CM YS Jagan Letter To PM Narendra Modi On Krishna Water Dispute - Sakshi
Sakshi News home page

Krishna Water Dispute: అక్రమాన్ని ఆపండి - సీఎం జగన్‌

Published Fri, Jul 2 2021 2:54 AM | Last Updated on Fri, Jul 2 2021 5:47 PM

CM YS Jagan letter to PM Narendra Modi On Krishna Water dispute - Sakshi

‘‘జల విద్యుదుత్పత్తి కోసం నీటిని వాడుకోవద్దని కృష్ణా బోర్డు జారీ చేసిన ఆదేశాలను తెలంగాణ సర్కార్‌ బుట్టదాఖలు చేసింది. ప్రాజెక్టుల నిర్వహణ నియమావళి (స్టాండర్డ్‌ ఆపరేషన్‌ ప్రోటోకాల్‌), ఒప్పందాలను తుంగలో తొక్కి ఏకపక్షంగా, అక్రమంగా నీటిని వాడుకుంటూ విద్యుదుత్పత్తి చేస్తోంది. ఇది అంతరాష్ట్ర సంబంధాలను దెబ్బ తీస్తోంది. దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ హక్కులకు విఘాతం కల్పిస్తోంది. తెలంగాణ సర్కార్‌ యథేచ్ఛగా విద్యుదుత్పత్తి చేస్తుండటం వల్ల శ్రీశైలం ప్రాజెక్టులో నీటి మట్టం పెరగక తీవ్ర దుర్భిక్ష ప్రాంతాలైన రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు తాగు, సాగునీరు, చెన్నైకి తాగునీటిని సరఫరా చేయలేని దుస్థితి నెలకొంది’’ 
– ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి జగన్‌ లేఖ

సాక్షి, అమరావతి: కృష్ణా జలాలపై తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాలపై తక్షణమే జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. కృష్ణా బోర్డు అనుమతి లేకుండా విద్యుదుత్పత్తి చేయకుండా తెలంగాణ సర్కార్‌ను నియంత్రించాలని  విజ్ఞప్తి  చేశారు. తెలంగాణ సర్కార్‌ అక్రమంగా వినియోగించిన నీటిని ఆ రాష్ట్ర కోటా కింద పరిగణించాలని కోరారు. కృష్ణా బోర్డు పరిధిని తక్షణమే ఖరారు చేసి ఉమ్మడి ప్రాజెక్టులకు సీఐఎస్‌ఎఫ్‌ బలగాలతో భద్రత కల్పించి ఆంధ్రప్రదేశ్‌ హక్కులను పరిరక్షించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రధానికి సీఎం వైఎస్‌ జగన్‌ గురువారం లేఖ రాశారు. ఇవే అంశాలను వివరిస్తూ కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌కు కూడా లేఖ రాశారు. ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి జగన్‌ రాసిన లేఖలో ప్రధానాంశాలు ఇవీ..

తాత్కాలిక ఏర్పాట్లు.. 
కృష్ణా జలాల వినియోగంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తకుండా విభజన చట్టం సెక్షన్‌–85 ప్రకారం కేంద్ర ప్రభుత్వం కృష్ణా బోర్డును ఏర్పాటు చేసింది. కానీ ఇప్పటిదాకా బోర్డు పరిధి, నిర్వహణ నియమావళిని ఖరారు చేయలేదు. ప్రాజెక్టుల నిర్వహణకు తాత్కాలిక ఏర్పాట్లు చేసింది. శ్రీశైలం, పులిచింతల, ప్రకాశం బ్యారేజీలను ఆంధ్రప్రదేశ్‌.. జూరాల, నాగార్జునసాగర్‌లను తెలంగాణ ప్రభుత్వాలు నిర్వహించేలా ఏ రాష్ట్ర భూభాగంలో ఉన్న విద్యుదుత్పత్తి కేంద్రాలను ఆ రాష్ట్రం నిర్వహించుకునేలా తాత్కాలిక ఏర్పాట్లు చేసింది.

బోర్డు ఆదేశాలను లెక్క చేయకుండా..
నీటి వాటాల పంపిణీపై 2015 జూలై 18, 19న కేంద్ర జలవనరుల శాఖ అదనపు కార్యదర్శి అధ్యక్షతన రెండు రాష్ట్రాల జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శులతో సమావేశాన్ని నిర్వహించారు. ఉమ్మడి రాష్ట్రానికి కేడబ్ల్యూడీటీ–1 కేటాయించిన 811 టీఎంసీల్లో ఆంధ్రప్రదేశ్‌కు 512, తెలంగాణకు 299 టీఎంసీలు కేటాయిస్తూ తాత్కాలిక సర్దుబాటు చేసింది. తాత్కాలిక సర్దుబాటు మేరకు జలాలను పంపిణీ చేయడానికి కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి అధ్యక్షతన ఇరు రాష్ట్రాల ఈఎన్‌సీలు సభ్యులుగా త్రిసభ్య కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. నీటి లభ్యత, రెండు రాష్ట్రాల ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకుని త్రిసభ్య కమిటీ సిఫార్సుల ఆధారంగా నీటి కేటాయింపులు చేస్తూ కృష్ణా బోర్డు ఉత్వర్వులు జారీ చేసింది. సంబంధిత రాష్ట్రాల ప్రాజెక్టుల అధికారులు వీటిని అమలు చేయాలి. ప్రాజెక్టులోకి వచ్చే ప్రవాహాలు, నీటి నిల్వలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ లభ్యతగా ఉన్న నీటిని దామాషా పద్ధతిలో ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేయాలి. కానీ తెలంగాణ సర్కార్‌ కృష్ణా బోర్డు ఉత్తర్వులను తుంగలో తొక్కి అక్రమంగా నీటిని వాడుకుంటూ ఆంధ్రప్రదేశ్‌ను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది.

కనీస మట్టం లేకున్నా విద్యుదుత్పత్తి..
శ్రీశైలం ప్రాజెక్టు తొలుత హైడ్రో ఎలక్ట్రిక్‌ ప్రాజెక్టే. కానీ కాలక్రమంలో ఉమ్మడి రాష్ట్రంలోనే తాగు, పారిశ్రామిక, సాగునీటి అవసరాలు తీర్చే బహుళార్ధక సాధక ప్రాజెక్టుగా మారింది. ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు. పూర్తి స్థాయి నీటి నిల్వ 215.8 టీఎంసీలు. విద్యుదుత్పత్తికి కనీస నీటి మట్టం 834 అడుగులు కాగా సాగునీటి విడుదలకు కనీస మట్టం 854 అడుగులు ఉండాలి. జూన్‌ 1 నాటికి శ్రీశైలంలో 808.4 అడుగుల్లో 33.39 టీఎంసీలే నిల్వ ఉన్నాయి. కనీస నీటి మట్టానికి దిగువన నీటి నిల్వ ఉన్నప్పుడు విద్యుదుత్పత్తి చేయకూడదు. కానీ కృష్ణా బోర్డుకు ఎలాంటి ప్రతిపాదనలు పంపకుండానే తెలంగాణ సర్కార్‌ అదే రోజు ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తిని ప్రారంభించి దిగువకు నీటిని విడుదల చేసింది. నాగార్జునసాగర్‌లో 173.86 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. సాగర్‌ ఆయకట్టుకు నీటి అవసరాలు లేకపోయినా శ్రీశైలం ప్రాజెక్టులో అక్రమంగా నీటిని వాడుకుంటూ విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు వదిలేసింది. 

పెరగని నీటిమట్టం..
జూన్‌ 30 వరకూ శ్రీశైలం ప్రాజెక్టులోకి 17.36 టీఎంసీల ప్రవాహం వస్తే విద్యుదుత్పత్తి కోసం 6.9 టీఎంసీలు (40 శాతం) నీటిని తెలంగాణ సర్కార్‌ అక్రమంగా వాడుకుంది. రోజూ రెండు టీఎంసీలను వాడుకుంటూ తెలంగాణ సర్కార్‌ అక్రమంగా విద్యుదుత్పత్తి చేస్తుండటం వల్ల శ్రీశైలం ప్రాజెక్టులో నీటి మట్టం పెరగడం లేదు. ఇది ఆంధ్రప్రదేశ్‌ను ప్రతికూల పరిస్థితుల్లోకి నెట్టేస్తోంది. శ్రీశైలంలో నీటి మట్టం 854 అడుగుల స్థాయికి చేరితేనే పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా తాగు, సాగునీటి కోసం నీటిని తీసుకోవచ్చు. ఈ రెగ్యులేటర్‌ ద్వారానే తీవ్ర దుర్భిక్ష ప్రాంతాలైన రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు తాగు, సాగునీటి అవసరాలకు నీటిని సరఫరా చేస్తాం. చెన్నైకి తాగునీటిని సరఫరా చేస్తాం.

బోర్డు ఆదేశించినా...
తెలంగాణ సర్కార్‌ అక్రమంగా నీటిని వాడుకుంటూ విద్యుదుత్పత్తి చేస్తుండటంపై జూన్‌ 10న కృష్ణా బోర్డుకు ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. దీనిపై స్పందించిన కృష్ణా బోర్డు ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తిని నిలుపుదల చేయాలని జూన్‌ 17న తెలంగాణ సర్కార్‌ను ఆదేశిస్తూ లేఖ రాసింది. గ్రిడ్‌ అత్యవసర పరిస్థితి ఉంటే మినహా మిగిలిన సందర్భాల్లో కృష్ణా బోర్డు ఉత్తర్వులను తెలంగాణ సర్కార్‌ అమలు చేయాలి. కానీ.. తెలంగాణ సర్కార్‌ విద్యుదుత్పత్తిని నిలుపుదల చేయలేదు. ఇదే అంశాన్ని కృష్ణా బోర్డు దృష్టికి తీసుకెళ్లి జూన్‌ 23, 29న లేఖలు రాశాం. 

ప్రోటోకాల్‌ను ఉల్లంఘిస్తూ..
ఉమ్మడి ప్రాజెక్టు నాగార్జునసాగర్‌ పూర్తి నీటి మట్టం 590 అడుగులు. పూర్తి నీటి నిల్వ 312 టీఎంసీలు. కనీస నీటి మట్టం 510 అడుగులు. జూన్‌ 30 నాటికి 534.2 అడుగుల్లో సాగర్‌లో 176.46 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. తెలంగాణ సర్కార్‌ కృష్ణా బోర్డుకు ఎలాంటి ప్రతిపాదనలు పంపకుండా, ప్రోటోకాల్‌ను ఉల్లంఘిస్తూ ఏకపక్షంగా విద్యుదుత్పత్తి చేస్తూ సాగర్‌ నుంచి 30,400 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తోంది. ఈ రోజు వరకూ దిగువన సాగునీటి అవసరాలు లేకున్నా సాగర్‌ నుంచి తెలంగాణ సర్కార్‌ అక్రమంగా నీటిని వాడుకుంటూ విద్యుదుత్పత్తి చేస్తూ నీటిని వదిలేస్తోంది.

అనుమతి తీసుకోకుండా..
కృష్ణా డెల్టా ఆయకట్టును స్థిరీకరించడానికే బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌గా 45.77 టీఎంసీల సామర్థ్యంతో పులిచింతల ప్రాజెక్టును నిర్మించాం. విజయవాడ ఇరిగేషన్‌ సర్కిల్‌ ఎస్‌ఈ నీటిని విడుదల చేయాలని ఎలాంటి ప్రతిపాదనలు పంపకున్నా, కృష్ణా బోర్డు అనుమతి తీసుకోకుండానే జూన్‌ 29న ఉదయం 8 గంటలకు తెలంగాణ సర్కార్‌ ఏకపక్షంగా విద్యుదుత్పత్తి చేస్తూ 4 వేల క్యూసెక్కులను దిగువకు వదిలేసింది. ఈ అంశాన్ని కృష్ణా బోర్డు దృష్టికి తీసుకెళ్తూ పులిచింతలలో తక్షణమే విద్యుదుత్పత్తిని నిలిపివేసేలా తెలంగాణ సర్కార్‌ను ఆదేశించాలని జూన్‌ 30న కృష్ణా బోర్డుకు లేఖ రాశాం. 

బ్యారేజీ నుంచి వృథాగా బంగాళాఖాతంలోకి..
ప్రకాశం బ్యారేజీలో ఇప్పటికే గరిష్ట స్థాయిలో 3.07 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. తెలంగాణ సర్కార్‌ అక్రమంగా నీటిని వాడుకుని విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు వదిలేస్తుండటం వల్ల బ్యారేజీ నుంచి వాటిని వృథాగా బంగాళాఖాతంలోకి వదిలేయాల్సి వస్తోంది. 

దిగువ రాష్ట్రం హక్కులను కాపాడండి..
విద్యుదుత్పత్తిని నిలుపుదల చేయాలని కృష్ణా బోర్డు జారీ చేసిన ఆదేశాలను బుట్టదాఖలు చేస్తూ స్థాపిత సామర్థ్యం మేరకు వంద శాతం జలవిద్యుదుత్పత్తి చేసేలా తెలంగాణ సర్కార్‌ జూన్‌ 28న జీవో 34 జారీ చేసింది. అంటే దీని అర్ధం తెలంగాణ సర్కార్‌ రోజూ శ్రీశైలం నుంచి నాలుగు, సాగర్‌ నుంచి మూడు, పులిచింతల నుంచి 1.8 టీఎంసీలను జల విద్యుత్తు కోసం విడుదల చేస్తున్నట్లే. విద్యుదుత్పత్తి కోసం నీటిని విడుదల చేయవద్దని కృష్ణా బోర్డు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చినా తెలంగాణ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అందువల్ల దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ హక్కులను పరిరక్షించడానికి తక్షణమే మీరు జోక్యం చేసుకోవాలని కోరుతున్నా. అక్రమంగా నీటిని వాడుకుంటూ విద్యుదుత్పత్తి చేస్తున్న తెలంగాణ సర్కార్‌ను కట్టడి చేయండి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement