కృష్ణమ్మ కపట నాటకం! | Chandra babu Naidu Fail in Krishna Water | Sakshi
Sakshi News home page

కృష్ణమ్మ కపట నాటకం!

Published Mon, Mar 25 2019 2:08 PM | Last Updated on Mon, Mar 25 2019 2:08 PM

Chandra babu Naidu Fail in Krishna Water - Sakshi

కృష్ణాజలాలను టీడీపీ ఎన్నికల అస్త్రంగా వాడుకుంటోంది. తమ స్వార్థ రాజకీయాల కోసం నీటిని తరలించకుండా కపటనాటకాలాడుతోంది. 12 టీఎంసీల నీటిని జిల్లాలోని 147 చెరువులకు మళ్లించాల్సి ఉంది. కానీ 400 ఎంసీఎఫ్‌టీలతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది. కేవలం కాలువలో నీటినిపారిం చి గొప్పలు చెప్పుకుంటున్నారు. సాగు, తాగునీటి అవసరాలు తీరకున్నా అన్నీ చేశామంటూ నేతలు జబ్బలు చరుచుకోవడం చర్చనీయాంశమైంది. దీనిపై పడమటి మండలాల రైతులు నిట్టూర్పులు వెళ్లగక్కుతున్నారు. ఎన్నికల తాయిలంగా కృష్ణమ్మను వాడుకోవడం టీడీపీ నేతలకు అలవాటైపోయిందని విమర్శలు ఎక్కుపెడుతున్నారు.

చిత్తూరు, బి.కొత్తకోట: కృష్ణా జలాలను టీడీపీ ప్రభుత్వం ఎన్నికల ఎత్తుగడగా వాడుకుంటోంది. జిల్లాకు జలాలను రప్పించి కరువును పారదోలినట్టుగా ప్రచారం చేసుకుంటోంది. ప్రభుత్వం ఇంతవరకు ఒక్క అడుగు పొలం తడపలేదు. ఉపకాలువలో కృష్ణమ్మ నిండుగా పారకున్నా అట్టహాసంగా ప్రచారం చేసుకోవడం తప్ప ఒక్క రైతుకూ ప్రయోజనం కలగలేదు. హంద్రీ–నీవా ప్రాజెక్టు 40 టీఎంసీల కృష్ణా జలాల్లో చిత్తూరుకు 12 టీఎంసీల వాటా దక్కాలి. అనంతపురం జిల్లా నుంచి ఇక్కడికి కృష్ణమ్మను రప్పించి వాటా నీటిని సద్వినియోగించుకునే విషయంలో ప్రభుత్వం ఉదాసీనత ప్రదర్శిం చింది. ఎన్నికలు దగ్గరపడడంతో ఆర్భాటం గా నీటిని జిల్లాకు రప్పించే ప్రయత్నంచేసిచేతులు దులుపుకుంది. అనంతపురం జిల్లా చెర్లోపల్లె రిజర్వాయర్‌ నుంచి నీటిని విడుదల చేయగా జనవరి 21న పెద్దతిప్పసముద్రం మండలం గడ్డంవారిపల్లెలోని హంద్రీ–నీవా పుంగనూరు ఉపకాలువలోకి కృష్ణాజలాలు చేరాయి. అప్పటి నుంచి మెల్లగా కృష్ణమ్మ పారుతూనే ఉంది. పొలాలకు మాత్రం సాగునీరు అందలేదు.

ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ప్రయత్నం
జిల్లాలోకి కృష్ణా జలాలు ప్రవేశించి ఆదివారం నాటికి 63 రోజులైంది. జలాల రాకను పురస్కరిం చుకుని జనవరి 22న ప్రభుత్వం పెద్దతిప్పసముద్రంలో బహిరంగ సభ నిర్వహించి సాగు, తాగునీరు అందిస్తామని ప్రకటించింది. మంత్రులు దేవినేని ఉమా, అమరనాథరెడ్డి తిప్పరాయ చెరువుకు అధికారికంగా కృష్ణా జలాలు మళ్లించారు. అయితే వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. 63రోజులు గడచినా రామకుప్పం మండలానికి నీరు పారలేదు. పెద్దతిప్పసముద్రం నుంచి రామకుప్పం వరకు 190 కిలోమీటర్ల కాలువ ఉంది. ఇప్పటివరకు 170 కిలోమీటర్లు కృష్ణమ్మ ప్రవహించింది. కుప్పం కాలువకు చెందిన 42వ కిలోమీటరు మండల కేంద్రం వీ.కోటకు 4 కిలోమీటర్ల దూరంలోని కృష్ణాపురానికి నీరు చేరింది. మిగిలిన కుప్పం కాలువ పరిధిలోని రామకుప్పం వరకు నీటిని తరలిం చాలంటే మరో 20 కిలోమీటర్లు ప్రవహించాలి. జిల్లాలోని కాలువకు ఇప్పటివరకు చేరింది కేవలం 358 ఎంసీఎఫ్‌టీలే. కనీసం అర టీఎంసీ కూడా లేదు.

ఇదిలావుంటే ప్రస్తుతం పారుతున్న నీటి ప్రవాహం తగ్గించేశారు. 100క్యూసెస్కుల నీటి ప్రవాహం ఉండగా అది సరిపోవడం లేదు. 200 క్యూసెక్కుల నీటిని విడుదలచేస్తేకాని ప్రయోజనం ఉండదు. అయినప్పటికి వచ్చేనెల 11 వరకు నీటిని ఏదోలా ప్రవహింపజేసి ఎన్నికల్లో లబ్ధి పొందాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ చర్యతో 12 టీఎంసీల వాటా నీటిని రప్పించకుండా సీఎం చంద్రబాబు సొంత జిల్లాకే ద్రోహం చేస్తున్నారు.

చెరువులకు కృష్ణమ్మను తరలిస్తా
అధికారంలోకి రాగానే తంబళ్లపల్లె నియోజకవర్గంలోని చెరువులకు హంద్రీ–నీవా ప్రాజెక్టు ద్వారా కృష్ణాజలాలను తరలిస్తా. రైతులకు సాగునీరు అందించేలా కృషి చేస్తా. నియోజకవర్గంలో రైతులు తీవ్రమైన కరువుతో ఇబ్బందులు పడుతున్నారు. ఆ కష్టాలను పారదోలేలా రైతులకు చేయూత అందిస్తా.    – 2017 డిసెంబర్‌ 30న తంబళ్లపల్లె సభలో వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి  

వైఎస్సార్‌ ఉండుంటే సాగునీరు అందేది
నాకు రెండెకరాలు పొలం ఉంది. వైఎస్సార్‌ సీఎంగా ఉన్నప్పుడు హంద్రీ–నీవా కాలువ నుంచి ఉప కాలువలు తీయించి చెరువులను నింపి సాగు, తాగునీరు ఇస్తానని హామీ ఇచ్చారు. ఇది నాలాంటి రైతులకు ఎందరికో ఆత్మస్థైర్యంగా ఉండేది. అదే కాలువలో ఇప్పుడు చంద్రబాబు నీళ్లు పారించి గొప్పలు చెప్పుకుంటున్నారు. ఎకరానికి కూడా సాగు నీరు ఇచ్చింది లేదు. హంద్రీ–నీవాను రాజకీయ ప్రచారానికి తెచ్చారు. అదే రాజశేఖరరెడ్డి ఉండి ఉంటే హంద్రీ–నీవా ద్వారా చెరువులు నింపి పొలాలను సస్యశ్యామలం చేసి ఉండేవారు.    –జి. రెడ్డెప్పరెడ్డి, కనసానివారిపల్లె, కురబలకోట మండలం

నీళ్లున్నా వాడుకోలేని దౌర్భాగ్యం
హంద్రీనీవా జలాలున్నా వాడుకోలేని దౌర్భాగ్యం. ఇది కరువు గడ్డ. ఏటా కరువు పలకరిస్తూనే ఉంది. సాగు, తాగునీటికి ఇబ్బంది పడాల్సి వస్తోంది. హంద్రీ–నీవా నుంచి కాలువలు తీసి చెరువులు నింపితే భూగర్భజలాలు పెరుగుతాయి. అలా చేయకుండా ప్రభుత్వం సాంకేతిక సాకులు చెబు తోంది. ఇప్పటికే 70 శాతానికి పైగా బోర్లు ఎండిపోయి రైతులు దిక్కులు చూస్తున్నారు.    –ఎస్‌.కృష్ణారెడ్డి, గౌనివారిపల్లె,   కురబలకోట మండలం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement