అక్రమాన్ని అడ్డుకోండి | CM Jagan Writes Letter To PM Narendra Modi About Telangana Govt | Sakshi
Sakshi News home page

అక్రమాన్ని అడ్డుకోండి

Published Thu, Jul 8 2021 2:52 AM | Last Updated on Thu, Jul 8 2021 12:59 PM

CM Jagan Writes Letter To PM Narendra Modi About Telangana Govt - Sakshi

జూన్‌ 1 నుంచి ఇప్పటి వరకు శ్రీశైలంలోకి 26 టీఎంసీలు వస్తే.. తెలంగాణ అక్రమంగా విద్యుత్‌ ఉత్పత్తి ద్వారా 19 టీఎంసీలను వాడుకుని, దిగువకు వదిలేసింది. అందువల్ల శ్రీశైలంలో నీటి మట్టం పెరగడం లేదు. దీంతో తీవ్ర దుర్భిక్ష ప్రాంతాల్లో తీవ్ర నీటి ఎద్దడికి దారితీస్తోంది.  

విభజన చట్టంలో నిబంధనల మేరకు కృష్ణా బోర్డు పరిధిని తక్షణమే నోటిఫై చేయాలి. ఉమ్మడి రిజర్వాయర్లలో సాగునీటి ప్రాజెక్టులు, తాగునీటి పథకాలు, విద్యుత్కేంద్రాలను బోర్డు నియంత్రణలోకి తేవాలి. వాటికి సీఐఎస్‌ఎఫ్‌ బలగాలతో భద్రత కల్పించాలి. ఆ ప్రాజెక్టులను సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా.. రెండు రాష్ట్రాల ప్రయోజనాలను పరిరక్షించాలి.

సాక్షి, అమరావతి: కృష్ణా జలాల్లో ఆంధ్రప్రదేశ్‌కు వాటా దక్కకుండా చేయాలనే ఉద్దేశంతోనే.. సాగునీటి అవసరాలు లేకున్నా శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల్లో తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా విద్యుదుత్పత్తి చేస్తోందని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణ సర్కార్‌ దుందుడుకు చర్యల వల్ల కృష్ణా జలాలు వృథాగా సముద్రంలో కలుస్తున్నాయని వివరించారు. ఈ అంశాన్ని కేంద్ర జల్‌ శక్తి శాఖ, కృష్ణా బోర్డుల దృష్టికి అనేక సార్లు తీసుకెళ్లినా వివాదం పరిష్కారం కాలేదన్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో 796 అడుగుల నుంచే ఎడమ గట్టు కేంద్రం ద్వారా రోజుకు 4 టీఎంసీలను తరలించే సామర్థ్యం తెలంగాణ సర్కార్‌కు ఉందని పేర్కొన్నారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి, డిండి.. సామర్థ్యం పెంచిన కల్వకుర్తి, ఎస్సెల్బీసీ పూర్తయితే శ్రీశైలంలో చుక్క నీరు కూడా ఏపీకి మిగలదని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో తక్షణమే జోక్యం చేసుకుని అక్రమంగా నీటిని వాడుకోకుండా తెలంగాణ సర్కార్‌ను కట్టడి చేసేలా కేంద్ర జల్‌ శక్తి శాఖకు దిశానిర్దేశం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రధానికి బుధవారం సీఎం వైఎస్‌ జగన్‌ రెండోసారి లేఖ రాశారు. లేఖలో ప్రధానాంశాలు ఇలా ఉన్నాయి.

శ్రీశైలాన్ని ఖాళీ చేస్తున్న తెలంగాణ 
► విభజన చట్టం ద్వారా ఏర్పాటైన అపెక్స్‌ కౌన్సిల్, కృష్ణా బోర్డు.. రెండు రాష్ట్రాలకు నీటి వాటాల పంపిణీ, నీటి విడుదలపై రూపొందించిన తాత్కాలిక సర్దుబాట్లు, ఒప్పందాలను తెలంగాణ సర్కార్‌ తుంగలో తొక్కుతూ ఉమ్మడి ప్రాజెక్టుల్లో ఆపరేషనల్‌ ప్రోటోకాల్‌ను ఉల్లంఘిస్తూ అక్రమంగా విద్యుదుత్పత్తి చేస్తుండటాన్ని ఈనెల 1న రాసిన లేఖలో మీ దృష్టికి తెచ్చాం. 
► శ్రీశైలంలో 881 అడుగుల స్థాయిలో నీటి మట్టం ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా డిజైన్‌ చేసిన మేరకు 44 వేల క్యూసెక్కులు కాలువల ద్వారా తరలించవచ్చు. శ్రీశైలంలో నీటి మట్టం 854 అడుగులకు చేరితే అత్యవసరాల కోసం కేవలం 6వేల క్యూసెక్కులనే తరలించొచ్చు. తద్వారా తీవ్ర దుర్భిక్ష ప్రాంతాలైన రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు సాగు, తాగునీటి అవసరాలు తీర్చేందుకు అవకాశముంటుంది. చెన్నైకీ తాగునీరు సరఫరా చేయవచ్చు. 
► ప్రస్తుత నీటి సంవత్సరంలో మొదటి రోజే.. అంటే జూన్‌ 1న శ్రీశైలంలో కనీస నీటి మట్టం(విద్యుదుత్పత్తికి) 834 అడుగుల దిగువన నీటి నిల్వ ఉన్నా.. కృష్ణా బోర్డుకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే నాగార్జునసాగర్, కృష్ణా డెల్టా ఆయకట్టులో ఎలాంటి సాగునీటి అవసరాలు లేకున్నా తెలంగాణ సర్కార్‌ విద్యుదుత్పత్తిని ప్రారంభించింది. ఈ క్రమంలో పూర్తి స్థాపిత సామర్థ్యంతో నిరంతరాయంగా జల విద్యుదుత్పత్తి చేయాలని తెలంగాణ సర్కార్‌ జూన్‌ 28న ఉత్తర్వులిచ్చింది. ఆ మేరకు  శ్రీశైలం ఎడమగట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తోంది. 

ఆ నీళ్లన్నీ తెలంగాణ కోటా కింద లెక్కించాలి
► నాగార్జునసాగర్‌లోనూ అక్రమంగా నీటిని తోడేస్తూ విద్యుదుత్పత్తి చేస్తోంది. కృష్ణా డెల్టా ఆయకట్టు స్థిరీకరణకు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌గా ఉపయోగపడే పులిచింతల ప్రాజెక్టులోనూ.. అధీకృత అధికారి, విజయవాడ ఇరిగేషన్‌ సర్కిల్‌ ఎస్‌ఈ నీటిని విడుదల చేయాలని ఎలాంటి ప్రతిపాదనలు పంపకున్నా.. కృష్ణా బోర్డుకు కనీసం సమాచారం ఇవ్వకుండా తెలంగాణ సర్కార్‌ అక్రమంగా నీటిని వాడుకుంటూ విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు వదిలేస్తోంది.
► ఆ నీళ్లన్నీ వృథాగా సముద్రంలో కలుస్తున్నాయి. ఏపీకి వాటాగా దక్కిన జలాలను దక్కనివ్వకుండా చేయాలన్న ఉద్దేశంతో తెలంగాణ సర్కార్‌ అక్రమంగా తోడేస్తున్న నీటిని.. ఆ రాష్ట్ర వాటా అయిన 299 టీఎంసీల కోటా కింద లెక్కించాలి.

రాష్ట్ర హక్కుల పరిరక్షణలో కృష్ణా బోర్డు విఫలం 
► ఏపీకి వాటాగా దక్కాల్సిన జలాలను దక్కనివ్వకుండా చేసి, తెలంగాణ సర్కార్‌ ఇబ్బందులకు గురిచేస్తుండటాన్ని పలుమార్లు కేంద్ర జల్‌శక్తి శాఖ దృష్టికి తీసుకెళ్లాం. పర్యావరణ అనుమతి లేకుండా తెలంగాణ సర్కార్‌ అక్రమంగా ప్రాజెక్టులు చేపట్టిందని కూడా వివరించాం. సమస్య పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రాష్ట్ర హక్కుల పరిరక్షణలో కృష్ణా బోర్డు సమర్థంగా వ్యవహరించడం లేదు.
► శ్రీశైలం ప్రాజెక్టులో 800 అడుగుల నుంచే రోజుకు 1.5 టీఎంసీ చొప్పున 90 టీఎంసీలు తరలించేలా పాలమూరు–రంగారెడ్డి, రోజుకు 0.5 టీఎంసీ చొప్పున 30 టీఎంసీలు తరలించేలా డిండి, రోజుకు 0.4 టీఎంసీల చొప్పున తరలించేలా కల్వకుర్తి సామర్థ్యాన్ని 25 నుంచి 40 టీఎంసీలకు పెంచడం, 825 అడుగుల నుంచి రోజుకు 0.5 టీఎంసీ చొప్పున తరలించేలా ఎస్సెల్బీసీ సామర్థ్యాన్ని 30 నుంచి 40 టీఎంసీలకు పెంచే పనులను తెలంగాణ సర్కార్‌ అక్రమంగా చేపట్టింది. ఇదికాక 796 అడుగుల నుంచే ఎడమ గట్టు విద్యుత్కేంద్రం ద్వారా రోజుకు 4 టీఎంసీల చొప్పున తరలించే సామర్థ్యం తెలంగాణ సర్కార్‌కు ఉంది.

రాయలసీమ ఎత్తిపోతలే శరణ్యం 
► తెలంగాణ సర్కార్‌ దుందుడుకు చర్యలకు తోడు అక్రమంగా చేపట్టిన ప్రాజెక్టులు పూర్తయితే శ్రీశైలం ప్రాజెక్టులో ఏపీకి చక్క 
మిగలదు. కేడబ్ల్యూడీటీ–1, విభజన చట్టం 11వ షెడ్యూలు ద్వారా ఎస్సార్బీసీ, తెలుగుగంగ, గాలేరు–నగరి, కేసీ కెనాల్‌కు నీటి కేటాయింపులున్నాయి. తెలంగాణ చర్యలతో ఈ ప్రాజెక్టులకు పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా గ్రావిటీపై నీళ్లందించలేని దుస్థితి. 
► ఈ దుస్థితిని అధిగమించి.. సీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల సాగు, తాగునీటి అవసరాలు, చెన్నైకి తాగునీటి అవసరాలు తీర్చాలంటే.. శ్రీశైలంలో 800అడుగుల నుంచి రోజుకు 3 టీఎంసీల చొప్పున పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌కు దిగువన కాలువలోకి ఎత్తిపోసేలా రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టడం ఒక్కటే శరణ్యం. 

అదనంగా చుక్క నీటినీ  వాడుకోం 
► రాయలసీమ ఎత్తిపోతల ద్వారా కొత్తగా ఆయకట్టుకు నీళ్లందించడం లేదు. కొత్తగా కాలువలు తవ్వడం లేదు. నీటి నిల్వ చేసే రిజర్వాయర్లు నిర్మించడం లేదు. ఇప్పటికే ఉన్న కాలువల ద్వారా రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల సాగు, తాగునీటి అవసరాలు తీర్చడానికే ఈ ఎత్తిపోతల చేపట్టాం. రాష్ట్రానికి దక్కిన 512 టీఎంసీల కోటాలోనే నీటిని వాడుకుంటాం. అదనంగా ఒక్క చుక్క వాడుకోం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement