మురళీధర్
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాలను ప్రస్తుత వాటర్ ఇయర్‌లో రెండు తెలుగు రాష్ట్రాలకు చెరి సగం పంచాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డును తెలంగాణ కోరింది. 2021–22 వాటర్ ఇయర్‌లో తాత్కాలిక పద్ధతిలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు 50ః50 నిష్పత్తిలో నీటి పంపకాలు చేయాలని విన్నవించింది. ఈ మేరకు కృష్ణా బోర్డుకు తెలంగాణ ఇరిగేషన్ ఈఎన్‌సీ మురళీధర్ మంగళవారం లేఖ రాశారు. ప్రాజెక్టుల వారీగా ట్రిబ్యునల్ నీటి పంపకాలు చేయలేదని, ఉమ్మడి ఏపీకి కేటాయించిన నీటినే రెండు తెలుగు రాష్ట్రాలు పంచుకున్నాయని గుర్తుచేసిన ఆయన.. బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ–2) ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులను చేసేవరకు తాత్కాలిక పద్ధతిలోనే నీటి పంపకాలు చేయాలని లేఖలో పేర్కొన్నారు.
లేఖలో పేర్కొన్న విషయాలు..: కృష్ణా బోర్డు 12వ భేటీలో తెలంగాణ, ఏపీల మధ్య 34ః66 నిష్పత్తిలో ఏడాదికి నీటి పంపకాలు చేయడానికి అంగీకరించాం. మైనర్ ఇరిగేషన్ వినియోగం, పట్టిసీమ నుంచి కృష్ణా డెల్టాకు మళ్లించే గోదావరి నీళ్లు, ఆవిరి నష్టాలను ఈ నిష్పత్తిలో లెక్కించకూడదని నిర్ణయించాం.
►పరీవాహకం, సాగు యోగ్యమైన భూమి, కరువు పీడిత ప్రాంతాలు, జనాభా ఆధారంగా చూస్తే కృష్ణా జలాల్లో తెలంగాణ, ఏపీల వాటా 70.9ః 29.2 శాతంగా ఉండాలి. దీన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ తన అవసరాలను 771 టీఎంసీలుగా పేర్కొంటూ బ్రిజేశ్ ట్రిబ్యునల్ ముందు డిమాండ్ పెట్టాం. 1976లోని బచావత్, 2013 బ్రిజేశ్ ట్రిబ్యునల్స్ బేసిన్ అవతలి ప్రాంతాలకు అనుమతించడానికి ముందు బేసిన్ లోపలి ప్రాంతాలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించాయి.
►బ్రిజేశ్ ట్రిబ్యునల్ తీర్పు అవార్డులోకి వచ్చేవరకు కృష్ణా జలాల్లో లభ్యతగా ఉండే నీటిని 50ః50 నిష్పత్తిన పంచాలి.
►ఆమోదం, గుర్తింపు లేని ప్రాజెక్టుల ద్వారా శ్రీశైలం నుంచి ఏపీ రోజుకు 4.7 టీఎంసీల మేర నీటిని మళ్లించుకుంటోంది. మళ్లించిన కృష్ణా నీటిని నిల్వ చేసుకునేందుకు పెన్నా, ఇతర బేసిన్లలో 300 టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్లు ఉన్నాయి. తెలంగాణకు మాత్రం రోజుకు 0.28 టీఎంసీల నీటిని మాత్రమే ఎత్తిపోతల ద్వారా తీసుకునే సామర్థ్యం ఉంది.
►బేసిన్ అవతలికి కృష్ణా నీటి తరలింపును రెండో అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తెలంగాణ సీఎం వ్యతిరేకించారు. మొదట బేసిన్‌లోని బీడు భూములకు నీళ్లిచ్చాకే బేసిన్ బయటకు తరలించాలని డిమాండ్ చేశారు.
►తెలంగాణ ఆవిర్భవించిన ఏడేళ్లు గడిచినా కృష్ణా బేసిన్‌లోని తెలంగాణ భూములకు నీరు రాలేదు. కృష్ణా నీళ్లను ఏపీ వేరే బేసిన్‌కు తరలిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment