కృష్ణాజలాలపై రాష్ట్ర హక్కులను పోరాడి పరిరక్షించిన సీఎం జగన్‌ | CM Jagan fought and protected State rights on Krishna water | Sakshi
Sakshi News home page

ఉమ్మడి ప్రాజెక్టుల అప్పగింతకు ఓకే  

Published Fri, Feb 2 2024 4:54 AM | Last Updated on Fri, Feb 2 2024 1:51 PM

CM Jagan fought and protected State rights on Krishna water - Sakshi

సాక్షి, అమరావతి: కృష్ణాజలాలపై రాష్ట్ర హక్కుల పరిరక్షణలో సీఎం వైఎస్‌ జగన్‌ విజయం సాధించారు. రాష్ట్ర హక్కుల పరిరక్షణకు నాలుగున్నరేళ్లుగా ఆయన చేసిన పోరాటం, కృషి ఫలించాయి. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను కృష్ణాబోర్డుకు అప్పగించేందుకు కేంద్ర జల్‌శక్తి శాఖ అంగీకరించింది. కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ గతనెల 17న ఢిల్లీలో రెండు రాష్ట్రాల జలవనరుల శాఖల ఉన్నతాధి­కారులతో నిర్వహించిన సమావేశంలో తీసుకున్న నిర్ణ­యం అమలుకు గురువారం హైదరాబాద్‌­లోని కృష్ణా­బోర్డు కార్యాలయంలో త్రిసభ్య కమిటీ సమావేశమైంది.

ఈ రెండు ప్రాజెక్టులను కృష్ణాబోర్డుకు అప్పగించేందుకు ఈ సమావేశంలో రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. అందుకు సంబంధించిన విధివిధానా­లను ఈ సమావే­శంలో రూపొందించారు. వాటిని కృష్ణాబోర్డు ఛైర్మన్‌ శివ్‌నందన్‌కుమార్‌ కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ దృష్టికి తీసుకెళ్లనున్నారు. ప్రాజెక్టుల అప్పగింత విధివిధానాలపై రెండు రాష్ట్రాల జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శులతో కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి సమీక్షించనున్నారు. ఆ తర్వాత ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వ­హణ బాధ్యతను కృష్ణాబోర్డుకు అప్పగించనున్నారు.

కృష్ణానదీజలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య తరచు విభేదాలు తలెత్తడానికి కారణమైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను కృష్ణాబోర్డుకు అప్పగించడం ద్వారా వివాదాలకు చెక్‌ పెట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఈ క్రమంలోనే గతనెల 17న రెండు రాష్ట్రాల జలవనరులశాఖ ఉన్నతాధికారులతో ఢిల్లీలో కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ సమావేశం నిర్వహించారు. ఉమ్మడి ప్రాజెక్టులను కృష్ణాబోర్డుకు అప్పగించేందుకు రెండు రాష్ట్రాలు ఆ సమావేశంలో అంగీకరించాయి. ప్రాజెక్టుల అప్పగింత విధివిధానాలను వారంలో ఖరారు చేయాలని త్రిసభ్య కమిటీని కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి ఆదేశించారు. కానీ.. హైదరాబా­ద్‌కు వచ్చాక తెలంగాణ సర్కార్‌ అడ్డం తిరిగింది. కృష్ణాజలాల వాటాలను బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ తేల్చేవరకు ప్రాజెక్టుల అప్పగింతకు అంగీకరించబోమని స్పష్టం చేసింది. ఇదే అంశంపై బుధవారం కేంద్రానికి లేఖ కూడా రాసింది. 

అడ్డంతిరిగి.. దారికొచ్చిన తెలంగాణ 
కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ ఆదేశాల మేరకు కృష్ణాబోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే నేతృత్వంలో గురువారం త్రిసభ్య కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ ఈఎ­న్‌­సీలు సి.నారాయణరెడ్డి, మురళీధర్‌ హాజర­య్యారు. కృష్ణాజలాల్లో తెలంగాణ వాటాను ట్రిబ్యునల్‌ తేల్చేవ­రకు ప్రాజెక్టుల అప్పగింతకు అంగీకరించబోమని తెలంగాణ ఈఎన్‌సీ పాతపాట పాడటంతో ఏపీ ఈఎన్‌సీ నారాయణరెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

నీటి వాటాలు తేల్చేది ట్రిబ్యునల్‌ మాత్రమేనని.. త్రిసభ్య కమిటీ, కృష్ణాబోర్డు, అపెక్స్‌ కౌన్సిల్‌కు ఆ అధికారం లేదని గుర్తుచేశారు. ప్రాజెక్టుల అప్పగింతకే త్రిసభ్య కమిటీ పరిమితం కావాలని సూచించారు. ఉమ్మడి ప్రాజె­క్టుల్లో తమ భూభాగంలోని ఆరు అవుట్‌లెట్లను బోర్డుకు అప్పగిస్తూ ఇప్పటికే ఉత్తర్వులు కూడా జారీచేశామని, తెలంగాణ తన భూభాగంలోని తొమ్మిది అవుట్‌లెట్ల అప్పగింతపై ఇప్పటికీ తేల్చలేదని ఎత్తిచూపారు. దీంతో తమ భూభాగంలోని తొమ్మిది అవుట్‌లెట్లను అప్పగించడానికి తెలంగాణ ఈఎన్‌సీ అంగీకరించారు. 

బోర్డు, ఏపీ, తెలంగాణ ప్రతినిధుల నేతృత్వంలో..
ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతను కృష్ణాబోర్డుకు అప్పగిస్తూనే.. ఒక్కో అవుట్‌లెట్‌ వద్ద బోర్డు, ఏపీ, తెలంగాణ అధికారులు ఒక్కొక్కరిని నియమించి, నీటి విడుదలను పర్యవేక్షించాలని ఇద్దరు ఈఎన్‌సీలు చేసిన సూచనకు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే అంగీకరించారు. ఇందుకు రెండు రాష్ట్రాలు సిబ్బందిని సమకూ­ర్చాలని సభ్య కార్యదర్శి చేసిన ప్రతిపాదనకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయి.

ప్రతి నీటి సంవత్సరంలో ఎప్పటికప్పుడు త్రిసభ్య కమిటీ సమావేశమై.. రెండు రాష్ట్రాల అవసరాలపై చర్చించి, నీటివిడుదలకు చేసే సిఫార్సు మేరకు బోర్డు ఉత్తర్వులు జారీచేయాలనే ప్రతిపాదనపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. తాగునీటి అవసరాల కోసం తక్షణమే సాగర్‌ ఎడమకాలువ కింద ఏపీకి రెండు టీఎంసీల విడుదలకు త్రిసభ్య కమిటీ అంగీకరించింది. కుడికాలువకు మార్చిలో 3, ఏప్రిల్‌లో 5 టీఎంసీల విడుదలకు ఆమోదం తెలిపింది.

హక్కుల పరిరక్షణ కోసం సీఎం జగన్‌ రాజీలేని పోరాటం
వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చాక కృష్ణాజలా­లపై రాష్ట్ర హక్కుల పరిరక్షణ కోసం రాజీ­లేని పోరా­టం చేస్తున్నారు. కృష్ణాపై తెలంగాణ ప్రభు­త్వం అక్ర­మంగా చేపట్టిన ప్రాజెక్టులను నిలిపేయా­లని కేంద్రానికి ఫిర్యా­దు చేశారు. రాయలసీమ, నెల్లూరు జిల్లాల సాగు, తాగునీటి అవసరాలు తీర్చ­డం కోసం తెలంగాణ తరహాలోనే శ్రీశైలంలో 800 అడు­గుల స్థాయిలో నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యు­లేటర్‌లోకి రోజుకు 3 టీఎంసీలు ఎత్తిపోసేలా రాయ­లసీమ ఎత్తిపోతల పథ­కం చేపట్టారు. దీనిపై రెండు రాష్ట్రాల మధ్య వివాదం తలెత్తింది.

ఈ వివాదాన్ని పరిష్కరించడానికి 2020 అక్టోబర్‌ 6న కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ అపెక్స్‌ కౌన్సిల్‌ సమా­వేశం నిర్వహించారు. రాష్ట్రానికి హక్కుగా దక్కి­న నీటిని వినియోగించుకో­వడం కోసమే రాయలసీమ ఎత్తిపోత­లను చేపట్టామని సీఎం జగన్‌ స్పష్టంగా చెప్పారు. తెలంగాణ చేపట్టిన అక్రమ ప్రాజెక్టులను నిలి­పి­వేయా­లని గట్టిగా డిమాండ్‌ చేశారు. పాల­మూరు–రంగా­రెడ్డి, డిండి ఎత్తిపోతలను నిలి­పేసేలా తెలంగాణ సర్కార్‌ను ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. 2021లో శ్రీశైలానికి ఎగువ నుంచి వరద ప్రవాహం ప్రారంభం కాకుండానే తెలంగాణ జెన్‌కో విద్యుదు­త్పత్తి ప్రారంభించింది.

ఇక్కడి నుంచి నీటిని సాగర్‌కు తరలించింది. ఇలా శ్రీశైలం జలాశయాన్ని ఖాళీ చేస్తూ రాష్ట్ర హక్కులను హరిస్తుండటంతో సీఎం జగన్‌ న్యాయ­పో­రా­టానికి దిగారు. కృష్ణాబోర్డు పరిధిని నోటిఫై చేయడం ద్వారా అక్రమంగా విద్యుదుత్పత్తి చేయకుండా తెలంగాణను కట్టడిచేయా­లని కోరుతూ సుప్రీంకోర్టులో రిట్‌ పిటి­షన్‌ దాఖలు చేశారు. దీంతో కృష్ణా­బోర్డు పరిధిని నిర్దేశి­స్తూ 2021 జూలై 15న కేంద్ర జల్‌­శక్తి శాఖ నోటిఫికేషన్‌ జారీచేసింది. ఉమ్మడి ప్రాజెక్టు­లను ఏడాదిలోగా బోర్డుకు అప్పగించాలని కేంద్రం ఆదే­శించింది. శ్రీశైలం, సాగర్‌లో రాష్ట్ర భూభా­గం పరి­ధిలోని ప్రాజె­క్టు­లను బోర్డుకు అప్పగించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైనా.. తెలంగాణ సర్కారు తన భూ­భా­గంలోని ప్రాజెక్టులను అప్పగించేందుకు నిరాకరించింది.

ఈ నేపథ్యంలో రాష్ట్ర భూభాగంలోని సాగర్‌ స్పిల్‌ వే 13 గేట్లతోపాటు కుడికాలువ హెడ్‌ రెగ్యులే­టర్‌ను రాష్ట్రా­నికి అప్పగించాలని, లేదంటే ఉమ్మడి ప్రాజెక్టు­లను బోర్డు పరిధిలోకి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ వస్తున్నా­రు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి గతేడాది అక్టో­బర్‌ 6న కృష్ణాబోర్డు రాష్ట్రానికి కేటా­యిం­చిన 30 టీఎంసీల్లో 17 టీఎంసీలను ఎడమగట్టు కేంద్రంలో విద్యు­దుత్పత్తి చేస్తూ నాగార్జునసాగర్‌కు తెలంగాణ సర్కార్‌ తరలించింది. ఆ 17 టీఎంసీలను గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల తాగు­నీ­టి అవస­రాల కోసం సాగర్‌ కుడి­కాలువ ద్వారా  విడుదల చేయా­లన్న రాష్ట్ర అధికా­రుల విజ్ఞ్ఞప్తులను తెలంగాణ పట్టించుకోలేదు.

శ్రీశైలం ప్రాజెక్టు నిర్వ­హణ బాధ్యత కేంద్రం రాష్ట్రానికి అప్పగిస్తే.. తమ భూభా­గంలో ఉందని ఎడమగట్టు విద్యుత్‌ కేంద్రాన్ని తెలంగాణ సర్కార్‌ తన ఆధీనంలోకి తీసుకుందని.. అదే తరహాలో రాష్ట్ర భూభాగంలో ఉన్న నాగా­ర్జున­సాగర్‌ స్పిల్‌ వే 13 గేట్ల­తోసహా కుడికాలువ హెడ్‌ రెగ్యులేటర్‌ను ఆధీనంలోకి తీసుకుని, నీటిని విడుదల చేయాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు. దీంతో నవంబర్‌ 30న తెల్ల­వారుజా­మున సీఈ మురళీ­నాథ్‌రెడ్డి నేతృత్వంలో పోలీ­సులు, జలవనరుల­శాఖ అధికారులు రాష్ట్ర భూభాగంలోని సాగర్‌ స్పిల్‌ వేలో సగాన్ని, కుడికాలువ హెడ్‌ రెగ్యులేటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. తాగునీటి అవ­సరాల కోసం కుడికాలు­వకు 2,300 క్యూసెక్కులు విడుదల చేశారు. దీనిపై తెలంగాణ సర్కారు కేంద్రానికి ఫిర్యాదు చేసింది. దీంతో సీఎం జగన్‌ ఆది నుంచి చేస్తున్న డిమాండ్‌ మేరకు ఉమ్మడి ప్రాజెక్టులను కృష్ణా­బోర్డుకు అప్పగించేందుకు కేంద్రం అంగీకరించింది.

ఏకాభిప్రాయంతో ప్రాజెక్టుల అప్పగింత 
త్రిసభ్య కమిటీ సమావేశంలో ఉమ్మడి ప్రాజెక్టుల అప్పగింతకు ఏకాభిప్రాయం కుదిరింది. ఏపీ భూభా­గంలోని ఆరు అవుట్‌లెట్లను బోర్డుకు అప్ప­గింతకు సంబంధించి ఇప్పటికే ఉత్తర్వులు జారీచే­శాం. తెలంగాణ భూభాగంలోని తొమ్మిది అవుట్‌­లెట్లను అప్పగించడానికి ఆ రాష్ట్రం అంగీకరించింది. త్రిసభ్య కమిటీ సిఫార్సు మేరకు బోర్డు నీటి కేటాయింపులు చేస్తుంది. వాటిని బోర్డే విడుదల చేస్తుంది. 
– సి.నారాయణరెడ్డి, ఈఎన్‌సీ, ఏపీ జలవనరులశాఖ 

త్రిసభ్య కమిటీ సిఫార్సులే కీలకం 
శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను బోర్డుకు అప్పగించేందుకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. ఏటా నీటి అవసరాలపై త్రిసభ్య కమిటీ చర్చించి.. కేటాయింపులపై బోర్డుకు సిఫార్సు చేస్తుంది. ఆ ప్రకారమే బోర్డు నీటిని విడుదల చేస్తుంది. మా భూభాగంలోని తొమ్మిది అవుట్‌లెట్లను కృష్ణాబోర్డుకు అప్పగిస్తాం. కృష్ణాజలాల్లో 50 శాతం వాటా కోసం కేంద్ర జల్‌శక్తి శాఖకు లేఖ రాశాం. 
– మురళీధర్, ఈఎన్‌సీ, తెలంగాణ నీటిపారుదలశాఖ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement