
తెలంగాణపై చంద్రబాబు కక్ష కట్టారు: కేసీఆర్
హైదరాబాద్: నాగార్జున సాగర్ మొదలుకుని పోతిరెడ్డిపాడు వరకు తమకు జరిగిన అన్యాయాన్ని కృష్ణా వాటర్ బోర్డు చైర్మన్ ఎస్.కె.జి. పండిట్ కు వివరించామని తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపారు. సోమవారం కృష్ణా వాటర్ బోర్డు చైర్మన్ తో ఆయన సమావేశం అయ్యారు. భేటీ అనంతరం విలేకరులతో మాట్లాడారు.
ఆంధ్రా పాలకులు అడ్డుపడినా జాతీయ నాయకత్వాన్ని ఒప్పించి తెలంగాణ తెచ్చుకున్నామని.. అందుకే తెలంగాణపై చంద్రబాబు కక్ష కట్టారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విఫలమైందని చెప్పడమే చంద్రబాబు లక్ష్యమన్నారు. నీళ్లు, కరెంట్ విషయంలో కుట్ర చేస్తున్నారని, విభజన చట్టం ప్రకారం తమకు దక్కాల్సిన 54 శాతం వాటా దక్కకుండా చేస్తున్నారని వాపోయారు.
తెలంగాణకు జరుగుతున్న అన్ని అన్యాయాలను కృష్ణా వాటర్ బోర్డు చైర్మన్ దృష్టికి తీసుకెళ్లామని వెల్లడించారు. కృష్ణా వాటర్ బోర్డు కచ్చితంగా వ్యవహరించి తెలంగాణకు న్యాయం చేయాలన్నారు. నిష్పక్షపాతంగా వ్యవహరిస్తామని ఎస్.కె.జి. పండిట్ హామీయిచ్చారని కేసీఆర్ తెలిపారు.