సాక్షి, అమరావతి : ప్రస్తుత నీటి సంవత్సరంలో మే వరకూ తాగునీటి అవసరాల కోసం రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టుల్లో లభ్యతగా ఉన్న నీటిలో ఏపీకి 45 టీఎంసీలు, తెలంగాణకు 35 టీఎంసీలు కేటాయించాలని కృష్ణా బోర్డుకు త్రిసభ్య కమిటీ సిఫార్సు చేసింది. ఏపీకి కేటాయించే నీటిలో శ్రీశైలం నుంచి 30 టీఎంసీలు, నాగార్జునసాగర్ నుంచి 15 టీఎంసీలు విడుదల చేయాలని సూచించింది. అలాగే, తెలంగాణకు రెండు ప్రాజెక్టుల నుంచి 35 టీఎంసీలు విడుదల చేయాలని చెప్పింది.
జూన్–జూలైలలో తాగునీటి అవసరాల కోసం ఉమ్మడి ప్రాజెక్టుల్లో 2.788 టీఎంసీలను నిల్వచేయాలని తీర్మానిస్తూ కృష్ణా బోర్డు చైర్మన్ శివ్‌నందన్‌కుమార్‌కు త్రిసభ్య కమిటీ ప్రతిపాదనలను శుక్రవారం రాత్రి పంపింది. వీటి ఆధారంగా నీటి కేటాయింపులు, విడుదల ఉత్తర్వులను కృష్ణా బోర్డు చైర్మన్ జారీచేయనున్నారు. ప్రస్తుత నీటి సంవత్సరంలో కృష్ణా నదిలో లభ్యత, ఇప్పటిదాకా వినియోగం, మే వరకూ తాగునీటి అవసరాలపై చర్చించడమే అజెండాగా హైదరాబాద్‌లో కృష్ణాబోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే అధ్యక్షతన ఏపీ ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి, తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్‌లు సభ్యులుగా ఏర్పాటైన త్రిసభ్య కమిటీ శుక్రవారం హైదరాబాద్‌లో సమావేశమైంది. రెండు దఫాలుగా సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశం వాడివేడిగా సాగింది.
ఇప్పటివరకు ఏపీ, తెలంగాణ 144 టీఎంసీల వినియోగం..
ప్రస్తుత నీటి సంవత్సరంలో సెప్టెంబరు 30 వరకూ ఆంధ్రప్రదేశ్ నాగార్జునసాగర్ నుంచి 4.210, శ్రీశైలం నుంచి 25.865, ఇతర ప్రాజెక్టుల నుంచి 65.649 మొత్తం 95.724 టీఎంసీలను వాడుకుందని తేల్చింది. అదే తెలంగాణ రాష్ట్రం నాగార్జునసాగర్ నుంచి 11.88, శ్రీశైలం నుంచి 12.626, ఇతర ప్రాజెక్టుల నుంచి 24.037 మొత్తం 48.543 టీఎంసీలు వాడుకుంది. రెండు రాష్ట్రాలు కలిసి ఇప్పటిదాకా 144.267 టీఎంసీలు వినియోగించుకున్నాయి. దీంతో సెప్టెంబరు 30 నాటికి సాగర్ కనీస నీటిమట్టానికి ఎగువన 27.532, శ్రీశైలంలో కనీస నీటిమట్టానికి ఎగువన 55.256 టీఎంసీలు వెరసి 82.788 టీఎంసీలు లభ్యతగా ఉన్నట్లు తేల్చింది. నీటి లభ్యత తక్కువగా ఉన్న నేపథ్యంలో తాగునీటి అవసరాల కోసమే నీటిని వాడుకోవాలని బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే చేసిన సూచనకు రెండు రాష్ట్రాల ఈఎన్‌సీలు అంగీకరించారు.
అలా అయితేనే చెన్నైకి నీరు..
కానీ, నీటి లభ్యత తక్కువగా ఉన్న నేపథ్యంలో మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ వాటా నీటిని విడుదల చేస్తేనే.. చెన్నైకి నీటిని సరఫరా చేయగలమని ఏపీ ఈఎన్‌సీ నారాయణరెడ్డి స్పష్టంచేశారు. నీటి లభ్యత తక్కువగా ఉన్న నేపథ్యంలో తమ వాటా ఇవ్వలేమని తెలంగాణ ఈఎన్‌సీ తేల్చిచెప్పారు. ఇలాగైతే చెన్నైకి నీటిని విడుదల చేయలేమని ఏపీ ఈఎన్‌సీ కూడా తెగేసిచెప్పారు. దీనిపై సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే స్పందిస్తూ.. కేంద్ర జల్‌శక్తి శాఖతో సంప్రదింపులు జరిపి ఎగువ రాష్ట్రాలు మహారాష్ట్ర, కర్ణాటకలు వాటా నీటిని విడుదల చేసేలా చూస్తామన్నారు. ఎగువ రాష్ట్రాలు వాటా నీటిని విడుదల చేస్తే చెన్నైకి నీటిని సరఫరా చేయడానికి తమకెలాంటి అభ్యంతరంలేదని ఏపీ ఈఎన్‌సీ నారాయణరెడ్డి చెప్పారు.
నేడు సాగర్ కుడి కాలువకు నీళ్లు
నీటి కేటాయింపులపై బోర్డుకు త్రిసభ్య కమిటీ సిఫార్సులు చేసిన నేపథ్యంలో నాగార్జునసాగర్ కుడి కాలువ కింద తాగునీటి అవసరాల కోసం శనివారం జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు నీటిని విడుదల చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment