తుంగభద్ర డ్యాం 30 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్న దృశ్యం
సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్ట్/హొళగుంద: శ్రీశైలం ప్రాజెక్టులోకి కృష్ణా వరద ప్రవాహం గంట గంటకూ పెరుగుతోంది. గురువారం సాయంత్రం 6 గంటలకు 1,46,278 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటినిల్వ 51.43 టీఎంసీలకు చేరుకుంది. ఇది నిండాలంటే ఇంకా 164 టీఎంసీలు అవసరం. శ్రీశైలం డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 831.90 అడుగులకు చేరుకుంది. అలాగే, కృష్ణా బేసిన్‌లో మహారాష్ట్ర, కర్ణాటకల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దాంతో కృష్ణా, ప్రధాన ఉప నదులు తుంగభద్ర, బీమా వరద ప్రవాహంతో పరవళ్లు తొక్కుతున్నాయి.
ఎగువ నుంచి భారీ వరద వస్తుండటంతో ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్ గేట్లు ఎత్తేసి దిగువకు 1.33 లక్షల క్యూసెక్కుల (11.50 టీఎంసీలు)ను,, తుంగభద్ర డ్యామ్ నుంచి అన్నిగేట్లు ఎత్తి 1.41 లక్షల క్యూసెక్కులు (12.21 టీఎంసీలు)ను విడుదల చేస్తున్నారు. ఇక్కడ వచ్చిన నీరు వచ్చినట్లు కిందకు విడుదల చేస్తున్నారు. ఈ మొత్తం ప్రవాహం శ్రీశైలంలోకి చేరుతోంది. బీమాపై ఉన్న ఉజ్జయిని ప్రాజెక్టులోకి 34 టీఎంసీలు చేరితే నిండిపోతుంది. ఇదే రీతిలో బీమాలో వరద కొనసాగితే.. ఆరు రోజుల్లో ఉజ్జయిని నిండిపోతుంది.
ఆ తర్వాత ఉజ్జయిని గేట్లు ఎత్తి బీమా వరదను దిగువకు విడుదల చేయక తప్పని పరిస్థితి. బీమా వరద జూరాల ద్వారా శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుతుంది. సీజన్ ఆరంభంలోనే ఉజ్జయిని ప్రాజెక్టులో నీటి నిల్వ గరిష్ట స్థాయికి చేరడం రెండు దశాబ్దాల్లో ఇదే ప్రథమం.2019, 2020, 2021 తరహాలో ఈ ఏడాదీ రాష్ట్రంలో కృష్ణా బేసిన్‌లో నీటి లభ్యత పుష్కలంగా ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. తుంగభద్ర వరదతో కర్నూలు జిల్లాలోని సుంకేసుల రిజర్వాయర్ కూడా పోటెత్తుతోంది. దీంతో పదిగేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment