వైఎస్‌ మరణానంతర పరిణామాలే వ్యూహం సినిమా | - | Sakshi
Sakshi News home page

వైఎస్‌ మరణానంతర పరిణామాలే వ్యూహం సినిమా

Published Mon, Aug 14 2023 1:28 AM | Last Updated on Mon, Aug 14 2023 1:00 PM

- - Sakshi

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి మరణంతో చోటు చేసుకున్న పరిణామాలను ఏయే రాజకీయ పక్షం ఏ విధంగా తీసుకొని వ్యూహాలను చేసిందో అవే మా ‘వ్యూహం’ చిత్రం కథాంశమని ప్రముఖ సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ అన్నారు. వ్యూహం చిత్ర షూటింగ్‌ విజయవాడ వద్ద కృష్ణానది పరిసర ప్రాంతాల్లో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా తాడేపల్లి, ప్రకాశం బ్యారేజీ పరిసరాల్లో వ్యూహం చిత్రంలో జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

ఈ సందర్భంగా ప్రకాశం బ్యారేజీపై నిర్వహించిన మీడియా సమావేశంలో రామ్‌గోపాల్‌వర్మ మాట్లాడారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి మరణం నుంచి చిత్ర కథాంశం ప్రారంభమవుతుందన్నారు. రెండు భాగాలుగా సినిమా చిత్రీకరిస్తున్నట్లు చెప్పారు. రెండు భాగాలను ఎన్నికలకు ముందే విడుదల చేస్తామన్నారు. విజయవాడ పరిసరాలతో పాటుగా గుంటూరు జిల్లాలో ఈ సినిమా షూటింగ్‌ జరుగుతోందన్నారు. చిత్రంలో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి, భారతి పాత్ర కూడా ఉంటుందని చెప్పారు. ఎవరేమి సినిమాలు తీసినా తనకు అనవసరమని తెలిపారు. తన పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో సినిమా ఉంటుందని పేర్కొన్నారు.

ఏపీలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు ఈ సినిమాలో చూపిస్తున్నట్లు చెప్పారు. తాను జగన్‌కు అభిమానినని, అయితే ఎవరి పైనా ద్వేషం లేదని చెప్పారు. వివేకానందరెడ్డి హత్య అంశం కూడా ఈ సినిమాలో ఉంటుందన్నారు. వివేకానంద హత్య కేసులో నిందితులను ప్రేక్షకులకు చూపిస్తానని వివరించారు. తాను తీసే సినిమాకు దాసరి కిరణ్‌కుమార్‌ నిర్మాతగా ఉన్నారని అంతే తప్పా తన వెనుక ఎవరూ లేరని స్పష్టం చేశారు.

పవన్‌ కల్యాణ్‌, చంద్రబాబు పిలిచి అడిగినా దర్శకత్వం చేయనని ఒక ప్రశ్నకు జవాబు ఇచ్చారు. చిత్రానికి సంబంధించిన టీజర్‌ను స్వాతంత్య్ర దినోత్సవమైన ఆగస్టు 15వ తేదీన విడుదల చేస్తున్నామని వెల్లడించారు. ఇచ్చే వాళ్లు ఉంటే హీరోలు రెమ్యూనేషన్‌ తీసుకోవడంలో తప్పు లేదన్నారు. ఎవరికి ఎంత అనేది మార్కెట్‌ను బట్టి నిర్మాత చూసుకుంటారన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement