శ్రీశైలం డ్యామ్ 10 గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్న దృశ్యం
సాక్షి, అమరావతి/విజయపురి సౌత్ (మాచర్ల)/శ్రీశైలం ప్రాజెక్ట్/సాక్షి, అమరావతి బ్యూరో: పరీవాహక ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా నదిలోకి వరద విజృంభణ కొనసాగుతోంది. ప్రకాశం బ్యారేజీలోకి శనివారం సాయంత్రం ఆరు గంటలకు 5,42,339 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా.. కృష్ణా డెల్టా కాలువలకు వదలగా మిగులుగా ఉన్న 5,38,867 క్యూసెక్కులను 70 గేట్ల ద్వారా సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఈ సీజన్‌లో.. జూన్ 1 నుంచి శనివారం ఉదయం ఆరు గంటల వరకు ప్రకాశం బ్యారేజీనుంచి 903.949 టీఎంసీల కృష్ణా జలాలు సముద్రంలో కలిశాయి. 14 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు గరిష్టంగా సముద్రంలో కలవడం గమనార్హం.
శ్రీశైలంలోకి 5.98 లక్షల క్యూసెక్కులు..
శ్రీశైలం ప్రాజెక్టులోకి 5,98,775 క్యూసెక్కుల ప్రవాహం చేరుతుండగా దిగువకు 5,90,087 క్యూసెక్కులను వదులుతున్నారు. ఆదివారం కూడా శ్రీశైలంలోకి వరద ఉధృతి ఇదే రీతిలో కొనసాగనుంది. నాగార్జునసాగర్‌లోకి 5,39, 930 క్యూసెక్కులు చేరు తుండగా.. అంతే పరిమాణంలో దిగు వకు విడుదల చేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టులోకి 5,62,371 క్యూసెక్కులు చేరుతుండగా 15 గేట్లను ఎత్తేసి అంతే పరిమాణంలో దిగువకు వదులుతున్నారు. కాగా, వంశధార, నాగావళి నదుల్లో వరద తగ్గుముఖం పట్టింది. ధవళేశ్వరం బ్యారేజీలోకి గోదావరి నుం చి చేరుతున్న 2,72,652 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. పెన్నా నదిలో స్థిరంగా వరద కొనసాగుతోంది.
ముంపు ప్రాంతాల్లో మంత్రుల పర్యటన
గుంటూరు జిల్లాలో కృష్ణా వరద ప్రభావిత ప్రాంతాలైన కొల్లూరు మండలం.. బొమ్మవానిపాలెం, చిలుమూరు, జువ్వలపాలెం, భట్టిప్రోలు మండలం.. వెల్లటూరు, తాడేపల్లి మండలం.. చిర్రావూరుల్లో జిల్లా ఇన్‌చార్జి మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున, కలెక్టర్ శామ్యూల్ ఆనంద్‌కుమార్ పర్యటించారు. నీట మునిగిన పంటలను పరిశీలించి రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. నష్టపోయిన పంట వివరాలను వెంటనే నమోదు చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. కాగా, కొల్లూరు కరకట్ట దిగువన వరద ప్రవాహంలో ఆవులవారిపాలెంకు చెందిన సనకా శంకరరావు (48), దాచేపల్లి మండలం పొందుగలలో జాన్ అహ్మద్ (18) గల్లంతయ్యారు.
గుంటూరు జిల్లా వెల్లటూరులో నీట మునిగిన పంట పొలాలను పడవలో వెళ్తూ పరిశీలిస్తున్న మంత్రులు శ్రీరంగనాథరాజు, సుచరిత, ఎమ్మెల్యే మేరుగ, అధికారులు
Comments
Please login to add a commentAdd a comment