సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాలపై ఆధారపడి చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు అంచనా వ్యయం భారీగా పెరగనుంది. ప్రాజెక్టు తొలి దశలో కేవలం తాగునీటి అవసరాల పేరిట ప్రధాన పనుల వరకే ప్రాథమిక అంచనా రూపొందించారు. ఆ మేరకు పరిపాలనా అనుమతులు ఇవ్వగా..ప్రస్తుతం సాగు నీటికి సంబంధించిన కాల్వల పనులు జత చేశారు.
దీంతో ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.35,200 కోట్ల నుంచి రూ.52,056 కోట్లకు చేరనుంది. అంటే అదనంగా రూ.16,856 కోట్ల మేర వ్యయం పెరగ నుందన్నమాట. సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) లో ఈ వివరాలను పొందుపరిచిన నీటి పారుదల శాఖ.. ప్రభుత్వ అనుమతి అనంతరం వీటిని కేంద్ర జల సంఘం, కృష్ణా బోర్డుకు సమర్పించనుంది.
60 రోజులు .. రోజుకు 1.5 టీఎంసీ
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 60 రోజుల్లో రోజుకి ఒకటిన్నర టీఎంసీ నీటిని తీసుకుంటూ మొత్తంగా 90 టీఎంసీల వరద జలాలతో పూర్వ మహబూబ్‌నగర్ జిల్లాలో 7 లక్షల ఎకరాలు, రంగారెడ్డి జిల్లాలో 5 లక్షల ఎకరాలు, నల్లగొండ జిల్లాలో 30 వేల ఎకరాలు కలిపి మొత్తంగా 12.30 లక్షల ఎకరాలకు నీరందించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. ఇందులో భాగం గా నార్లాపూర్ రిజర్వాయర్ 8.51 టీఎంసీలు, ఏదుల 6.55, వట్టెం 16.74, కరివెన 17.34, ఉద్దండాపూర్ 15.91, లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌ను 2.80 టీఎంసీల తో ప్రతిపాదించారు.
ఈ మొత్తం ప్రతిపాదనలకు 2015లో రూ.35,200 కోట్లతో పరిపాలనా అనుమ తులు ఇచ్చారు. అందుకనుగుణంగా డిజైన్లు ఖరారు చేసి నార్లాపూర్ నుంచి ఉద్దండాపూర్ వరకు 18 ప్యాకే జీలతో రూ.29,333 కోట్లకు టెండర్లు పిలిచి పనులు మొదలు పెట్టారు. పంప్‌హౌస్‌లు, రిజర్వాయర్లు, ప్రధాన కాల్వలకు సంబంధించి ఇంతవరకు రూ.15,810 కోట్ల పనులు జరిగినట్లుగా తెలుస్తోంది.
ప్రధాన కాల్వ నుంచి వ్యవసాయ అవసరాలకు నీటిని మళ్లించే ఇతర కాల్వలు, డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం మాత్రం చేపట్టలేదు. అయితే కోర్టులు, గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసుల సందర్భంగా తాము ప్రస్తుతం చేపట్టిన పనులన్నీ తాగునీటి అవసరాల మేరకేనని, తొలి దశలో తామిచ్చిన పరిపాలనా అనుమతులు కానీ, చేస్తున్న పనులన్నీ తాగునీటి అవసరాలు తీర్చేందుకేనని ప్రభుత్వం చెబుతూ వస్తోంది.
తుది అంచనాల్లో ఇలా..
ప్రస్తుతం కేంద్రానికి డీపీఆర్‌లు సమర్పించాల్సి ఉన్న నేపథ్యంలో కాల్వలు, డిస్ట్రిబ్యూటరీలకు అయ్యే వ్యయాలను కలుపుకొని తుది అంచనాలు సిద్ధం చేసింది. అందులో ప్రధాన పనులు (హెడ్ వర్క్స్), ఐదు లిఫ్టులు కలుపుకొని వీటికి రూ.40,515.98కోట్లు ఖర్చు చేయనున్నామని తెలిపింది. రెండో దశలో కాల్వల వ్యవస్థ, వాటికింద డిస్ట్రిబ్యూటరీ కాల్వల నిర్మాణానికి రూ.8,069.03 కోట్లు, వీటికి అదనంగా పంపింగ్ కేంద్రాలకు విద్యుత్ సరఫరా వ్యవస్థ ఏర్పాటుకు మరో రూ.3,471.31 కోట్లు కలిపి మొత్తంగా రూ.52,056.32 కోట్లు ఖర్చవుతుందని పేర్కొంది.
ఇప్పటికే ప్రాజెక్టు పర్యావరణ అనుమతులకు వీలుగా ప్రజాభిప్రాయ సేకరణ పూర్తి చేసినప్పటికీ అనుమతుల కోసం ఇంకా కేంద్రానికి పంపలేదు. అలాగే డీపీఆర్ కూడా ప్రభుత్వం అధికారికంగా చెప్పినప్పుడు మాత్రమే సమర్పించి అనుమతుల ప్రక్రియను మొదలు పెట్టాలని సాగునీటి శాఖ భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment