సోమవారం శ్రీశైలం నుంచి రెండు గేట్ల ద్వారా విడుదలవుతున్న కృష్ణా జలాలు
సాక్షి, అమరావతి: కృష్ణా నదికి వరదలపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించడం వల్లే ముంపు ముప్పు తగ్గడంతోపాటు ప్రాణ నష్టం తప్పిందని నిపుణులు పేర్కొంటున్నారు. వరదతో శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులను నింపుతూనే అధికారులు ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. శ్రీశైలం నుంచి వరద జలాలను పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా తరలించి తెలుగుగంగలో భాగమైన వెలుగోడు, బ్రహ్మంసాగర్, సోమశిల, కండలేరు, గాలేరు–నగరిలో భాగమైన గోరకల్లు, అవుకు, గండికోట రిజర్వాయర్‌లకు, హంద్రీ–నీవా, ముచ్చుమర్రి ఎత్తిపోతల ద్వారా కేసీ కెనాల్‌కు నీటిని విడుదల చేశారు. ఎగువన కృష్ణా వరద ఉధృతిని నియంత్రించడం వల్లే ప్రకాశం బ్యారేజీపై పెద్దగా ప్రభావం పడలేదని విశ్లేషిస్తున్నారు.
బ్యారేజీలోకి వచ్చిన వరద ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు దిగువకు విడుదల చేశారు. ఈనెల 17న బ్యారేజీకి గరిష్టంగా 7.49 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా సమర్థవంతంగా దిగువకు విడుదల చేశారు. బ్యారేజీ జలవిస్తరణ ప్రాంతంలో కృష్ణా గర్భంలో నిర్మించిన అక్రమ కట్టడాల వల్ల నది సహజ ప్రవాహానికి అడ్డంకులు తలెత్తాయి. ఫలితంగా బ్యారేజీ ఎగువన వరద నీటి మట్టం పెరిగి కొండవీటి వాగులోకి వరద ఎగదన్ని పెనుమాక, ఎర్రబాలెం గ్రామాలను చుట్టుముట్టింది. అక్రమ కట్టడాలను తొలగిస్తే వరద ప్రవాహం ఎగదన్నేదే కాదని సాగునీటి నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం సమర్థంగా వరదను నియంత్రించకుంటే 2009 కంటే అధికంగా నష్టం వాటిల్లేదని పేర్కొంటున్నారు.
ఎప్పటికప్పుడు సమీక్షించిన సీఎం
మరోవైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వరద పరిస్థితులపై ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తూ మార్గనిర్దేశం చేశారు. గోదావరి వరద సమయంలో ముంపు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేసిన ముఖ్యమంత్రి బాధిత కుటుంబాలకు సాధారణంగా అందించే సహాయ ప్యాకేజికి అదనంగా రూ.5 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని కూడా ప్రకటించడం తెలిసిందే. బాధితులకు తక్షణమే నిత్యావసరాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. నిర్వాసితులను పునరావాస ప్రాంతాలకు తరలించడంతోపాటు వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంది.
హంద్రీ–నీవా, ముచ్చుమర్రి ద్వారా సీమకు నీటి తరలింపు
కృష్ణా వరద ఈనెల 1న శ్రీశైలానికి చేరింది. భారీ ప్రవాహం వస్తుండటంతో ఈనెల 6 నుంచే హంద్రీ–నీవా, ముచ్చుమర్రి ఎత్తిపోతల ద్వారా రాయలసీమకు జలాలను తరలించే ప్రక్రియ చేపట్టారు. ఆగస్టు 7 నాటికి శ్రీశైలంలో నీటి మట్టం 870.9 అడుగులకు చేరడంతో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు తరలింపు మొదలైంది. అదే రోజు కుడి, ఎడమ గట్టు విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేశారు. నీటి నిల్వ గరిష్ట స్థాయికి చేరుకోవడంతో ఈనెల 10న శ్రీశైలం గేట్లు ఎత్తేశారు.
కనీస మట్టం చేరగానే సాగర్ ఆయకట్టుకు విడుదల..
నాగార్జునసాగర్ కనీస నీటి మట్టం 510 అడుగులు కాగా ఈనెల 8 నాటికి 513.3 అడుగులకు చేరుకోవడంతో కుడి, ఎడమ కాలువల ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. సాగర్‌లో నీటి మట్టం కనీస స్థాయికి చేరుకున్న వెంటనే ఆయకట్టుకు నీటిని విడుదల చేయడం 2009 తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈనెల 13న సాగర్ 26 గేట్లు ఎత్తేసి దిగువకు వరదను విడుదల చేశారు. అప్పటికి సాగర్‌లో 260.84 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ప్రకాశం బ్యారేజీపై భారం పడకుండా నిరోధించేందుకు ముందు జాగ్రత్తగా సాగర్ పూర్తి స్థాయిలో నిండకుండానే దిగువకు వరదను విడుదల చేశారు. ఆ తర్వాత వస్తున్న వరదతో సాగర్‌లో ఖాళీని భర్తీ చేస్తూ దిగువకు ప్రవాహాన్ని నియంత్రించారు. పులిచింతల ముంపు గ్రామాలను కూడా ముందే ఖాళీ చేయించి ప్రాజెక్టులో గరిష్టంగా 36 టీఎంసీలు నిల్వ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment