జగడం జటిలం ! | Godavari and Krishna Water Disputes to raise between AP and Telangana states | Sakshi
Sakshi News home page

జగడం జటిలం !

Published Sun, Dec 28 2014 1:38 AM | Last Updated on Sat, Sep 2 2017 6:50 PM

జగడం జటిలం !

జగడం జటిలం !

* తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య ముదురుతున్న జల వివాదాలు
* చేతులెత్తేస్తున్న కృష్ణా, గోదావరి జలాల బోర్డులు
* సాగర్ నీటి వాడకంపై ఎవరి లెక్కలు వారివే
* రబీలో జలాల వినియోగంపై చర్చలకు ముందుకు రాని ఏపీ.. ఎడమ, కుడి కాల్వల కింద నీటిని వాడుకునేందుకు సిద్ధమైన తెలంగాణ
* గోదావరిలో వీడని ‘సీలేరు’ ముడి
* ఎగువ, దిగువ ప్రాజెక్టుల్లో విద్యుదుత్పత్తి లెక్కలు వెల్లడించని ఆంధ్రప్రదేశ్
* విద్యుత్ వాటాలపై సీఈఏ నివేదిక ఇచ్చినా ఆమోదం తెలపని కేంద్రం.. నివేదిక అందిన తర్వాతే బోర్డు నిర్ణయం తీసుకునే అవకాశం
* ఈనెల 31న గోదావరి బోర్డు చైర్మన్  పదవీ విరమణ
* కృష్ణా బోర్డు చైర్మన్ కు తాత్కాలిక బాధ్యతలు?

 
సాక్షి, హైదరాబాద్: నీళ్లు నిప్పవుతున్నాయి.. వాటాలు కొట్లాటకు దారితీస్తున్నాయి.. కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగంపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య వివాదాలు ముదురుపాకాన పడుతున్నాయి! ఇరు రాష్ట్రాల సమస్యలను పరిష్కరించాల్సిన బోర్డులు చేతులెత్తేస్తున్నాయి. నీటి వినియోగం, అవసరాలపై ఇరు రాష్ట్రాలు ఎవరి లెక్కలు వారు చెపుతుంటే తాము చేసేదేమీ లేదని నిస్సహాయత వ్యక్తం చేస్తున్నాయి. ఓవైపు కృష్ణా జలాల పంపిణీ సమస్యలతో బోర్డు సతమతం అవుతుంటే... మరోవైపు గోదావరిలో సీలేరు విద్యుదుత్పత్తి అంశం కేంద్ర వైఖరితో మరింత జటిలం అవుతోంది. నాగార్జునసాగర్ నీటి వినియోగం లెక్కలపై ఆంధ్రప్రదేశ్ చర్చలకు రాకపోవడం, నీటిని వాడుకునేందుకు తెలంగాణ పూనుకోవడం కృష్ణా బోర్డులో కొత్త చిక్కులను తెచ్చిపెట్టనుండగా... సీలేరు అంశం గోదావరి బోర్డును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
 
 సాగర్‌లో తేలని లెక్క..
 నాగార్జునసాగర్‌లో నీటిని ప్రస్తుత రబీ అవసరాలకు ఎలా వినియోగించుకోవాలన్న అంశంపై ఇరు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదరడం లేదు. నీటి లెక్కలపై ఎవరికి వారే తమ వాదనలకు కట్టుబడి ఉన్నారు. నీటి లెక్కలు ఓ కొలిక్కి రాకపోవడంతో నీటి పారుదల శాఖ అధికారుల మధ్య సమావేశం జరగడం లేదు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన సమావేశం శనివారం మరోసారి వాయిదా పడింది. సాగర్ రబీ లెక్కలపై ఆంధ్రప్రదేశ్ చర్చలకు రాకపోవడంతో సాగర్ ఎడమ, కుడి కాల్వల కింద నీటిని వాడుకునేందుకు తెలంగాణ సిద్ధమైంది. రెండు కాల్వల కింద ఇప్పటికే రోజుకు వినియోగించుకుంటున్న 18,800 క్యూసెక్కుల నీటిని యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది.
 
 ఖరీఫ్ అవసరాలకు 12.71 టీఎంసీలు పూర్తయ్యాక, ఎడమ కాల్వ కింద రబీ అవసరాలకు 77.90 టీఎంసీల నీటిని సాగర్ నుంచే వాడుకుంటామని స్పష్టం చేస్తోంది. ప్రస్తుతం సాగర్‌లో నీటిమట్టం 553.8 అడుగుల మేర ఉండగా నీటి లభ్యత 218.23 టీఎంసీలు మాత్రమే ఉంది. ఇందులో కనీస నీటి మట్టం 510 అడుగుల వరకు లెక్కిస్తే వ్యవసాయ అవసరాలకు వాడుకోవాల్సిన నీరు కేవలం 93.791 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ నీరు తెలంగాణ అవసరాలను మాత్రమే తీర్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఎలా వ్యవహరిస్తుందన్నది ఆసక్తి కరంగా మారింది. కుడి కాల్వ కింద నీటితో ఏపీ సైతం రబీకి నీటిని వాడుకునేందుకు ప్రయత్నిస్తే వివాదం మరీ జటిలమయ్యే ప్రమాదం ఉంది.
 
 ఎటూ తేలని ‘సీలేరు’
 గోదావరి నదీ జలాల వినియోగంతో ఎగువ, దిగువ సీలేరు ప్రాజెక్టుల్లో ఆంధ్రప్రదేశ్ కొనసాగిస్తున్న విద్యుదుత్పత్తి వాటాల వివాదాన్ని ఎలా పరిష్కారించాలో తెలియక గోదావరి నదీ యాజమాన్య బోర్డు సతమతమవుతోంది. ఈ ప్రాజెక్టుల పరిధిలో ఉత్పత్తి చేసిన విద్యుత్ వివరాలను ఇటు ఆంధ్రప్రదేశ్ సమర్పించకపోవడం, అటు విద్యుత్ వాటాలను తేల్చేందుకు ఏర్పాటైన కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ(సీఈఏ) కమిటీ తన నివేదిక సమర్పించినా దానిని కేంద్ర విద్యుత్ శాఖ ఆమోదించకపోవడం బోర్డును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
 
 ఎగువ, దిగువ సీలేరు ప్రాజెక్టుల్లో కలిపి మొత్తంగా ఉన్న 740 మెగావాట్ల విద్యుదుత్పత్తిలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు 58:42 నిష్పత్తిలో పంచుకోవాల్సి ఉంది. అయితే ఇప్పటిరవకు ఒక్క మెగావాట్ విద్యుత్‌ను కూడా తెలంగాణకు ఏపీ ఇవ్వలేదు. ఉత్పత్తి చేస్తున్న విద్యుత్ వివరాలను షెడ్యూలింగ్ చేయకపోవడం, సదరన్ రీజియన్ లోడ్ డిస్పాచ్ సెంటర్(ఎస్‌ఆర్‌ఎల్‌డీసీ)కి సమాచారం ఇవ్వకపోవడంతో తెలంగాణ కేంద్రానికి ఫిర్యాదు చేసినా ఇంతవరకు స్పందన లేదు. దీంతో మరోమారు బోర్డును సంప్రదించింది.
 
 దీంతో సీలేరు విద్యుత్ వినియోగంపై నివేదిక ఇవ్వాలని ఎస్‌ఆర్‌ఎల్‌డీసీని బోర్డు కోరింది. దీనిపై కసరత్తు చేసిన నీరజా మాథుర్ కమిటీ ఈ నెల రెండో వారంలోనే నివేదికను కేంద్రానికి సమర్పించినా... దాన్ని విద్యుత్ శాఖ ఆమోదించలేదు. అక్కడ నివేదికకు ఆమోదం దక్కి, బోర్డును చేరితేనే సీలేరుపై ఎలాంటి నిర్ణయమైనా తీసుకునే అవకాశం ఉంది. లేదంటే బోర్డు సమావేశం... ఈనెల 31తో పదవీ విరమణ చేయనున్న చైర్మన్ ఎంఎస్ అగర్వాల్‌కు వీడ్కోలు కార్యక్రమంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఇరురాష్ట్రాలు గోదావరి బోర్డు బాధ్యతలు, సిబ్బంది, నిధుల కేటాయింపులతో పాటు సీలేరు అంశాన్ని సమావేశంలో ప్రధాన ఎజెండాగా చేర్చాయి. వీటితోపాటే తెలంగాణలోని బూర్గంపహాడ్ మండలాన్ని తమ రాష్ట్రంలో కలపాలన్న డిమాండ్‌ను ఏపీ తన ఎజెండాలో చేర్చింది.
 
 గోదావరి బోర్డు పగ్గాలు కృష్ణా బోర్డు చైర్మన్‌కే?
 ఈ నెల 31తో పదవీ విరమణ చేయనున్న గోదావరి బోర్డు చైర్మన్ స్థానంలో కొత్తగా ఎవరిని నియమిస్తారన్నది కేంద్ర జల సంఘం ఇంకా తేల్చలేదు. కృష్ణా బోర్డు చైర్మన్ ఎస్‌కేజీ పండిత్‌కే తాత్కాలిక చైర్మన్ బాధ్యతలు కట్టబెడతారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కృష్ణా  వివాదాలను తేల్చకుండా చేతులెత్తేసిన చైర్మన్... గోదావరి వివాదాలను సైతం నెత్తిన పెట్టుకుంటారా అన్నది పెద్ద ప్రశ్న.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement