సాక్షి, అమరావతి: ఈ సీజన్‌లో శ్రీశైలం జలాశయంలోకి ఎగువ నుంచి కృష్ణా వరద ప్రవాహం ఏడోసారి తరలి వస్తోంది. పశ్చిమ కనుమల్లో ఆదివారం రాత్రి భారీ వర్షాలు కురవడంతో కృష్ణా వరద ప్రవాహం ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల్లోకి భారీ ఎత్తున చేరుతోంది. ప్రధాన ఉపనది తుంగభద్రలోనూ వరద ప్రవాహం పెరిగింది. భీమాలోనూ వరద ఉద్ధృతమైంది. ఆల్మట్టి, నారాయణపూర్, ఉజ్జయిని, జూరాల, తుంగభద్ర జలాశయాల్లోకి వచ్చిన వరద ప్రవాహాన్ని వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో మంగళవారం శ్రీశైలం జలాశయంలోకి రెండు లక్షల క్యూసెక్కులకుపైగా వరద వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ వరద ప్రవాహం నెలాఖరు వరకూ కొనసాగే అవకాశం ఉందని చెబుతున్నారు.
సోమవారం సాయంత్రం ఆరు గంటలకు శ్రీశైలం జలాశయంలో 57 వేల క్యూసెక్కులు వస్తుండగా.. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, హంద్రీ–నీవా, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలు, విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా 77 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయంలో 209.16 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఈ తరుణంలో తాజాగా ఏడో దఫా శ్రీశైలంలోకి వరద ప్రవాహం వస్తోంది. దీంతో మంగళవారం సాయంత్రం శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తే అవకాశం ఉంది. మొత్తమ్మీద ఈ సీజన్‌లో సోమవారం సాయంత్రం ఆరు గంటల వరకు శ్రీశైలంలోకి 1,415.84 టీఎంసీల వరద ప్రవాహం వచ్చింది. పుష్కర కాలం తర్వాత శ్రీశైలంలోకి వచ్చిన గరిష్ట వరద ప్రవాహం ఇదే కావడం గమనార్హం.
గోదావరి, వంశధారలో స్థిరంగా వరద
గోదావరి, వంశధార నదుల్లో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీలోకి 82,797 క్యూసెక్కుల గోదావరి ప్రవాహం వస్తుండగా అంతే పరిమాణంలో సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. వంశధార నుంచి గొట్టా బ్యారేజీలోకి 6,151 క్యూసెక్కులు వస్తుండగా అంతే స్థాయిలో బంగాళాఖాతంలోకి వదులుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment