలవనరుల శాఖ ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి, కర్నూలు జిల్లా ప్రాజెక్ట్స్ సీఈ మురళీనాథ్‌రెడ్డిలు తొలుత ముచ్చుమర్రి ఎత్తిపోతల వద్దకు తీసుకెళ్లారు. శ్రీశైలం ప్రాజెక్టులో 800 అడుగుల నీటిమట్టం నుంచి రోజుకు మూడు టీఎంసీలను తరలించేందుకు తొలుత ముచ్చుమర్రి వద్దే పంప్ హౌస్ నిర్మించి.. అక్కడ నుంచి నీటిని ఎత్తిపోస్తామన్నారు. వాటిని 22 కి.మీల పొడవునా తవ్వే కాలువ ద్వారా తరలించి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌కు దిగువన శ్రీశైలం కుడిగట్టు ప్రధాన కాలువ (ఎస్సార్‌ఎంసీ)లో 4 కి.మీ వద్ద పోసేలా రాయలసీమ ఎత్తిపోతలను తలపెట్టామని కమిటీకి వివరించారు.
కానీ ఈ అలైన్‌మెంట్ ప్రకారమైతే పర్యావరణానికి విఘాతం కలుగుతుందని తెలంగాణకు చెందిన వ్యక్తి ఎన్జీటీని ఆశ్రయించారని చెప్పారు. ఎన్జీటీ అభిప్రాయం మేరకు ఆ అలైన్‌మెంట్‌ను రద్దు చేశామని తెలిపారు. ఈ సందర్భంగా బోర్డు సభ్య కార్యదర్శి రాయ్‌పురే నీటి వినియోగంపై ఆరా తీశారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డిపాడు, మల్యాల లిఫ్ట్‌ల నుంచి ఎంత నీటిని తీసుకుంటున్నారని ప్రశ్నించగా చీఫ్ ఇంజనీర్ మురళీనాథ్‌రెడ్డి కోర్టు ఉత్తర్వుల మేరకే నీటిని వాడుకుంటున్నామని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment