సాక్షి, అమరావతి/శ్రీశైలంప్రాజెక్ట్/విజయపురిసౌత్/సత్రశాల(రెంటచింతల)/ధవళేశ్వరం/చింతూరు/పోలవరం రూరల్: పరివాహక ప్రాంతం (బేసిన్)లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణానదిలో వరద ప్రవాహం మరింత పెరగ్గా.. బేసిన్‌లో వర్షాలు తగ్గడంతో గోదావరిలో వరద ఉద్ధృతి తగ్గుతోంది. జూరాల, సుంకేశుల బ్యారేజ్‌ల నుంచి శ్రీశైలం ప్రాజెక్టులోకి గురువారం సాయంత్రం 6 గంటలకు 3,54,343 క్యూసెక్కులు చేరుతున్నాయి.
ప్రాజెక్టులో 884.8 అడుగుల్లో 214.36 టీఎంసీలను స్థిరంగా నిల్వ చేస్తూ.. స్పిల్ వే పదిగేట్లను 12 అడుగులు ఎత్తి 3,19,350, కుడి, ఎడమ గట్టు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ 62,348.. కలిపి 3,81,698 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. నాగార్జునసాగర్‌లోకి 3,40,387 క్యూసెక్కులు చేరుతున్నాయి. జలాశయంలో 589 అడగుల్లో 309.05 టీఎంసీలను నిల్వచేస్తూ స్పిల్‌వే 18 గేట్లు ఎత్తి, విద్యుత్ కేంద్రం ద్వారా మొత్తం 3,00,774 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు.
పులిచింతల ప్రాజెక్టులోకి 2,56,309 క్యూసెక్కులు చేరుతోంది. 169.72 అడగుల్లో 37.95 టీఎంసీల నీటిని నిల్వచేస్తూ స్పిల్‌వే గేట్లు, విద్యుత్ కేంద్రం ద్వారా 2,62,583 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్‌లోకి 2,86,684 క్యూసెక్కులు చేరుతుండగా.. 2,74,150 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. శుక్రవారం కూడా కృష్ణాలో ఇదేరీతిలో వరద కొనసాగనుంది.
ధవళేశ్వరం వద్ద కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక
గోదావరిలో పోలవరం ప్రాజెక్టు నుంచి ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి 13,20,635 క్యూసెక్కుల వరద చేరుతోంది. గురువారం రాత్రి 7 గంటలకు నీటిమట్టం 13.90 అడుగులకు చేరింది. ఇక్కడ రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. 13,11,835 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. భద్రాచలంలో నీటిమట్టం 42.50 అడుగులకు చేరింది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద నీటిమట్టం గురువారం సాయంత్రానికి 33.510 మీటర్లకు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment