సాక్షి, కరీంనగర్: సర్పంచ్‌లు కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా మారారని మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణ పరిసర ప్రాంతాల్లోని కొన్ని గ్రామాల సర్పంచులు, రాజకీయ నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ గ్రామాలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. కరీంనగర్‌లో మంత్రి గంగుల కమలాకర్ నిర్వహించిన పల్లె, పట్టణ ప్రగతి సమీక్షా సమావేశంలో పాల్గొన్న రసమయి.. ఎవరిని ఇబ్బంది పెట్టడానికి మాట్లాడడం లేదంటూనే సర్పంచ్‌లను సుతిమెత్తగా మందలించారు. సర్పంచ్‌లు ఇంట్లో ఉంటే సమస్యలు పరిష్కారం కావన్నారు.
సీఎం కేసీఆర్ చేపట్టే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో చరిత్రలో గొప్పగా నిలిచిపోయే అవకాశం ఈసారి సర్పంచ్‌లకు ఉందన్నారు. కానీ పట్టణ పరిసర ప్రాంతాల్లోని కొన్ని గ్రామాల్లో భూముల విలువ పెరిగిపోవడంతో కొందరు స్థానిక ప్రజా ప్రతినిధులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో తన నియోజకవర్గంలోని గన్నేరువరం మండలం అగ్రస్థానంలో ఉండగా మానకొండూరు మండలం చివరి స్థానంలో ఉందని.. కరీంనగర్‌కు సమీపంలో ఉండటంతో స్థానిక ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోవడం వల్లే ఆ పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా నిర్లక్ష్యాన్ని వీడి సమస్యలపై దృష్టి పెట్టి గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని రసమయి కోరారు.
Comments
Please login to add a commentAdd a comment